జ్ఞాన స్వరూపుడైన పరమాత్మను పొందుటకు నాలుగు ఆటంకములు కలవు. లయ, విక్షేప, క్షయ, రసాస్వాదములనెడివి. అవి కేవల పదార్థములు.
1. లయ : లయ అనగా నిద్ర. బాహ్య విషయముల నుండి లోనికి త్రిప్పిన మనసు గాఢ నిద్ర (సుషుప్తి) అనే సంసార ప్రభావమువలన గాఢ నిద్రలో ప్రవేశించుచున్నది. సాధకుడు మనస్సును నిద్రలోకి పోనివ్వకుండగ ఆత్మ విచారమందు నిలుపవలయును. అతడు అతి జాగ్రత్తగా మెలకువ కలిగియుండవలెను.
2. విక్షేపము : జాగ్రత్తయొక్క సంస్కారము, సుకృతమువలన మనస్సును బాహ్యేంద్రియ విషయముల మీదనుండి మళ్ళించుటకు ఎన్నియో కష్టములు పడుచుండును. దీనినే విక్షేపము లేక మనశ్చంచలము అనికూడా అందురు. విచారణా శక్తి మూలమున మనస్సును బాహ్య విషయములనుండి లోనికి ద్రిప్పు కొనుచుండవలెను. మనసు అతి సూక్ష్మమైన తన ఆత్మలో ఉండజాలక వెలుపలి ప్రపంచమున తిరుగాడుటకై పరుగెత్తును. విక్షేపమే వెలుపల తిరుగవలెనని తోచెడి మనోవృత్తి, లయ విక్షేపములనుండి మరలించిన మనసు మరల ధ్యానమందు లగ్నము కాగలదు. బలవత్తరమైన అంతర్గత రాగద్వేషములను వాసనలచే బాహ్య విషయములలో కలసి పోవును. దుఃఖములో మునిగియుండును. అప్పుడు ఏక దృష్టి కలిగియుండును కాని, ఈ స్థితిని సమాధి అని తలపరాదు. ఇది క్షయమే. ఇది మనోరాజ్యము, లేక మేడలు కట్టు మనస్సు.
3. కాంక్షయ : మనస్సే లోకవాంఛలను కోరును. ఇది బాహ్యానురాగము. తనలో తాను పూర్వస్థితిని గురించి చింతించుచూ ఉత్తరస్థితి కొరకు ప్రణాళికలు వేయు చుండును. ఇది అంతరానురాగము. దీనిని కాంక్షయ అని అందురు. బాహ్యాకర్షణ శక్తియే విక్షేపము. అనురాగమనెడి సంస్కారము వలన లోపల నుండి సంభవించునదేదియో అదియే కాంక్షయ మనబడును. ఈ కాంక్ష క్షయమే సమాధికి బలము.
.
4. రసాస్వాదము : విక్షేపము తొలగిపోగానే సవికల్పానందము సంభవించును. దీనినే రసాస్వాద మనెదరు. ఇది నిర్వికల్ప సమాధి లేక బ్రహ్మానందమును బొందుటకు ఆటంకము.
5. నిర్వికల్ప సమాధి - విక్షేపమును రూపుమాపుట : పెద్ద బరువును మోయుచున్న వ్యక్తి బరువును క్రిందికి దింపి, ఎట్టి ఆనందమును అనుభవించునో ఒక ధనరాశి నాశించువాడు దాని చుట్టును తిరుగుచున్న సర్పమును చంపిన ఎట్టి ఆనందమును పొందునో, అట్టి ఆనందమును రసాస్వాదనము వలన పొందుచున్నాము. అయితే సర్పమును చంపినంతనే మనస్సు తృప్తి చెందునా?
లేదు. ఆ ధనమును స్వీకరింప గలిగినగాని మనస్సు నిజమైన ఆనందమును అనుభవింప జాలదు. కాని, ఈ నిర్వకల్ప సమాధిని రుచి చూచినపుడు మానవుడు పై మెట్టు ఎక్కినట్లు లెక్క. సర్పమును చంపుటే విక్షేపమును రూపుమాపుట.
(శ్రీ. సా.సూ, పు. 131/132 మరియు జ్ఞానా. పు. 2/5)