లక్ష్మణుడు సీతా రాముల వెంట అరణ్యానికి బయలుదేరాడు. ముగ్గురూ చిత్రకూట పర్వతం చేరుకున్నారు. ఆ ప్రదేశాన్ని చూసి రాముడు, "లక్ష్మణా! చాల ప్రశాంతమైన ప్రదేశానికి వచ్చాము. ఎండకన్నెరుగని సీత బాగా అలసిపోయింది. కాబట్టి, ఇక్కడ మనం నివసించటానికి ఒక పర్ణశాల నిర్మించు" అన్నాడు. "ఎక్కడ నిర్మించాలి అన్నా ! " అని అడిగాడు లక్ష్మణుడు. రాముడు “నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ నిర్మించు" అన్నాడు. రాముని మాటలు లక్ష్మణునికి చాల బాధ కలిగించాయి.
"అబ్బా, నేనెంతటి పాపం చేశానో కదా ఇలాంటి కఠినమైన మాటలు వినవలసి వచ్చింది" అని దుఃఖించాడు. అప్పుడు సీతమ్మవారు "లక్ష్మణా! మీ అన్నగారు నిన్ను తిట్టలేదు, కొట్టలేదు కదా! ఎందుకు నీవింత దుఃఖిస్తున్నావు?" అని ప్రశ్నించింది. లక్ష్మణుడు "తల్లీ! రాముడు నన్ను తిట్టినా, కొట్టినా నాకు సంతోషమే. కాని, నా ఇష్టమనేది ఒకటి ప్రత్యేకంగా ఉందన్నాడు. ఆ మాట నా హృదయాన్ని కత్తులతో పొడిచినంతగా బాధించింది.రాముని ఇష్టమే నా ఇష్టము కదా! నేనేమి పాపం చేశానని నా ఇష్టం వచ్చినచోట నిర్మించమంటున్నాడు" అన్నాడు. అప్పుడు రాముడు లక్ష్మణునికి ఒక ప్రదేశాన్ని చూపించి, "నాయనా! అక్కడ నిర్మించు" అన్నాడు. శరణాగతి అనగా ఏమిటి? మీ సంకల్పము, దైవ సంకల్పము ఒక్కటిగానే ఉండాలి. ఏది జరిగినా అది భగవత్సంకల్పమే అని భావించాలి. ఇది మంచి, ఇది చెడ్డ, ఇది కష్టము, ఇది సుఖము అనే చర్చకు ఏ మాత్రము అవకాశమివ్వకూడదు. దేవుడు ఏది చేయమంటే అది మీరు చేయవలసిందే! ఎందుకు, ఏమిటి అని ప్రశ్నించకూడదు. అదియే నిజమైన భక్తుని లక్షణం. దేవుడు ఏది చేసినా మీ మంచి కోసమే! పాండవులకు అనేక కష్టాలు పెట్టాడు. అయితే, కష్టాలవల్లనే వారి కీర్తి జగద్వ్యాప్తి అయింది. వారు అచంచలమైన భక్తితో దైవాజ్ఞను శిరసావహించి కట్టకడపటికి విజయాన్ని సాధించారు. భక్తి ప్రపత్తులతో జగత్తులో ఎలాంటి కార్యమునైనా సాధించడానికి వీలౌతుంది.
(స.సా.పి.2000పు. 44)
సర్వాధారుడైన సర్వేశ్వరుణ్ణి ఆశ్రయించుటే నిజమైన శరణాగతి. కాని ఆధేయములైన అనిత్య పదార్థముల శరణు జొచ్చుట అజ్ఞానము. అర్జునుడు పరమ జ్ఞాని కనుకనే, పరమాత్ముని శరణు జొచ్చెను. ఈ శరణాగతులందును, మూడు విధములైన శరణాగతులు కలవు. "తవైవాహం, మమైమత్వం, త్వమేవాహ మితి త్రిధా" అనగా మొదటిది నేను నీవాడ ననునది, రెండవది నీవు నావాడననునది. మూడవది నీవేనే ననునదియును.
కాని ఉత్తరోత్తరంగా యోచించిన ఒకదాని కంటే ఒకటిఉత్తమమైనదిగా నున్నది. మొదటి "తవైవాహం " లో పరమాత్ముని సర్వస్వతంత్రునిగాను, భక్తుని పరతంత్రుని గాను భావించును. అనగా భగవంతుడు పిల్లిగానూ, భక్తుడు పిల్లిపిల్లగానూ, ఇది అతి మృదువైనది. సర్వులకూ సాధ్యమైనదిగా నుండును. ఇక రెందవదైన "మమై మత్వం"ఇందులో భక్తుడు స్వతంత్రుడుగాను, పరమాత్ముడు పరతంత్రుడుగాను సూచించింది. దీనికి సూరదాసు భక్తి ఆధారము. "కృష్ణా! నీవు నా చేతుల నుండి తప్పించుకొని పోగలిగావు గాని యేదీ నా హృదయమునుండి వీడిపో చూతము "అని గర్జించినాడు. ఆ మాటలకు పరమాత్మ "బిడ్డా! నేమ భక్తపరతంత్రుణ్ణి" అని ఆత్మ గౌరవంగా అంగీకరించెను. చూడు! భతవంతుని నిలువుగా కట్టిపెట్టగలడు భక్తుడు. అయితే అంతటి భక్తి పరవశుడు కావలెను కదా!
ఆనాడు పరమాత్ముడు భక్తుని మంచి చెడ్డలు పూర్తిగా తనవి గానే భావించును. అనుగ్రహించును. ఇక్కడ గీతలో చెప్పిన “యోగక్షేమం వహామ్యహం" అని ప్రతిజ్ఞ చేసిన ప్రభువాక్యము నిరూపించేవాడు. ఇక మూడవదైన, “త్వమేవాహ మితి త్రిథా"అనునది నీవే నేను అను అవిభక్తమైన భక్తి. ఇందులో సర్వమూ అర్పించి తననను మాత్రము మిగిలించుకొన్న లాభమేమిటి? అట్లు చేసిన ద్వైత శరణాగతిగా నుండును. కాని ఇది అద్వైత శణాగతి. ఇట్టిది. "వాసుదేవ స్పర్వం" అను భావమును పొంది యుండును. దేహాభిమాన మున్నంత వరకూ భక్తుడు అంశము భగవంతుడు పూర్ణుడు. ఉపాధుల అభిమానము వదలి స్వరూపస్థితిలో ఉన్నప్పుడు భక్తుడు భగవంతుడూ ఇద్దరూ ఒకటే అగును. ఈ మూడవస్థలనూ స్థితులనూ రామాయణమున హనుమంతుడు రాముని వలన పొందెను ఇదే విషయమును ఈ గీతయందు రెండవ అధ్యాయమున ఏడవ శ్లోకమున అనుబంధ చతుష్టయము లను చెప్పెను. "ప్రసన్నం" అనువది అధికార లక్షణము. ఏరీతిగానన తన తప్పును తాము తెలిసికొని అర్జునుడుశరణు పొంచెను. ఎప్పుడు మానవుడు తన తప్పును తాను తెలిసికొనునో అప్పుడు వాడు అధికారస్థానమును పొంద నర్హుడగును. అంతియేకాక అతను తమోగుణము నుండి మేల్కొనిన వాడగును. తిని నిద్రించుటే తమోగుణ లక్షణము. కానీ అట్టిదానికి అతీతుడై అంతః కరణములయందు జాగ్రత్త వహించిన స్థితిని పొందినవాడు కనుకనే అర్జునుడు తన తప్పును తాను చక్కగ తెలిసికొనగలిగెను. ఈ స్థితిని కృష్ణపరమాత్మ గ్రహించి చిరునవ్వు నవ్వుతూ "బావా! తమోగుణమునకు ఉప లక్షణమేకదా నిద్ర, కనుక నిద్రనే జయించినవానికి ఈమోహనిద్ర ఏమిచేయగలదు? దాని ప్రభావము తాత్కాలికము. అందువలననే ఇంత త్వరలో స్వస్థితికి రాగలిగితివి. నీ తప్పును నీవు తెలిసికొనగలిగితివి. నన్ను శరణాగతిని పొందితివి.
(గీ.పు.19/21)
ఏ హృదయంబు నొసగితి వో ఈశ నాకు
మగిడి దానినే అర్పింతు మహితమూర్తి
పరగ వేరేమి తెత్తు నీ పాదార్చనకు
అంజలి ఘటింతు అందుకోవయ్య!
ఈవిధంగా శరణాగతి కావాలి. నీ హృదయమందున్నప్రేమను భగవత్ప్రేమలో లీనం చేయి. రెండూ ఏకమై పోతాయి. ఏకత్వమే నిజమైన ఆనంద తత్తము. ఏకత్వములోనే నిజమైన ఆనందమున్నది.
(దస.98 పు.62)
శరణాగతి కంగములైదు. (1) భగవత్సంకల్పము. (2) అభిమాన మమకారములను సకల భోగభాగ్యములను వీడుట, (3) తన్ను కాపాడునని ధృఢనమ్మకము. (4) తన్ను రక్షింపుమని భగవంతుని ప్రార్థించుట, (5) తనకు యేశక్తియు లేదు. నీవే యేకైక గతి అనే ధృఢభావము, ఇదియే ఆత్మవిక్షేపము,యిదియే ప్రపత్తి.
(సు. పు.16)
శరణు జొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము.
నీవాడని ఒకపరియన
ఏనాడైనను ఏలుదువానిని"
అని వారికందరికీ తెలుపుతూ వచ్చాడు. అప్పుడు సుగ్రీవుడంటున్నాడు. "స్వామీ! ఇదే విధముగనే రేపటిదినము రావణుడే వచ్చి "నేను నీకు శరాణాగతిని" అని ప్రార్థించితే "నేను నీవాడనే" అని మొర పెడితే అతడిని ఏరీతిగా మీరు క్షమించుగలరు?ఏరీతిగా రక్షించగలరు?" అన్నాడు. “రావణునికి అంత ఉత్తమమైన భావమే కలిగితే, నేను అతనిని అయోధ్యకే రాజు ని చేస్తాను " అన్నాడు రామచంద్రుడు.
విద్యార్ధులారా,
మీరీ శరణాగతి తత్త్వమును చక్కగా అర్థము చేసుకోవాలి. పగవాడైనను "శరణ" అంటే భగవంతుడు తప్పక రక్షిస్తాడన్న పరమార్థమును గ్రహించాలి.
(ఆ.రా.పు.309)
భక్తులు భగవంతుని ప్రేమిస్తున్నారు. భగవంతుని నిమిత్తము కాదు, భక్తుల నిమిత్తమై భక్తులు భగవంతునిప్రేమిస్తున్నారు. అయితే యిక్కడ ఒక చిన్న రహస్యాన్ని గుర్తించాలి. భగవంతుడు భక్తుణ్ణి ప్రేమిస్తున్నాడు. ఈ విషయంలో విరుద్ధంగా వుంటుండాది. భగవంతుడు భగవంతుని నిమిత్తమై భక్తుని ప్రేమించటం లేదు. భక్తుని నిమిత్తమై భగవంతుడు భక్తుని ప్రేమిస్తున్నాడు. కారణమేమనగా తాను అవ్యక్తుడు. అతనికి తన పర అనే భేదము లేదు. ఎక్కడ వ్యక్తిత్వము, స్వార్థము అనేవి వ్రేలాడుతూ ఉంటాయో ఆస్థాయియందు మాత్రమే స్వార్థము, నీవు, నేను అనే భేదభావములు గోచరిస్తాయి. భగవంతునియందు తన పరభేదములు ఏమాత్రము లేవు. “మత్కర్మకృత్" మత్పరమో "మద్భక్తః" అనే పదములు తత్వములు. ఇవి భక్తునకు సంబంధించినవి. ఉపాసనా మార్గమునకు ఎంతో తోడ్పడేవి. మానవుని శక్తిసామర్థ్యములు అల్పమైనప్పుడు దీనియొక్క తత్వమును ఏరీతిగా గుర్తించాలి? ఒక వ్యక్తి గాలి కావాలనుకొని ఒక విసనకర్రను చేతిలో పట్టుకొని అన్ని విధాలా శ్రమపడుతుంటే కించితైనా గాలిసోకటం లేదు. ఝంఝామారుతము వీచినప్పుడు సముద్రమున ఆలలు బయలుదేరి ఉప్పన వస్తుంది.చెట్లు వేళ్ళవరకు కూలిపోతాయి. పెద్దగాలి వస్తుంది. ఇది యెవరి శక్తి? మానవుడు వీచుకొనే ఫ్యానుగాలి ఆల్పమైనది దీని శక్తి తుచ్ఛమైనది. కాని భగవత్ శక్తి అఖండమైన ఝంఝామారుతమై వీచుతుంది. మానవుడు ఒక బావినుండి నీరు తోడినప్పుడు లేదా పంపుసెట్టు పెట్టి కొట్టినప్పుడు దానిమూలంగా కొంత నీరు ప్రాప్తిస్తుంది. కాని కుంభవర్షమే కురిసినప్పుడు నదులు, ఊర్లూ ఏకమైపోతాయి. ఇది తైలదీపమో లేదా కరెంటు దీపమో వేసుకుంటాము. ఆ వెలుతురులో గృహమును మాత్రమే సరిదిద్దుకుంటాము. కాని సూర్యోదయము అయిందంటే సర్వత్రా ప్రకాశమే. అడవియందు, గుట్టయందు, చెట్టుయందు, ఇంటియందు సర్వత్రా ప్రకాశము ప్రసరిస్తూ వుంటుంది. ఇది దైవశక్తి. దీపము మానవుని వ్యక్తిత్వము యొక్క శక్తి. ఇంత అఖండ శక్తి కలిగిన దైవత్వాన్ని యీ అల్పశక్తి కలిగిన మానవుడు ఏరీతిగా చేరటానికి వీలవుతుందో దీనినే శరణాగతి అన్నారు.
(శ్రీగీ.పు. 11/12)
రైలు స్టేషనుకు పోయేంతవరకు లగేజిని కూలినెత్తినో, జట్కాలోనో, రిక్షాలోనో టాక్సీలోనో పెట్టుకొని చూచుకొని పోవాలి. ఎవరు చిక్కనప్పుడు మనమే మన లగేజీనిమోసుకొని పోవాలి. తల పైన, చేతిలోను పెట్టుకొని రైలులో పోయి కూర్చున్న తరువాత ఎక్కడివక్కడ పారవేసి హాయిగా నిశ్చంతగా వుంటుండాలి. నిన్ను, నీ లగేజిని, రైలే మోసుకొని పోతుంది.
కానీ యీ పిచ్చివాడు అట్లు చేయటం లేదు. రైలులో కూర్చుని కూడను తన పెట్టెను బుట్టను తన నెత్తిపైన పెట్టుకుంటాడు. శరణాగతి అయిన తరువాత సర్వమూ అతనికే అర్పితము చేయి. ఏదియెప్పుడు ఎక్కడ ఎట్లా చేయవలెనో తానే చూచు కుంటాడు. ఇంక నాది అనే అహం ఏమాత్రం వుండకూడదు. దీనికే రామాయణంలోపల ఒక సన్నటి విషయములోపల ఒక ప్రధానమైన లక్ష్యమును నిరూపించాడు లక్ష్మణుడు.రాముడు చిత్రకూట పర్వతము సీతాలక్ష్మణ సమేతుడై చేరాడు. భగవంతుడు యెప్పుడుకూడను లీలామానుషవిగ్రహుడు, నటన సూత్రధారి. ఏబాధలు, ఏదుఃఖము, ఏవిచారము లేకపోయినప్పటికినీ, దుఃఖముగానూ, విచారముగానూ, కష్టంగానూ వుండి నట్టుగా నటిస్తూ వుంటాడు. "దైవం మానుషరూపేణ" మనుష్యాకారము పొందినప్పుడు మానవాకార తత్వమంతయు ప్రకటితమయినప్పుడు మానవులకు సన్నిహిత సంబంధుడౌతాడు. భక్తులు అందుబాటులో అనుకూలముగా వుండే నిమిత్తమై యీ మానవాకారము ధరిస్తూ వుంటాడు.రాముడు అలసిపోయినట్టుగా ఒక రాతిపై కూర్చున్నాడు. చాలా అలసినట్టుగా "లక్ష్మణనేనిక నడవలేను" అని చెమట తుడుచుకొని క్రింద వేస్తున్నాడు. ఇక్కడ యేదైనా ఒక చిన్న పర్ణశాల, కుటీరము నిర్మించు. అందులో విశ్రాంతి తీసుకొందా" మన్నాడు. ఎక్కడ వేయాలి అన్నగారూ అని ప్రార్థించాడు లక్ష్మణుడు. నీ యిష్టము వచ్చిన చోటులో నీవే నిర్ణయము చేసుకొని వేయమన్నాడు. "రామరామ! ఎంతటి మాట నేను వింటిని నాలో యేదోషముంటుండాది? నేను ఏపాపము చేశాను? ఏ విధమైన దీనిలో నీకు విరుద్ధంగా ప్రవర్తించాను? ఇంతటి కష్టమైన మాటలను నేను వినవలసి వచ్చింది." అన్నాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు పడే బాధ రామునకు తెలిసినను సీత గుర్తించే నిమిత్తమై లక్ష్మణా! నేనేమీ అనరాని మాట అనేలేదే? కఠినమైన వాక్కును ప్రవేశపెట్టలేదే? అన్నాడు. లక్ష్మణుడు చెప్పాడు "అన్నా! తల్లిని, తండ్రిని, భార్యను, రాజ్యమును అన్నీ వదలి సర్వసంగపరిత్యాగినై, తమ ఆజ్ఞనే నాకు ప్రాణంగా భావించి, శిరోధార్యముగా భావించి, తమరే నా తండ్రిగా భావించి, సీతనే నా తల్లిగా భావించి అరణ్యమునే ఆయోధ్యగా భావించి నేను తన వెంట వచ్చినప్పుడు నాయిష్టము అనేది ఒకటుందా? లేదు. నీ యిష్టము వచ్చినచోట వేయుము అనటము లోపల నాకొక యిష్టము వుండినట్లు అప్పుడు నేను పూర్తి శరణాగతుణ్ణి కానట్లు ఔతుంది. నేను ఎంత క్రూరుణ్ణి"అని బాధపడ్డాడట. "నాకు రెండవ వాంఛ అనేది లేదు. నీ యొక్క ఆజ్ఞయే నాయొక్క యిష్టము. నీ యిష్టమేదోఅదే నాకు యిష్టము. నీవు ఏది చెప్పినా అది శిరసావహించుటమే నీ కర్తవ్యము నా లక్ష్యము నాగమ్యము. నీవు తప్ప అన్యము లేదు." అన్నాడు. ఈ మాట అనేటప్పటికి సీత ప్రవేశించి “రామా! మరొక పర్యాయము మీరు లక్ష్మణునికి యీ విధముగా చెప్పకండి అని ప్రార్థించిందట.
(శ్రీస.గీ.పూ.32/33)
(చూ॥ త్యాగరాజా, ప్రాచీన భారతీయ సంస్కృతి, బిక్షకులు, శ్రీమంతుడు, స్థల ప్రభావము)