గాయత్రీ జపమును త్యజించువారు అర్థమును తెలియని వారగుదురు. దీనినే మనువుకూడా నొక్కి చెప్పెను. ముఖ్యముగా బ్రాహ్మణునికి గాయత్రి యే జీవనమని కూడా తెలిసెనుకదా? సత్యమే. మానవ పురుషుని బుద్ధులను ప్రేరేపింపజేయు దివ్యతేజస్సును ధ్యానము చేయుట కంటెను పవిత్రమైన దేది యున్నది. మనలను పాపకృత్యముల జోలికి పోకుండా కాపాడునట్టి ప్రార్థనకంటే గొప్ప సుగుణము వేరేమున్నది.? పురుషునకు సద్గుణ పోషణకంటె గొప్ప రక్షణ లేదు. బ్రాహ్మణుడు గాయత్రి మంత్రసారమైన బ్రాహ్మణత్వమును కోలుపోడని వేదాధ్యయనమునకు శక్తిచాలని వాడైనను చివరకు గాయత్రినైననూ విడువ రాదని, మనువు పదే పదే నొక్కి చెప్పెను. కదా? అందుకనే గాయత్రికంటే గొప్ప శోధనము లేదని "గాయత్య్రాస్తు పరం నాస్తి శోధనం" అని స్మృతి కూడనూ చెప్పెను.
(ధ.పు.55/56)