లక్షలమైళ్ళ దూరంములో నున్న చంద్రమండలము, కోట్ల మైళ్ళ దూరములో నున్న సూర్యమండలము, కోటానుకోట్ల దూరములో నున్న నక్షత్రమండలము, యీ సమస్త మండలములు చేరిన మండలమునే నభోమండల మన్నారు. దీనినే భూతాకాశము అన్నారు. ఇది స్థూలస్వరూపమునకు సంబంధించినది. ఇంత పెద్ద భూతాకాశము అగమ్యగోచరము, అప్రమేయమైనట్టిది. అపూరూపమైన యీ భూమండలము చిత్తాకాశములో ఎక్కడో ఒక చిన్నభాగములుగా కనిపిస్తూవుండాది. చిత్తాకాశమే సూక్ష్మమైన మనోఆకాశము. ఈ ఆకాశములో భూతాకాశము ఎక్కడో అణుమాత్రంగా ఉండినట్లు కనిపిస్తున్నది. మహాస్వరూపాన్ని ధరించిన యీ చిత్తాకాశము చిదాకాశమునందు అణుమాత్రముగా రూపొందుతుంది. ఈ చిదాకాశమే కారణస్వరూపము అయినట్టిది. భూతాకాశము, చిత్తాకాశము, చిదాకాశము మూడింటియొక్క స్వరూపస్వభావాలు వర్ణనాతీతమైనవి. కనుకనే వేదము యతో వాచో నివర్తన్తే అప్రాప్య మనసా సహ వాక్కుతో గాని మనసుతో గాని అందుకోవటానికిసాధ్యము కాదు అన్నది. ఇలాంటి భగవత్ తత్వాన్ని నీవు ఏవిధంగా గుర్తించగలవు? అని ప్రశ్నిస్తుంది. భూతాకాశం స్థూలం, చిత్తాకాశం సూక్ష్మం, చిదాకాశం కారణం. ఈ మూడింటికి ఆవలనున్న భగవత్ తత్వాన్ని గుర్తించటానికి ప్రయత్నించాలి. ఇదే మహాకారణస్వరూపము. ఇట్టి అగమ్యమైన అగాధమైనదాని స్వరూపస్వభావాన్ని సామాన్యమైన మానవుడు గుర్తించుట అసాధ్యము. త్రిలోకములకు అధిపతియైన భగవంతుని, త్రిగుణము లకు ఆధిపతియైన భగవంతుని, త్రికాలాధిపతియైన భగవంతుని అల్పజ్ఞులైన మానవులు గుర్తించుట అసాధ్యము. దీనికి సులభమైన ఉపాయము భక్తి యోగములో ప్రబోధించింది భగవద్గీత..
(శ్రీ.గీ.పు 9/10)