పుత్రపౌత్రాది రూపమున నిరతిశయముగా వర్థిల్లెడి ఐశ్వర్యమునను గ్రహింపుడు అని అర్థము. ధర్మము వేద స్వరూపమగుట చేతనే పరమేశ్వరునకు ధర్మ: అని పేరు ప్రసిద్ధము. "రామోవి గ్రహవాన్ ధర్మః" అని రామాయణము కీర్తించినది. "సర్వభూతానాం ధారణాత్ ధర్మః" సర్వ భూతములను ధరించుటచేతను, ధర్మముచే ఆరాధింప బడుట చేతను పరమేశ్వరునకు "ధర్మః" అని సార్థక నామము.
"ధర్మో విశ్వస్య జగత: ప్రతిష్టా” ఇలాంటి పవిత్రమైన ధర్మమును ఎవరికి తోచినట్లు వారు వాఖ్యానము చేసి వారి స్వార్థమునకు తగినట్లు అర్థములు తెలుపుచూ, ధర్మస్వరూపమును విరూపము చేయుచున్నారు. వేద, దేవ అనుపదములు, శబ్దములు రెండును పర్యాయపదములై వర్ధిల్లుటయు శ్రుతుల యందు స్పష్టముగా కనిపించు చున్నది. “స్వయం సర్వం వేత్తి వేదః" అని వేదశబ్దము నిర్వచింపబడినది. అనగా సర్వజ్ఞుడు వేదస్వరూపుడైన బ్రహ్మ అని అర్థము.
(లీ.వా.పు.19)