స్త్రీలకు సంక్షేమాన్ని, సౌభాగ్యాన్ని ప్రసాదించే వ్రతం ఏమైనా ఉన్నదా, అని ఒకానొక సమయంలో పార్వతీదేవి ఈశ్వరుణ్ణి ప్రశ్నించిందట. ప్రతి స్త్రీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, పుత్రపౌత్రాభివృద్ధితో సుమంగళిగా జీవించాలని పార్వతి కోరిక. స్రీ లు తమ కుటుంబము గురించి, తమ వంశము గురించి, తమ సౌభాగ్యము గురించి అనేక విధాలుగా పాటుపడుతుంటారు. సమత, సమగ్రత, సమైక్యత, సౌభ్రాతృత్వములను కోరేది స్త్రీలే. ఇట్టిసుగణ సంపన్నులైనస్త్రీలకు ఏదైనా వరప్రసాదమును అనుగ్రహించాలని పార్వతి ఈశ్వరుణ్ణి ప్రార్థించినట్లు పురాణములలో ఉన్నది. దీనికి ఈశ్వరుడు కూడా సంతోషించి స్త్రీలకు ఆస్టైశ్వర్యములను అనుగ్రహించే వరలక్ష్మీ వ్రతము గురించి పార్వతికి తెలియజేశాడు. ఇది స్త్రీలకు ప్రత్యేకమైన వరప్రసాదము.
(స.. సా. సె .2000పు.257)
ప్రాచీన కాలము నుండి ఎందరో సాధ్వీమతల్లులు భారతదేశమునందు ఉద్భవించి, వరలక్ష్మీ వ్రతమును ఆచరించి, వరలక్ష్మీ అనుగ్రహమునకు పాత్రులైనారు. రావణ సంహారం తరువాత రాముడు సీతకు ఆగ్నిపరీక్ష పెట్టాడు. సీత మహాసాధ్వి అన్న విషయం సర్వజ్ఞుడు, సర్వ వ్యాపకుడు, సర్వశక్తిమయుడైన రామునికి తెలియనిది కాదు. కాని, లోకులు కాకులు. వారిలో ఎలాంటి అనుమానాలకూ అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశ్యంతోనే రాముడు ఈ పని చేశాడు. సీత ఏమాత్రమూ సందేహించకుండా ఆగ్నిపరీక్షను ఎదుర్కొని తన పాతివ్రత్యాన్ని నిరూపించింది. సత్యశీలురు, పవిత్రహృదయులైన స్త్రీలు ఎలాంటి అనుమానాలకూ అవకాశమివ్వరు.
(స.. సా. సె..2000పు.257/258)
స్త్రీలకు సుమంగళత్వాన్ని, సౌభాగ్యాన్ని, సిరి సంపదలను, అప్టైశ్వర్యాలను అనుగ్రహించేది వరలక్ష్మి. కోరిన వరములను ప్రసాదించేది కనుకనే వరలక్ష్మికి ఈ పేరు వచ్చింది. సావిత్రి, చంద్రమతి, దమయంతి మున్నగు సాధ్వీమణులు వరలక్ష్మీ అనుగ్రహప్రసాదంచేతనే అంతటి శక్తి సామర్థ్యాలను పొందగలిగారు. స్త్రీలు వరలక్ష్మీ నోమును నోచటంచేత సిరి సంపదలు అభివృద్ధి అవుతాయి, ఆనందము చేకూరుతుంది. కాని, ఈ ఆధునిక యుగంలో ఇలాంటి పవిత్రమైన వ్రతములను ఆచరించటం తగ్గిపోయింది. కనుకనే గృహములలో పవిత్రత లోపించింది. ఇల్లును చూసి ఇల్లాలిని చూడమన్నారు. ఇల్లు పరిశుద్ధంగా ఉందంటే ఇల్లాలి హృదయం కూడా పరిశుద్ధంగా ఉంటుందని అర్థం. ప్రాచీనకాలంలో ఇళ్ళు ఎంతో పరిశుద్ధంగా ఉండేవి. ఎందుకంటే, ఆనాటి స్త్రీల హృదయాలు అంత పరిశుద్ధమైనవి. కానీ, ఈనాడు ఎక్కడ చూసినా మాలిన్యం, మాలిన్యం! త్రాగే నీరు. తినే తిండి, పీల్చే గాలి కలుషితమైపోయాయి. మానవుని మనస్సుకూడా మలినం కావటంచేతనే సర్వమూ మలినమైపోయింది.
(స.సా.. సె.2000 పు.259)
ఈశ్వరుడు పార్వతికి వరలక్ష్మీ వ్రత ప్రాశస్త్యమును వివరించి "పార్వతీ! నీవు స్త్రీజాతిచే దీనిని ఆచరింపజేసి వారి కష్టనష్టములను రూపుమాపి, శాంతిసౌఖ్యాలను అందించు." అన్నాడు. ఈ వ్రతమును చేసుకోవటం చాలా సులభమే. అయితే ఈనాడు మీకు స్థానబలము, దైవబలము తోడుకావటం చాలా అదృష్టం. ఏ వ్రతమునైనా పవిత్రభావంతో, ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో ఆచరించాలి. అప్పుడే మీకు ఎంతటి ఫలితమైనా లభిస్తుంది. భగవదనుగ్రహంచేత మీరు చేయలేని పని ఈ జగత్తులో లేదు; ఎంతటి ఘనకార్యమునైనా మీరు సాధించవచ్చును.సావిత్రి మరణించిన పతినే బ్రతికించుకోగల్గినప్పుడు ఇంక ఈ లోకసంబంధమైన విషయాలు ఎంతమాత్రము! భూమిని ఆకాశంగా మార్చవచ్చు. ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చు. అయితే పవిత్రమైన హృదయంలో ప్రార్థించాలి. వారు ఇలాంటివారు. వీరు అలాంటివారు అంటూ ఊరివారి సుద్దులు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తే మీరు తలచిన కార్యములు ఎలా సిద్ధిస్తాయి? లోకసంబంధమైన సుద్దులను వదలిపెట్టి, లోకేశుణ్ణిఆశ్రయించినప్పుడే మీయొక్క సర్వకార్యములు సిద్ధిస్తాయి.
(స .సా.. సె 2000పు.261)
వరలక్ష్మీ వ్రతము నాచరించినప్పుడు స్త్రీలు "దీర్ఘ సుమంగళీ భవ, పుత్రపాత్రాభివృద్ధిరస్తు, ఆయురారోగ్య ఐశ్వర్యాధి వృద్ధిరస్తు" అని దీవెనలు పొందుతున్నారు. ఈ వ్రతము ఇటువైపు ఏడు తరములను, అటువైపు ఏడు తరములను
మొత్తం పద్నాలుగు తరములవారిని రక్షిస్తుంది. కనుకనే, ఈశ్వరుడు పార్వతికి ఈవ్రత మహత్మ్యమును తెలియజేసి, స్త్రీలచేత ఈ వ్రతమును ఆచరింపజేసి వారికి సుభిక్షమును, సౌభాగ్యమును ప్రసాదించవలసిందని కోరాడు. ఈ వరలక్ష్మీ నోమును నోచిన తరువాతనే సావిత్రి, అనసూయ, సుమతి సుఖసంతోషాలను పొందారు.దోషాలను పరిహారం చేసి, పవిత్రతను అభివృద్ధి గావించి, దివ్యత్వాన్ని అందిస్తుంది వరలక్ష్మీ,వరలక్ష్మీని భారతీయులు లోకమాత’ అని పిలుస్తున్నారు. మన భారత దేశంలో మాత అనే పదమునకు ఎంతో గొప్ప విలువ ఉన్నది ఎవరికైనా బాధ కలిగినప్పుడు అమ్మా! అంటారుగాని, "అయ్యా, అప్పా," అనరు. అమ్మ అనే పదము ఎంతో విలువైనది. పవిత్రమైనది. పిల్లలకు మొట్టమొదట నోటికి వచ్చే పదము ఇదే. తల్లి ప్రేమ వర్ణనాతీతమైనది. కనుకనే భారతీయ సంస్కృతి “మాత పిత, గురువు, దైవము" అని తల్లికి ప్రథమస్థానంఅందించింది. తల్లిని ప్రేమించాలి, ఆమె ఆజ్ఞను శిరసావహించాలి. తల్లిని సంతృప్తి పరచకపోతే లోకంమిమ్మల్ని ఛీకొడుతుంది. తల్లిని సంతృప్తి పరచితే లోకాన్నంతటిని సంతృప్తి పరచినట్లే!
ప్రేమస్వరూపులారా! పవిత్రమైన వరలక్ష్మీవ్రత మహాత్మ్యమును గురించి ఎంతైనా చెప్పవచ్చును. ఆడవారు లోకమాతయైన వరలక్ష్మిని పూజించి ఆశ్రయించి, ఆనందించి, ఆ ఆనందాన్ని పదిమందికి పంచాలి. వారికి తగిన ఉత్సాహప్రోత్సాహములను మగవారు అందించాలి; ఖర్చు ఎక్కువవుతుందని అడ్డు చెప్పకూడదు. భార్య వ్రతం చేయటం భర్తయొక్క ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధికే కదా! కాబట్టి, భార్య చేసే పూజకు భర్త ఏమాత్రమూ అడ్డు తగలకూడదు. ఒకవేళ తనకేమైనా ఇబ్బందిగా ఉంటే మంచి మాటలతో నచ్చజెప్పవచ్చును. అంతేగాని, "నేను మగవాడిని కదా, అని తన ఇష్ట ప్రకారం ప్రవర్తించకూడదు. నిజం చెప్పాలంటే, మగవారికంటే ఆడవారికే శక్తి అధికంగా ఉంటుంది. ఆడవారు పతికోసం ప్రాణాలను సహితం త్యాగం చేస్తారు. మరణించిన పతిని బ్రతికించుకుంది సావిత్రి. కాని, మరణించిన సతిని బ్రతికించుకున్న పతి ఎవరైనా ఉన్నారా? గౌరవం, మర్యాద, త్యాగం, సంతృప్తి, సౌశీల్యము వంటి సద్గుణాలు స్త్రీలలోనే ఉన్నాయి. పురుషులలో మాత్రంక్రోధం, మొండితనం, హటమువంటి దుర్గుణాలు అధికంగా ఉంటాయి. కనుకనే, పురుషులకంటే స్త్రీలకే అధిక గౌరవం ఇవ్వబడుతోంది. లగ్న పత్రికలపై కూడా “ శ్రీమతి &శ్రీ" అని ముందు స్త్రీ తరువాత పురుషునిపేరు వ్రాస్తారు. రాధాకృష్ణులు, లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు అనే పేర్లలో కూడా స్త్రీ పేరే ముందున్నది.స్త్రీలు లక్ష్మీస్వరూపులు. వారిని గౌరవించినప్పుడే లోకం సుక్షేమంగా, సుభిక్షంగా ఉంటుంది. గుణవంతులైన స్త్రీలున్న రాజ్యం నిరంతరము సుక్షేమంగా ఉంటుంది. ప్రపంచ యుద్ధాలలో ఎన్నో రాజ్యాలు నాశనమైపోయాయి. కాని, గుణవంతులైన స్త్రీలు ఉండటంచేతభారతదేశమునకు మాత్రం ఎట్టి ప్రమాదమూ సంభవించలేదు. భారతదేశమునకు పవిత్రత స్త్రీల వల్లఏర్పడినదే. కనుక స్త్రీలను గౌరవించి, వారిని ఆనందపరచాలి. అప్పుడే దేశం నిత్య కల్యాణం, పచ్చతోరణంగా వర్ధిల్లుతుంది.
(స.పా.సి.2000పు. 263/264)
గత జీవుడగు పతిన్ బ్రతికించి యముగెలిచె
సావిత్రి భారత సాధ్వికాదా
తన సత్యమహిమచే దావాగ్ని చల్లార్చి
ధృతి చంద్రమతి భారతీయ కాదె
కుల సతిత్వము అగ్నిగుండాన ప్రకటించె
సీత భారత ధరాజాత కాదె
కనిసి దుర్మద కిరాతుని బూదిగావించె
దమయంతి భారత రమణి గాదె
సత్యసాగర వేష్టి తక్ష్వా తలమున
సంపన్న కిది కాదె పంటభూమి
ఆస్త్రీలవ్రతములకెల్ల వరలక్ష్మీ వ్రతమె మిన్న.
(శ్రీ.. సె.2000 పు.27)