నేను ఈ మధ్య ఒక విషాదకరమైన వార్తను పత్రికలలో చూచాను. ఒక అమాయకురాలైన తల్లి, తన ముగ్గురు పిల్లలను సాకలేక, ఆకలి అమ్మా! అంటుంటే అన్నం పెట్టలేక, ఆపిల్లలకు విషం యిచ్చింది. తాను త్రాగింది. అందరూ మరణించారు. ఆ వార్తను చూచి నేను చాలా బాధపడ్డాను. నా హృదయం ద్రవించింది. ఇది నిజంగా దురదృష్టకర సంఘటన. నేను ఇప్పటివరకు ఎన్నో పనులు చేసాను. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి, విద్యా సంస్థలను నెలకొలిపి, ఉచితంగా చదువు చెప్పిస్తున్నాను. వందల కోట్ల రూపాయిలు వెచ్చించి రెండు సూపర్ స్పెషాలిటి ఆసుపత్రులు నిర్మించాను. (పుట్టపర్తి, బెంగుళూరు). లక్షలు వెచ్చించినా నయంకాని వ్యాధులకు ఉచితంగా చికిత్సలు చేయిస్తున్నాను. వేలాది మందికి ఉచితంగాగుండె ఆపరేషన్లు కూడా చేయిస్తున్నాను. మరియు వందల కోట్ల రూపాయిలు ఖర్చుచేసి ఉచితంగా వందలాదిగ్రామాలకు మంచినీటిని అందిస్తున్నాను. విద్య, వైద్యం, నీరు ముఖ్యమైన ఈ మూడు ఉచితంగా అందిస్తున్నాను. పేద పిల్లలను పోషించే నిమిత్తమై ఇప్పుడు ఒక క్రొత్త ప్లాన్ వేస్తున్నాను. అనంతపూర్ జిల్లాలో నా విద్యార్థులను, అధ్యాపకులను సర్వే చేయించడానికి నవంబర్ 1వ తేదీగ్రామాలకు పంపుతున్నాను. పేద పిల్లలకు అన్నం పెట్టి, ఉచితంగా వస్త్రములనిచ్చి, చదువు చెప్పించి, వారికి సమాజంలో గౌరవప్రదమైన స్థానం కలిపించాలని సంకల్పించుకున్నాను. మొదటి దశలో వెయ్యి పేద కుటుంబాలను గుర్తించి ఒక్కొక్క కుటుంబానికి లక్షరూపాయల చొప్పున Fixed Deposit చేసి, వచ్చే వడ్డీ ద్వారా ఆ పేద పిల్లలకు అన్నం, వస్త్ర సౌకర్యములు ఏర్పాటుచేసి, మా విద్యార్ధులచేత వారికి ఉచితంగా విద్యను నేర్పించాలని సంకల్పించుకున్నాను. క్రమ క్రమేణా ఈ పథకమును అభివృద్ధిపరచదలిచాను. ఈ నవంబర్ 1వ తేదీ నుంచి దీనిని ప్రారంభిస్తున్నాను. కొన్ని లారీలలోచీరెలు, పంచెలు, పిల్లలకు చౌక్కాలు, నిక్కర్లు మరియు అన్నం ప్యాకెట్లు యిచ్చి పల్లెలలో పంచడానికి మా విద్యార్థులను పంపుతున్నాను. ఇంతేకాదు, నా సంకల్పం వజ్ర సంకల్పం. నా ఆలోచనలు ఎప్పుడూ పరోపకార సంబంధమైనవిగానే ఉంటాయి. స్వార్థమనేది నాలో ఎక్కడా కనిపించదు. ఆ బీదకుటుంబాలకు తలా ఒక చిన్న ఇల్లు కూడా నిర్మించాలని నా సంకల్పం. అందులో తల్లిదండ్రులకు ఒక గది, పిల్లలుండటానికి మరోగది. మరియు చిన్న వంటగది, స్నానాలగది కూడా ఉంటాయి. ఈ విధంగా ప్రధమ దశలోనే వేయి పేద కుటుంబాలకు సహాయం చేయదలిచాడు.
విద్యార్ధులారా! ఈ పవిత్రమైన కార్యక్రమంలో మీరందరూ పాల్గొనాలి. ధనసంపాదన కోసం మీరు బయటకు పోకూడదు. నిజంగా మీరు బయటకుపోతే భిక్షమెత్తిన వారవుతారు. ఇక్కడ ఏ విధమైన ఖర్చులేకుండా మీరు చదివినారు. బయటకుపోయి ఇష్టం వచ్చినట్లుగా సంపాదించుకుంటూ కూర్చుంటే దీనివలన వచ్చిన ఫలితమేమిటి? మీరు కూడా ఉన్నటువంటివారు కాబట్టి మీరు కూడా ఈ సేవలలో ప్రవేశించాలి. మీ పరిస్థితి నేను చూచుకుంటాను. మా తండ్రి ఎట్లా? అని మీరు సందేహించనవసరం లేదు. ఉపకారం చేసినవారికి, దైవం ఎప్పుడూ అపకారం చేయడు. విశాలమై భావాలను పెంచుకోండి. సంకుచిత భావాలను విడనాడండి. దుర్మార్గములలో ప్రవేశించకండి. అయితే ఈనాడు చాలామంది. అపవిత్రమైన మార్గములలో ప్రవేశించి, పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. కాని, ఇన్ని విన్నటువంటి మీరు పశువులు కాకండి. ‘నేను మానవుడ్ని అని చింతించండి. మావనతా హృదయాన్ని అభివృద్ధి పరచుకోండి. పశుగుణములను దూరం చేసుకోండి, పశువులు ఏ చదువులు చదువలేదు, ఏ డిగ్రీలు తీసుకోలేదు. భుజిస్తున్నాయి. వంటిని వంచి పని చేస్తున్నాయి. మనం కూడా పని చేయాలి. కర్తవ్యకర్మల నాచరించాలి. పల్లెలలో నున్న పిల్లలను ఉద్ధరించాలి.వారికి చదువులు నేర్పించాలి. సదుణములను నేర్పాలి. సరియైనవారిగా తీర్చిదిద్దాలి. ఈ విధంగా పనులు చేస్తూ పోతే పవిత్రమైన భారతదేశము తిరిగి దేదీప్యమానంగాఆదర్శవంతమైన భారత దేశంగా రూపొందుతుంది. ఈ విధమైన కార్యములలో మీరు ప్రవేశించి, సరియైనటువంటి మానవత్వాన్ని మీరు నిలుపుకుంటారని నేను ఆశిస్తున్నాను. మీరు చదువుకున్నవారు. చదువుకున్నవారికి ఒక Season ఒక Reason ఉంటుంది. కాని Season, Reason లేని మృగాలవలె మీరు కూడనూ ప్రవర్తించ కూడదు. మీరు అసత్యమాడకూడదు. అన్యాయం చేయకూడదు, ఆక్రమాలలో ప్రవేశించకూడదు. అప్పుడే మీరు ఆదర్శ ప్రాయులైన విద్యార్థులుగా రూపొందుతారు. సత్యసాయి ఇనిస్టిట్యూట్ కు పేరు ప్రతిష్టలు తెచ్చిన వారవుతారు. మీ నుండి నేను ఏమీ కోరటం లేదు. ఎక్కడికి పోయినా మీరు మంచి పేరు తెచ్చుకోండి. స్వామి ఆశయాలను ఆచరణలో పెట్టండి. ఆశయాలకు తగినట్లుగా నడుచుకోండి.
(శ్రీ డి.2000 పు.14/15)