"యోగాభ్యాసము చేయువాని చిత్తము గాలిలేని స్థానమున దీపము ఉండినట్లు విశ్చలముగా ఉండవలెను. ఏయే సమయమున మనసు చలించునో అప్పటికప్పుడే దానిని నిశ్చలముగా పరుగెత్తనీయక అరికట్టుటకు ప్రయత్నించ వలెను. అన్నింటియందూ నేనే యున్నానను భావమును, సర్వభూతములూ నాయందే యున్నవను ఏకత్వమునూ, పొందువాడు అన్ని యోగములనూ సాధించును. అట్టివానికి పరులనియూ, పరమాత్మ అనియూ, భేదము లేకుండును. ఇతరుల సుఖదుఃఖములు తనవిగా భావించును ఇతర హృదయములను బాధింపజేయక సర్వులనూ సర్వేశ్వర భావమున ప్రేమించును. ఇట్టి భావము గలవాడు యోగులలో శ్రేష్ఠుడు",
(గీ.పు.98)
ఎవడు నాయందే చిత్తముంచి శ్రద్ధతో నన్నే ధ్యానించుచుండునో వాడు అందరికంటే శ్రేష్ఠుడు, మహాయోగి. ఈ ధ్యానయోగము, జ్ఞానయోగమునకు అంతరంగ సాధనము. ఇది శ్రద్ధాభక్తి పూర్వకమైనప్పుడే ఈ యోగమునకు విలువ కాని, లేకున్న కొయ్యబొమ్మ వంటిదగును. వీటికన్నింటికీ భగవంతునిపై ప్రేమ గాఢంగా వుండవలెను. అదే భక్తి. ఇటువంటి భక్తి స్థిరముగా గల్గుటకు భగవంతుని గుణగణములు స్వభావ స్వరూపములు, పరిచయమూ మొదలగు వాటిని తెలుసుకొనవలెను.
(గీ.పు.99)