మనచేతికి ఏమిటి అందము? పెద్ద పెద్ద కంకణాలు వేసుకోవడం కాదు. “హస్తస్య భూషణం దానం",దానం చేయడమే చేతికి అందము. "సత్యం కంఠస్య భూషణం", సత్యమే కంఠమునకు భూషణం. "శ్రోత్రంచ భూషణం శాస్త్రం",దైవమును గురించి వినటమేశ్రోత్రమునకు అందము. ఇలాంటి అందములను వదలి పెట్టి పిచ్చిపిచ్చి అందములకై ప్రాకులాడటమెందుకు? మీ పంచేంద్రియాలను పరమాత్మునికై వినియోగించాలి. అదే జీవితమునకు ధన్యము. జీవితము నిచ్చినది. దీనికోసం? లౌకికమైన సుఖములను అనుభవించుటకు కాదు. అందుకోసమనే త్యాగరాజు కూడా, "నిధి చాల సుఖమా. ఈశ్వర సన్నిధి చాల సుఖమా, నిజముగ తెలుపుము మనసా!" అన్నాడు.ఇవన్నీ కదలిపోయే మేఘాలవలె వస్తాయి, పోతాయి. కానీ, దైవ ప్రేమ మాత్రం వస్తుంది. పెరుగుతుంది. ఈప్రేమను మీరెంత అభివృద్ధి పరచుకుంటారో ఆనందం అంత అభివృద్ధి అవుతుంది. ఈ ప్రేమ ఎంత తగ్గిపోతుందో ఆనందం కూడా అంత తగ్గిపోతుంది. మీరు అమితమైన ఆనందాన్ని పొందాలని ఆశిస్తే దైవాన్ని అమితంగాతోప్రేమించాలి. అందరిని ప్రేమించాలి. అయితే, ఆత్మభావంతో ప్రేమించాలి. దేహభావం కాదు.
(సా.శు.పు. 96/97)
(చూ॥ నరజన్మ, విద్య)