శ్రీరాముడు మానవులకు అత్యంత సన్నిహితుడు.ఏ దేశంవారైనా, ఏ జాతివారైనా, ఏ వయస్సువారైనా రామతత్త్యమనే సత్యత్వాన్ని నిత్యత్వాన్ని గుర్తించడానికిప్రయత్నించాలి. శ్రీరాముడు ఆదర్శపుత్రుడు, ప్రతి కుటుంబంలోను ఆదర్శ పుత్రుడు అత్యవసరం, పట్టాభి షేకము జరుగబోతున్న సమయంలో - తండ్రి ఆజ్ఞను శిరసావహించి రాజ్య భోగములను త్యాగం చేసి అడవులలో ప్రవేశించాడు. పితృవాక్య పరిపాలనలో రాముడు అత్యంత ఆదర్శప్రాయుడు. ఇంక రాముడు ఆదర్శపోదరుడు. తన సోదరులను ప్రాణ సమానంగా ప్రేమించి తనప్రేమను వారందరికీ సమంగా పంచి పెట్టాడు. ప్రతి కుటుంబము నందు సోదరుల మధ్య ఉండవలసిన అన్యోన్యతకు ఆదర్శాన్ని నిరూపించాడు. శ్రీరాముడు ఆదర్శ పతి, వాల్మీకి, శ్రీరాముని గుణ గణము లందు ఏక పత్ని, ఏక బాణము, ఏక వాక్కు ప్రధాన మైనవిగా వర్ణించాడు. దేహములోనున్న అన్ని అంగములనూ పోషించేది, రక్షించేది గుండె ఒక్కటే! అదేవిధంగా, పతికి సతి ఒక్కతే! సతికి ప్రతి ఒక్కడే! ఇట్టి ఏకత్వాన్ని లోకానికి గుర్పింప జేసే నిమిత్తమై లోకరీతిగా తన ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు.
ఇంక శ్రీరాముని మించిన ఆదర్శ మిత్రుడు మరొకడు లేడు. ఈనాడునీ జేబులో డబ్బు ఆధికంగా ఉన్నప్పుడు, నీవు మంచి అధికార హోదా కల్గియున్నప్పుడు అందరూ "హలో..హలో.." అంటూ నీకు మిత్రులౌతుంటారు. కాని అధికారమును, ధనమును కోల్పోయిన తరువాత ఒక్క మిత్రుడు కూడా నీ సమీపానికి రాడు. కానీ, రాముడు అటువంటి మిత్రుడు కాడు. కష్టములందైనా, సుఖము లందైనా తన మిత్రుని సమంగా ఆదరించి ఆప్యాయంగాప్రేమించిన వాడు, గుహుడు చాలా బీదవాడు. అతడు పడవ నడిపేవాడు. అట్టివాని మిత్రత్వాన్ని రాముడు చక్కగా వర్ణిస్తూ - "నీవు నా నాల్గవ తమ్ముడవు" అని అన్నాడు. ఈ విధంగానే, ఎవరు తనను ఆశ్రయించారో, ఎవరు తనను ప్రేమించారో, ఎవరు తనకు శరణా గతులైనారో వారందరినీ తన మిత్రులుగా ఆదరించి వారికి తగిన శక్తి సామర్థ్యములను చేకూర్చుతూ వచ్చాడు శ్రీరాముడు.
శ్రీరాముడు ఆదర్శ మిత్రుడే కాదు, ఆదర్శ శత్రువు కూడా! సాధారణంగా లోకంలో శత్రువులను వంచించిమోసగించి హింసించడానికి ప్రయత్నింస్తుంటారు. కానీ, రాముడు ఆవిధమైన కుత్సత మార్గముల యందుప్రవేశించక తన శత్రువు పట్ల కూడను ధర్మ మార్గమును అనుసరిస్తూ వచ్చాడు. రామ రావణ యుద్ధం జరుగు తుండగా - రాముని బాణముల తాకిడికి రావణుడు తాళ లేక పోయాడు. అతని అస్త్ర శస్త్రములన్ని క్రింద పడిపోయాయి. రావణుడు చాలా అలసి పోయాడని రాముడు గుర్తించాడు. ఇలాంటి సమయంలో శత్రువునైనా చంపకూడదు. బలహీమని, అలసిపోయిన వానిని చంపడం గొప్పతనం కాదు. శత్రువు సరి సమానమైన శక్తి సామర్థ్యములలో ఉన్నప్పుడే అతనితో యుద్ధం చేయాలి. కనుకనే, రాముడు తన అస్త్ర శస్త్రములను కూడా క్రింద పెట్టి - "ఓ రావణా! నీవు చాలా అలసి పోయావు. కనుక, నీవు యుద్ధం చేయడానికి ఇది సరియైన సమయం కాదు. నీవు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకొని రేపటి దినమున తిరిగి యుద్దానికి సంసిద్దుడవై రా!" అన్నాడు. సకల దేశీయులకూ, సర్వమానవులకూ ఇది ఆదర్శవంత మైన చరిత్ర.
(స.సా.జూ.94 పు.150/151)
"రామ" అనేటటువంటి తత్వమునకు కొన్ని అర్థములు గుర్తించాలి. ఆసలు, మానవజన్మమునకు మూలకారణమేమిటి? చేసిన పాపము. అనుభవించిన తాపము, అజ్ఞానము. ఈమూడే కారణములు. అదే "ర,అ,మ" ఈ మూడు చేరినప్పుడే "రామ అయిపోతుంది. “ర అనగా అగ్ని బీజము, " అ " చంద్రబీజము "మ" సూర్యచీజము. అగ్ని బీజము ఏమి చేస్తుంది? సమస్తము భస్మము చేస్తుంది. కనుక మానవుడు చేసిన పాపములను భస్మముచేసేటటువంటిది "ర"కారము. మానవుడు అనుభవించిన తాపమును చల్లార్చి శాంతినిచేకూర్చేటువంటిది చంద్రబింబము. అదే "అ"కారము. సూర్యుడు అజ్ఞానమనే అంధకారాన్ని నిర్మూలనము గావించి ప్రకాశవంతమైనటు వంటి వెలుగును అందించేటటువంటి వాడు. "రామ" అనే నామము మన పాపమును తాపమును అజ్ఞానమునుకూడ ఒక్క తూరి పరిహారము చేస్తుంది. “రామ్"అనేటటువంటి పదము లోపల రా అనగా మనోద్వారము తెరుస్తూ ఉంటుంది. ఈ "రా" అనే ద్వారము నుండి మనము చేసేటటువంటి పాపములు అన్ని బయట పడిపోతున్నాయి. అంతేకాదు బయట పోయినటువంటి ఈ పాపము తిరిగి లోపలికి ప్రవేశించకుండా మ్"పాపమును పరిహారమును గావించి బయటకు తరిమే నిమిత్తమూ ప్రయత్నిస్తుంది. పోయిన పాపములు తిరిగి ప్రవేశించకుండా యుండే నిమిత్తమై ద్వారమును మూసివేస్తుంది. రామ నామమునకుండిన మాధుర్యము, రామనామమునకు ఉండిన పవిత్రత, రామనామమునకు ఉండిన దివ్యత్వము అర్థము చేసికొని గుర్తించాలి. కనుకనే తెలిసి రామ చింతన చేయవే మనసా! అని త్యాగరాజు పల్కినాడు. తెలిస్తే చాలసుఖము, తెలియక పోయినను రామనామము పాపములను పరిహారము చేస్తుంది. కాబట్టి, రామ మాధుర్యాన్ని మనము ఆనందమైన హృదయంతో నిశ్చలమైన నిర్మలమైన నిస్వార్థమైన భావంతో దీని నారగించటానికి ప్రయత్నించాలి.
(స.సా.జూ 1989 పు.144/145)
(చూః ధర్మరాజు, మంగళవారము, ప్రాయశ్చిత్తం, వాల్మీకి)