రావణుడు మరణించిన శుభవార్తను సీతకు తెలియజేయుమని రాముడు హనుమంతుని ఆజ్ఞాపించాడు. ఇట్టి ఆనందకరమైన వార్తను సీత చెవిలో ఎప్పుడు వేయగలనా అని ఎదురు చూస్తున్న హనుమంతుడు తక్షణమే ఒక ఎగురు ఎగిరిఅశోకవనమునకు చేరుకున్నాడు. అక్కడ సీత ఒంటరిగా కూర్చుని,
"ఈ చెఱలోనుంచి వెళ్ళేనా?
ఇక నే రాముని కన్నుల చూచేనా?
ఆ శ్రీరాముని కన్నుల చూచేనా?
నాడు పెండ్లాడిన రాముడు
ఏల నా జాడలో రాకయున్నాడు.
ఎన్నడతని కౌగిలి ఎడబాయకుంటినే
పన్నుగ పదినెలలాయెనే
ఓ నా ముద్దు మరిదీ! ఓ లక్ష్మణా!
నిన్ను తూలనాడితిని సద్గుణా!
నోటి మాటల కెంతో నొచ్చుకొని
ఏమని దూరితో నన్ను విడిచిపోతివ తండ్రీ!"
అని బాధపడుతున్నది. ఆ సమయంలో ఆమెకు ఈ చల్లని వార్తను అందించాడు హనుమంతుడు. సీతకు ఆనందంతో నోట మాట రాలేదు. ఈ శుభవార్త కోసమే ఆమె పది నెలలుగా కాచుకొని ఉన్నది.
(స.సా.ఫి.97పు.37)