సమస్త ద్వంద్వములు అనిత్యములని తలంచి సకలా పేక్షలు విరమించుకొని ఈ ప్రపంచమునకు విరాగియై యే జన ప్రదేశముల నుండ నొల్లక, అడవికి పోయు స్థాననిష్టా గరిష్టుడై, మంత్ర జపసిద్ధి యను యజ్ఞమును చేయుచు, తనకు ఆకలి సమయమున వండిన ఆహారము తినక, ఫలపత్ర తోయవాయు కందమూలములను తినుచు, మితాహార భక్షణుడై, మహర్షిగణముల సమూహములలో చేరి, ఉత్తమ ఋషీశ్వరుల బోధలను వింటూ, జన్మము ముగియు వరకు తిరిగి వెనక మార్గము పట్టక వెనుకటి చింతలను తలపక, క్రమేణా సర్వమును మరచి సర్వేశ్వరుని యందు లీనము కావలెను. ఇక్కడ ఒక్క విషయమును జాగ్రత్తగా యోచించవలెను. ఏమన, అట్టి వానప్రస్థమును కోరు వారికి, భార్యాబిడ్డలుండిన, బిడ్డలకు తగిన మార్గములు చేసి వారి జీవనోపాధికి యే విధమయిన ఆటంకములు కలుగకుండునట్లు చేసి, భార్యను ఒప్పించి, వానప్రస్తుడు కావలయును. అట్లుకాక భార్య తనవెంట వుండుటకు అంగీకరించిన ఆమెను కూడను వెంటతీసుకొని పోవలయును. వెంట వుండినను వారు సోదరీ సోదర భావములతో మెలగవలయును తప్ప, సతీపతుల సంబంధము వుండకూడదు. ఈ సంబంధములో గృహము నందుండినను వాడు వానప్రస్తుడే యగును. అట్లుకాక సతి, భావముండి మిగిలిన వానప్రస్త క్రమములన్నియూ నడచుకొనుచు, ఆడవుల యందుండిననూ వాడు వానప్రస్తుడు కాజాలడు. ఇట్టివాడు గృహస్తుల ఇండ్లయందు మకాములు వేయరాదు. పక్వాహారములు భుజించకూడదు. ఆయా ఋతువుల యందు, ఆయా వ్రతములు సల్పుచుండ వలయును. అనగా వర్షాకాలమున వర్షములలో, యెండాకాలమున యెండలయందును, శీతాకాలమున చలియందును సంచరించవలెను. మానసిక సంబంధమైన వృత్తుల యందు కానీ, అభిరుచిని అణచి నిరంతర భగవత్ చింతనలో తాను సంతసించు చుండవలయును.
(ప్రశ్నవా. పు.10,11)
మనుజుడు గృహస్థుడుగా ఉండి సంకట, సంతోష సౌఖ్యములను పొంది అందులోని నిజార్థములు గ్రహించి 45 సంవత్సరములు లేక 50 సంవత్సరములు పూర్తి నిండగానే, సర్వ సంకట, సంతోషసౌఖ్యములను త్యజించి తాను నిర్మించిన గృహమును వీడి, ఊరినే విడిచి, అరణ్యవాసి కావలెను. అట్టి తరుణమున తన ధర్మపత్నియుండిన ఆమెను సమ్మతి పరచి తన కొడుకులచెంతనో తల్లిదండ్రుల చెంతనే విడువవచ్చును. లేకున్న వెంట తీసికొని వెళ్ళి సతిపతుల భావనలు విసర్జించి, బ్రహచర్యమును ఆచరించి, కేవలము అన్న చెల్లెలు భావముల ప్రవర్తించుచు, ఆహారాదులయందు సైతము మార్పులు కలిగి, కందమూలాదులతో పండ్లు, పాలలో, అట్లు కాకున్న సాత్విక ఆహారుడై, ఆగ్నిచే పూర్తి పక్వము పొందించక మూడవవంతు పక్వపరచి భుజించవలెను. బియ్యమును ఎక్కువ ఉపయోగించరాదు. అట్లు తనకు తాను ఏర్పాటు కలిగించుకొనలేని స్థితిలో, ఊరియందుపోయి బిక్షమెత్తి ఊరియందే భుజించక తన నివాసమైన అడవికి తెచ్చి ఆరగించవలెను. తానేరకమైన ఆహారమును భుజించునో అట్టిదే ఆశ్రయించిన వారికి అందించవలెను కాని, వారికి రుచికి తగినవాటిని తయారు చేయించుట కాని, తెచ్చి యిచ్చుటకాని జరుపరాదు. అది వారు భుజించిన సరే, లేకున్న పండ్లు, పాలలోనే వారిని తృప్తి పరుపవలెను కాని, ఇతరుల కని తన నిమమును మార్చరాదు. ఎట్టి అనానుకూల పరిస్థితులు సంభవించినను, క్రమశిక్షణ మాత్రము విడువరాదు. మార్చరాదు. దీనిని చాలాముఖ్యముగా గమనించవలెను. వీరు అర్చన, దాన ధర్మాదులు ఆచరించరాదు. వారి చెంతనుండినభోజనముకాని, వేరే ఇతర వస్తువులు కాని ఇతరులకు ఇచ్చినను దానముగా తలంచరాదు. దేనినైనను ఇతరుల చెంతనుంచి దానముగా సహితము పుచ్చుకొనరాదు. సర్వులయందు సమాన పవిత్ర ప్రేమ కలిగియుండవలెను. ప్రతి ఆశ్వీజమాసమందు జీర్ణవస్త్రములు వదలి క్రొత్తవాటినిగ్రహించవలెను. వాన ప్రస్తుదాచరించవలసిన వ్రతములలో చాంద్రాయణ వ్రతము ముఖ్యము. ఆ మాసమునందు 15 దినములు తాను తిను ఆహారమందు దినమున కొకముద్ద చొప్పున తగ్గించవలెను. రెండవ పక్షమున క్రమక్రమేణ దినమున కొక ముద్ద చొప్పున హెచ్చుచేయుచుండవలెను. పౌర్ణమి అమావాస్యలందు వట్టి గంజి మాత్రము త్రాగవలెను. వర్షఋతువులో వానలయందు నిలిచి తపస్సు చేయవలెను. హేమంత ఋతువులో తడిగుడ్డలతో తపస్సులు చేయవలెను. క్రమాభ్యాసముగా ఈ తపస్సులు చేయుచు, ఉదయము, మధ్యాహ్నము సాయం సమయములందు స్నానము లాచరించవలెను. వివిధ ఉపనిషద్వాక్యములను అర్థ, అనుభవసహితముగా పఠించుచుండ వలెను. అట్టి వానప్రస్థునికి, ఏదైన శరీర సంబంధమయిన వ్యాధులు వెంటబడిన, తాను భుజించుచున్న ఆహారములుమాని కేవలము జలము, వాయువులే ఆహారముగా స్వీకరించి, ఈశాన్యదిక్కుగా ప్రయాణము సాగించి మరణ పర్యంతము పోవలెను. అట్లు కాక శరీరసంబంధమైన వ్యాధులు లేక సౌఖ్యముగా ఉండిన, పై నిబంధనలను జయించిన తరువాత, అప్రయత్నముగా తనంతట తానే జ్ఞానోదయము ఏర్పడును. ఆ జ్ఞానమువల్ల మోక్షప్రాప్తి లభించును.
(ప్రే. వా, పు. 60,61)