ఈ ప్రపంచమునకు "భవాని శంకర” అనే గొప్ప పేరున్నది. భవాని" అనగా శ్రద్ధ అని, శంకర’ అనగా విశ్వాసమని అర్ధము. భవాని శంకరుల సమ్మిళిత స్వరూపమే ఈ జగత్తు. కనుక, ఈ జగత్తే అర్ధనారీశ్వర స్వరూపము. దీనిని పురస్కరించుకొనియే శ్రీమతి, అనగా భవాని, శ్రీ అనగా శంకరుడు. ఈ రెండింటి ఏకత్వమే మానవత్వం. ఎవరు ఏ నామమును. ఏ రూపమున స్మరించినా భవాని శంకరుల తత్త్యమునే అనుసరించాలి. శ్రద్ధ, విశ్వాసములు లేక మానవుడు దేనినీ సాధించలేడు. "శ్రద్ధావాన్ లభతే జ్ఞానం", శ్రద్ధవల్లనే జ్ఞానం లభిస్తుంది. మానవుడు ఎన్ని సాధనలు చేసినప్పటికీ భవాని శంకరుల అనుగ్రహం లేక ఏదీ ఫలించదు. భవాని శంకరుల స్వరూపమే ఈ ప్రపంచము. మీరు "లోకాస్సమస్తా స్సుఖినో భవంతు" అని ప్రార్థిస్తున్నారు. లోకమంతా సుఖంగా ఉండాలంటే శ్రద్ధ, విశ్వాసములు భద్రంగా ఉండాలి. శ్రద్ధ, విశ్వాసములుంటే మీరు సాధించలేనిది ఈ లోకంలో ఏదీ లేదు. క్షణంలో మోక్షాన్ని పొందవచ్చును. ఆనందాన్ని అనుభవించ వచ్చును. దీనికి ఏమాత్రము శ్రమ పడనక్కర్లేదు. ఇట్టి శ్రమ లేని మార్గాన్ని వదలి మీరు అనేక శ్రమలకు ఓర్చుకొని ఎన్నో సాధనలు చేస్తున్నారు. దైవాన్నిప్రేమించండి. నిత్యసత్యమైన దైవ ప్రేమను సాధించండి. ఆదియే మీరు చేయవలసిన సాధన.
(స.సా.డి.99పు.360)