భాగవతము

పరమ భక్తుడైన పోతన భాగవతమును ప్రారంభిస్తూ

"పలికెడిది భాగవతమట

పలికించెడు వాడు రామభద్రుండటనే

పలికిన భవహర మగునట

పలికెద వేరొండు గాథ పలుకగనేలా|| అన్నాడు.

పలికించేవాడు భగవంతుడే పలికేవాడు భగవంతుడే. వ్రాసేవాడు భగవంతుడే, వ్రాయించేవాడు భగవంతుడే. నన్ను నిమిత్త మాత్రముగా తీసుకొని ఈ విధంగా వ్రాయిస్తున్నాడని పోతనామాత్యుడు ప్రారంభములోనే భగవంతునికి అర్పితము చేసి, తనకావ్యాన్నిప్రారంభించాడు. ఇక్కడ తత్ త్వమ్ అసి అనే దివ్యత్వము ఇమడి ఉంటూండాది. "పలికెడిది భాగవతమట, పలికించెడి వాడు భగవంతుడు. నేపలికిన ఇతనే జీవాత్మ, వాడు పరమాత్ముడు. నేను జీవాత్ముడు, కనుకనే తత్వమ్ అసి ఈ రెండింటి ఏకత్వమే భాగవతము. భాగవతము నందే మానవత్వానికి సరియైన మార్గములను ఇముడ్చుకుంటూ వచ్చాడు. మొట్టమొదట భక్తి ఆధారము. భక్తి క్రమక్రమేణ పెరుగుతూ జ్ఞాన స్వరూపాన్ని పొందుతుంది. జ్ఞానము ముదిరి వైరాగ్యము ప్రాప్తిస్తుంది. ఈ వైరాగ్యమునందే తత్త్యం అర్థం చేసుకోగలుగుతాము. ఈ తత్త్వజ్ఞానాన్ని గుర్తించిన వ్యక్తియే ముక్తిని పొందగలడు. భాగవతమనే పదము నందే ఈ ఐదింటి రహస్యము ఇమిడి ఉంటున్నది. భా-గ-వ-త-ము. ఇవి ఐదక్షరాలు. ఇవే పంచభూతములు పంచేంద్రియములు పంచ కోశములు, పంచప్రాణములు. భా. ఇదేభక్తి - గ - ఇదే జ్ఞానము. వ-ఇదే వైరాగ్యము, త-ఇదే తత్త్వము -ము- ఇదే ముక్తి. ఇదే భాగవతము. భక్తి జ్ఞాన వైరాగ్య తత్త్వముల సమ్మిళిత సంబంధమే ముక్తి. కనుక ప్రతి మానవునకు భక్తి అత్యవసరము. ఇదే పునాది.

(బృత్ర.పు.123/124)

 

భాగవతము గోపికల అనన్య భక్తిని గురించి చాల గొప్పగా వర్ణించింది. భాగవతము చాల పవిత్రమైనది. అందులో సకల వేదాంత సారము ఇమిడియున్నది. "భాగవతం చదివితే బాగవుతాం అని చెప్పవచ్చు. భాగవతము అనే పదములో భా- భక్తిని, -జ్ఞానమును, వ-వైరాగ్యమును, త-తత్త్యమును, ము - ముక్తిని సూచిస్తున్నాయి. కనుక, భాగవతమనగా భక్తి, జ్ఞాన, వైరాగ్య, తత్త్వములను అందవేసి ముక్తిని ప్రసాదించేది అని అర్థం. భాగవతములో గోపికలప్రేమతత్త్వమును మొట్టమొదట గుర్తించాలి. గోపాలుడు గోకులం వదలి మధురకు వెళ్ళిపోయిన తరువాత గోకుల వాసులైన గోపికలు, గోపాలురు కృష్ణ వియోగంలో పరితపిస్తున్నారు. గోకులమంతా ఎండబారినట్లు కళావిహీనంగా కనిపిస్తున్నది. వారికి తిండికి ఏమాత్రములోటు లేదు. కాని, భుజించడం లేదు. అన్ని సుఖములూ ఉన్నాయి. కాని, అనుభవించడం లేదు. కారణమేమిటి? ప్రాణ సమానమైన కృష్ణుడు తమ వెంట లేనప్పుడు తాము జీవిచడం వ్యర్థమని భావించారు. నిద్రాహారములను త్యజించడంచేత వారి దేహములు కృశిస్తున్నాయి. కృష్ణ వియోగంచేత వారి మనస్సులు అందోళన చెందు తున్నాయి. ఈ సత్యాన్ని గుర్తించిన మధురలో ఉన్న గోపాలుడు తన మిత్రుడైన ఉద్దవుణ్ణి పిలిచి "ఉద్దవా! గోపికలు నా నిమిత్తమై చాల పరితపిస్తున్నారు. నీవు వెళ్ళి వారికి తగిన ప్రబోధలు సల్పి. వారి మనస్సులను శాంత పరచి రా" అన్నాడు. ఉద్ధవుడు సహజంగా గొప్ప వేదాంతి, గొప్ప జ్ఞాని. కృష్ణుడు సర్వజ్ఞుడు, సర్వ వ్యాపకుడు అనిఅతనికి తెలుసు. అతడు గోకులం వెళ్ళి "గోపికలారా! గోపాలులారా! కృష్ణుడు సర్వాంతర్యామి; ఇందుగలడందు లేడని సందేహము వలదు. అతడు సర్వ వ్యాపకుడు; కేవలం మధురలో మాత్రమే కాదు, సర్వత్ర ఉన్నాడు. కాబట్టి, ఆతడు మీకు దూరంగా ఉన్నాడని చింతించకండి, మీ వెంటనే ఉన్నాడని విశ్వసించండి " అని బోధించాడు.

(స.సా.జ.2000పు.10)

 

భాగవతము ఈ భారత రామాయణములవలె గుణ రూపములతో ఉండదు. ఈ గుణ, ఇంద్రియ, మనసు, చిత్తము లన్నింటికీ అతీతమైన ఆత్మ యొక్క రూపములు, శక్తి సామర్థ్యములు. వాటి యొక్క లీలల భాగవతము. అన్నింటికి సాక్షిగా ఉన్నవారని అవతార కథలనేభాగవతమంటారు. అతను సర్వ స్వరూపి. అతని రూపములకు హద్దు లేదు. కాని, ప్రకృతికి గోచరమగునట్లు చెప్పవలెనన్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, మత్స్య, కూర్మ,వరాహ, వామన, నరసింహ, రామకృష్ణ అవతారములు. లోక సృష్టి స్థితి, లయముల కొరకు, దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు ఆయా కాలములందు తాను ఏ ఏ రూపమున పోయిన తన సంకల్పిత కార్యములు జయప్రదమగునో తలంచుకొని, ఆయా రూపమున తనను తాను సృష్టించుకొనును. ఆ కార్యము పూర్తికాగానే తిరిగి ఆత్మ స్వరూపుడుగనే యుండును.గుణములకు అది, అంతము ఉన్నది. ఆత్మకు ఆది, అంతము లేదు. రామకృష్ణాదులు కూడా గుణ స్వరూపములుగా లేరే? గుణములకు అతీతులుగా ఉండి గుణ స్వరూపములను ఎట్లు వశపరచుకొనవలెనని చూపించినారు. రామాయణ, భారతములకు ముగింపు ఉన్నది. కాని ఆ విధముగా భాగవతమునకు ముగింపేలేదు. అది భగవంతుడు ఆద్యంత రహితుడు కదా! ఏ యుగమున ఏ కార్యము నిమిత్తమై ఏఏ కాలములో వచ్చుచుండునో అట్టి అవతార రహస్యమును మాత్రము తెలుపునది భాగవతము. అనిత్యమై, అసత్యమై ఆదిఅంత్యమును కలిగిన లోక నీతులను బోధించి, సత్య, ధర్మ, శాంతి, ప్రేమలను చూపించి, చేయుంచుటకై వచ్చినవి రామాయణ భారతములు.

 

భాగవతమే సాధకులకు అవసరము. అందులోనే భగవంతుని నిజమర్మములూ, నిజ మహత్య్మములూ, నిజ మార్గములు ఉన్నవి. రామాయణ, భారతములు కొంతవరకూ లౌకికమైన సహజ మానవులను ఉద్థారము చేయుటకు నీతుల బోధించినవి. పరమాత్ముని అనుగ్రహమునకు ఎట్లు పాత్రులగుట చూపినది. ఆత్మార్థమును తెలిసికొన కోరువారు, పరమాత్ముని తెలుసుకొని కోరువారు భాగవతమునే ప్రధానముగా పాటింతురు. భాగవతము ఆది అంత్యములు లేని ఆత్మ కథ. అది సూక్ష్మమునను, స్థూలమును రెండింటియందూ ఒక్కటే. అది సూక్షమున అతి సూక్ష్మము, స్టూలమున అతి స్టూలము. దానికి ప్రమాణమేలేదు. అది అంత్యమే లేదు. భాగవతము సూక్ష్మ రూపమున వేరు, స్థూల రూపమున వేరులేదు. రామాయణ, భారతములు, ఇతిహాసములు. భాగవతము అట్లుకాదు. కేవలము భక్తిమార్గమును తెలుపుతూ ఆత్మస్వరూపమై యుండును. ఏనాటికైనా భాగవతమునకు అంత్యము లేదు, రాదు. ఈయదార్థమే భాగవతము యొక్క అర్ధము.

(శ్రీ.స.సూ.పు.258/260)

 

పరీక్షిత్తు రాజు మోకరిల్లి, "ప్రభూ! మరణాసన్నమై, చావబోవుచున్నానని తెలిసి కొన్నవాడు చేయవలసిన కార్యమేమి? చింతించవలసిన చింతన యేమి? మరణమునకు తరువాత జననము రాకుండా వుంచుటకు ఆ సమయమున యెట్టి పద్ధతులను అవలంబించవలెనో శెలవివ్వవలెను. ఇవి నన్ను ప్రస్తుతము వేధించుచున్న బాధలు. ఇప్పుడు పరమ పురుషార్ధమేదియో కృపలో తెలుపమని పదేపదే ప్రార్థించుచుండ, శుక మహర్షి, రాజా! నీవు ప్రాపంచిక విషయములనుండి చిత్తమును తొలగించి మనస్సును జగన్మోహనుడైన శ్రీహరి యందు నిలుపుము. నేను భాగవతత్త్వమును చెప్పెదను; హృదయ పూర్వకముగ శ్రవణము చేయుము. ఇంతకంటే పవిత్రకర్మ, ఇంతకంటే పవిత్ర చింత, ఇంతకంటే గొప్ప తపశ్శక్తి వేరొండులేదు. నర తనువే దృఢమైన నావ,శ్రీహరి కథనే చక్కని చుక్కాని, సంసారమే భగసాగరము, నారాయణుడే సరియైన నావకుడు. ఈనాడు ఈ పవిత్ర సామగ్రి నీకు సంప్రాప్తమయి నీమీపమునకే వచ్చినవి. నీవడిగిన ప్రశ్న లోకహితార్ధమైనదే గాని, వక వ్యక్తి మాత్రమే చేరినది కాదు. విచారణ చేయవలసిన ప్రశ్నలన్నిటిలోనూ సర్వ శ్రేష్టమైనది ఆత్మతత్త్వము. సమస్త ప్రాణికోటికి, అంత్యకాలము పరమ సత్యము. అది తప్పునది కాదు. అట్టి దృఢమైన సమయమున యెట్టి పురుషార్థము చేపట్టవలెనో అది ప్రతి ప్రాణికి కూడనూ ప్రధానమైన చుట్టము. దాని ననుసరించియే పునర్జన్మము కలుగుచుండును. కాన నీవడిగిన ప్రశ్న, మీకు కలిగిన సంశయము, లోకల్యాణ కార్యమే కానీ, నీ నిమిత్తము మాత్రమే కాదు! వినుము"

 

"మహారాజా! భాగవతము మహావృక్షము. అది భవ్యమైనది. సమస్త శుభములు, సుఖములూ దానిలో ఇమిడియున్నవి. ఈ పవిత్ర వృక్షమునకు శ్రీమన్నారాయణుడే బీజము; బ్రహ్మనే అంకురము. నారదుడు బోదె, వ్యాసుడు శాఖ: అందులోని మధురఫలమే కృష్ణ కథామృతము. ఈ అమృతమునకై అఱ్ఱులు చాచి, కాయ బాధలను లక్ష్యము చేయక కాలమును లెక్కచేయక కాచుకొని భుజించువారేపవిత్రమునులు, యోగులు,ఓ మునులారా! ఈనాడు నేనా కమనీయ కృష్ణకథను, భాగవతశాస్త్రమును మీ అందరి ముందూ వినుపింతును, వచింతును. స్మరించి తరింతును. మీరు సమస్త శాస్త్రములు శ్రవణము చేసియుందురు. మీరు సర్వ సాధన సంపన్నులు అన్నింటి కంటెనూ శ్రేష్టమయినదేదియో మీకు తెలియనిది కాదు. యే వస్తువు అధిక రుచికరముగ తోచుచున్నదో, దేనిని వినినంతనే హృదయము హర్షము చెందుచున్నదో, దేనిని స్మరించి నంతనే మనసులోని ప్రేమతరంగములు పైకి లేచుచున్నవో,అట్టి పవిత్ర కృష్ణ నామమును, దాని మాధుర్యమునుమీ కందింతును; ఆ పవిత్ర కృష్ణ భక్తికి సహాయమైనది భాగవతము.

 

"అజుడు, అవ్యక్తుడు, అనంతుడునైన, పరమాత్మ, సగుణ సాకారమును ధరించి అనేక అవతారములెత్తి, అంతులేని లీలలను విస్తరింప జేసెను. అతని నామ రూప, గుణ ధామములు జగత్తు లోని జీవితములను తరింపజేసెను. ఇట్టి దానిని యెవడు గానము చేయుచున్నాడో, శ్రవణము చేయుచున్నాడో, సేవించుచున్నాడో అట్టి వానినే భక్తుడని పిలువబడును, వాడే భాగవతుడు.

 

అనగా భక్తునకు భగవంతునితో సంబంధము కలదేభాగవతము,అవతార కథలలో కేవలము భక్త భగవంతుల సంబంధమే యుండును, భగవదవతారములు దుష్ట సంహారము కొరకే కాదు. అది వక నిమిత్త మాత్రమే. నిజమునకు భగవతవతారము భక్తులకొరకే. గోవు తన పాలను తన దూడకొరకే ఇచ్చును. వాటిని ప్రజలు యెట్లు ఉపయోగించుకొందురో, అట్లే భగవంతుడు భక్తునకొరకవతరించిన, ఆ భక్తులు కూడనూ దానిని వేరు మార్గమున అందుకొని ఉపయోగించుకొందురు. భక్తునకునూ, భగవంతునకూ మధ్య యెందరివో దుష్ట వ్యక్తుల చరిత్రలు చేరుచుండును. అంతమాత్రము చేతనే భాగవతము పవిత్రము కాకపోదు. తీయని రసములో చేరిన చెరకు, రసమును తీసిన తదుపరి పిప్పిని పారవేసినటుల భక్త భగవంతుని సంబంధమైనమధుర సారమును తీసిన తదుపరి, దుష్ట వ్యక్తులను పిప్పిని దూరము చేయవచ్చును. పిప్పిలేక రసము చిక్కదు కదా, అటులనే అభక్తులు లేక భక్తులగుటకు వీలుండదు. "భగవంతుడు దేశకాల బంధములనుండి విముక్తి చెందిన వాడు. అతనికి జీవులందరూ సమానమే. అతను చరాచరములకు స్వామి. బ్రహ్మరూపమును ధరించి ప్రళయములందు లీనమైన ప్రజలను సృజించును. అతనే విష్ణురూపమును ధరించి సర్వులయందూ తన శక్తిని ప్రసాదించి నానావతారములు ధరించి, ఈ చరాచర ప్రపంచమును పాలించును. చివర కాతడే సాక్షాత్ శివరూపమును దరించి, సమస్తమునూ సంహారము చేయును. ఆతని శక్తికి అంత్యము లేదు. హద్దులు రావు. అతని పురుషార్ధమునకు పరిధి వుండదు. అవతారములా లెక్కలేదు. సర్వకళావతారుడు అతడే, అంశావతారుడూ అతడే, ఆవేశావతారుడూ అతడే, యుగావతారుడూ అతడే; అట్టి అవతారముల కథాశ్రవణములే భాగవతము.

(భా.వా.పు.157/160)

 

భాగవతము. శ్రవణ, మనన, నిధి. ధ్యాసలద్వారా అనుభవించినవారు బాగవుట తధ్యము-పవిత్ర భక్తిని పెంపొందించునదే ఈ భాగవతము.

(భా.వా.ఫోటో క్రింద వ్రాసినది)

 

భాగవతమంటే ఏమిటని మనం విచారించాలి. భాగవతమును చక్కగా మనం విచారించినప్పుడు మనం బాగవుతాం. భాగవతమునందే ఉంటున్నాయి. అన్ని సాధనా ఫలితములు. భాగవతము. ఐదు అక్షరములలో కూడి ఉంటున్నది. భ-భక్తి, గ-జ్ఞానము, వ-వైరాగ్యము, త-తత్వము. ము ముక్తి. ఈ ఐదు దీనిలోనే ఉంటున్నాయి. భాగవతము సర్వశాస్త్ర సారము. సర్వమార్గముల గమ్యము. సర్వఫలముల సారము. ఇది భాగవతము.

(భ.మ.పు.33)

 

భగవతరి ఇదం భాగవతం అని కొందరు పండితులు బోధించారు. అనగా భగవంతుని గురించి చెప్పు కథలకేభాగవతమని పేరు. మరికొందరుభాగవతానాం ఇదం భాగవతమ్ అన్నారు. అనగా భక్తులను గురించి ప్రబోధించినదే భాగవతము అన్నారు. వారి వారి భావశుద్ధులను పురస్కరించుకొని వారి వారి సందేశాలను ఆ విధముగా అందిస్తూ వచ్చారు. భక్తునకు భగవంతునకు మధ్యనున్న సన్నిహిత సంబంధ బాంధవ్యములను గురించి బోధించునదే భాగవతము. భక్తునకు భగవంతునకు మధ్యమన్న సేతువే ఈ భాగవతము.

(భ.మ.పు.35) ||

 

మీకు ఎంత అవసరమో అంత ఆశించవచ్చు. ఆ ఆధికారము, స్వాతంత్ర్యము మీకు ఉంటున్నది. కాని మితిమీరిన రీతిలో పోకూడదు. అహంకారము త్రుంచు కొని, అభిమానము త్రుంచుకొని దివ్యభావములను మీరు అభివృద్ధి గావించుకోండి. ఇదే నిజమైన వేదాంతబోధ. భాగవతము యొక్క బోధ. ఈ భాగవతములో కథలు వస్తుంటాయి. ఆ కథలు కొంతవరకు మీకు విసుగుగా ఉండవచ్చును. కాదు. కాదు. అది History అన్నీ భగవంతుని చరిత్రలు. ప్రతి విషయము భగవంతుని చరిత్రయే. భాగవతము అర్థముకాకుండా పోవటముచేత దానిని ఉల్లఘింస్తున్నాముగానీ ప్రతి పదము ముత్యము వంటిది. రత్నము వంటిది. ఆ విధమైన ప్రబోధలు సలిపే నిమిత్తము భాగవతము వచ్చింది. లేకపోతే పద్దెనిమిది పురాణములు వ్రాసి నిరాశ నిస్పృహలతో సరస్వతి తీరమునందున్న వ్యాసులవారిని చూచి నారదుడు ఈభాగవతమును వ్రాయమని ఎందుకు చెప్పాలి? కావలసినన్ని వ్రాశావు, శ్లోకదాత అని పేరుపొందావు. శ్లోకదాతయేగాని శోకాన్ని నివారణ చేసుకోలేదు. కౌరవులలోని దుర్గుణములు ప్రవేశించి వారి చరిత్రవ్రాస్తూ వచ్చావు. తరువాత నీ మనస్సు మాలిన్యమై పోయింది. ఆ మాలిన్యము నీవు పరిశుద్ధము గావించుకోవాలంటే భగవంతుని లీలాగుణగణ విశేషములను వ్రాయమని చెప్పాడు. భాగవతమే సరైన ప్రమాణము. భాగవతమునకు మించిన మరొక చరిత్రలేదున్నారు. కారణం ఏమిటి? తెలిసి చదవాలి. అలాంటి చరిత్ర. భగవత్ తత్వము సంపూర్ణముగా విచారించి వెల్లడి చేసింది భాగవతము.

(భ.మ.పు.118/119)

 

భాగవతమందు భ్రమర సందేశాన్ని ప్రధానమైన ప్రాణంగా తీసుకున్నారు పండితులు. ఆసలు భాగవతమంటే ఏమిటి? భాగవతమంటే భక్తునికి భగవంతునికి మధ్య జరిగిన చరిత్రనే అని భావిస్తారు. భ భక్తి, భగవంతుడు ఈ మూడింటి సమ్మిళిత స్వరూపమే భాగవత మని కూడా కొందరు వ్యాఖ్యానిస్తారు. వాస్తవానికి ముక్తి అనేది భాగవతము అనే ఐదక్షరములలోనే లభిస్తుంది. భభక్తి, గజ్ఞానము, వ వైరాగ్యము, త తత్వము ఈ నాల్గింటి సమ్మేళనమే ముక్తి. భక్తి, జ్ఞానము. వైరాగ్యము. తత్వవిచారణ ముక్తికి మార్గములని నిరూపించింది. భాగవతము. ఇవి ప్రతిమానవునిలో నిండి నిబిడీకృతమై యున్నవి. కాని వాటిని సరియైన మార్గంలో అనుభవించడం లేదు. అనుభవించిన వాడే భాగవత ప్రియుడు భగవంతునిపై ప్రేమే భక్తి. నిత్యా నిత్య పరిశీలనా తత్వమే జ్ఞానము. మనలో ఉన్న దుర్గుణాలను పరిత్యజించడమేవైరాగ్యము. తానెవరు? నేనెవరు? ఈ రెండింటిని తెలుసు కోవడమే తత్వ విచారణ.

(స.సా.ఆ.83పు.235)

(చూ॥ కృష్ణతత్వము, కృష్ణునిలీలలు, గోపికలు, మూలాధారము)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage