రావణుడు ఎంత గొప్పవాడు! ధన కనక వస్తు వాహనాదులకు తక్కువ లేదు, 64 విద్యలు నేర్చినవాడు; కఠోర తపస్సు ఆచరించి దైవానుగ్రహము పొందినవాడు. ఇంత గొప్ప వ్యక్తి ఒక్క కామమునకు లోను కావటం చేత పతనమైనాడు. పవిత్రమైన దివ్యమైన, భవ్యమైన రామాయణమందు రావణుడు ఒక పెద్ద మూర్గుడుగా రూపొందాడు. కారణము వాంఛలే. వాంఛల చేతనే తన తపః ఫలమును నాశనము చేసుకున్నాడు. ఇంక భాగవతములో హిరణ్యకశిప్పుడు క్రోధం వలన పతనమైనాడు. అతడు పంచభూతములను అదుపులో పెట్టుకున్నవాడు, గొప్ప సైంటిస్టు, భూమిని తిరగకుండా చేయాలని ప్రయత్నం చేశాడు. ఈనాటి సైంటిస్టులు చంద్ర మండలానికి పోయారు. హిరణ్య కశిపుడు సూర్య మండలానికే ప్రయాణం చేశాడు. ఇంత పెద్ద సైంటిస్టు అయి కూడను క్రోధమును జయించలేకపోయాడు.
కోపము కలిగిన వానికి
ఏ పనియు ఫలింపకుండుఎగ్గులు కలుగున్
పాపపు పనులను చేయుచు
ఛీ, పొమ్మనిపించుకొనుట చేకూరు సుమీ!
తన కలిమి భంగపుచ్చును
తనకుంగల గౌరవంబు దగ్ధము చేయున్
తన వారల కెడ సేయును
జనులకు కోపము వలన సర్వంబు చెడున్.
ఇంక భారతమందు దుర్యోధనుడు లోభి.
లోభివాని చంప లోకంబు లోపల
కొట్ట వద్దు వాని తిట్టవద్దు
డబ్బు అడిగినంత దబ్బున తాచచ్చు
ఉన్న మాట తెలుపుచున్న మాట
ఇలాంటి లోభి అయిన దుర్యోధనుడు ఏమి సాధించాడు?
క్రోధమున్న హిరణ్యకశిపుడు ఏమి సాధించాడు?
రావణుడు గొప్ప భక్తుడే. గొప్పతపః సంపన్నుడే.
కానీ కామముచేత ఏమి సాధించాడు?
కామ, క్రోధ, లోభములు సాధనకు పరమ శత్రువులు.
ఈ మూడింటిని మనం అదుపులో పెట్టుకోవాలి.
(ద.స.98 పు.37/38)
నీ శత్రువే నీకు ఉత్తమమిత్రుడని గుర్తించుకొనుము. శత్రువు నిన్ను దూషించి అనుమానించి నీపాపమును పంచుకొనుచున్నాడు. అనగానీవభవిచవలసిన శిక్షను నిన్ను బాధించినవాడు తనపరము చేసుకొనుచున్నాడు. స్నేహితుడు నిన్ను పొగిడి, మెచ్చుకొని నీవు సంపాదించిన పుణ్యము తరిగిపోతుంది. నిన్ను దూషించినవారు నీపాపమును, నీవనుభవించవలసిన శిక్షను అనుభవించగా, నీపుణ్యమును నిన్ను పొగడినవారు హరించుచున్నారు. చివరకు నీకు మిగిలినది శూన్యము. .
(స్వీ.పు.348)
అహంకారమే మానవుని అధఃపతనము గావిస్తుంది. అహంకారమే మానవుని ప్రధాన శత్రువు. ఫుట్ బాల్లోపల గాలి ఉన్నంత వరకు అటువైపు వారు ఇటువైపు వారు కాళ్ళతో తన్నుతుంటారు. ఎప్పుడైతే గాలి పోతుందో ఆప్పుడే దానిని చేతికందుకుంటారు. ఈ ఫుట్ బాలు లోని గాలి వంటిదే మానవుని లోని అహంకారము. ఈ అహంకారము ఉన్నంత వరకు ఇతరుల నుండి దెబ్బలు భరించక తప్పదు.
అట్లే క్రోధము ఉన్నంత వరకు మానవునికి దుఃఖము తప్పదు. ఇది భయంకరమైన అగ్ని జ్వాల వంటిది. కనుకనే దీనికి క్రోధాగ్ని అని పేరు...
"క్రోధము కల్గిన వానికి ఏ పనియు ఫలింపకుండు
ఎగ్గులు కలుగును, తనకు గల గౌరవము దగ్ధము సేయున్
తన వారల కెడ చేయును, పనులకు కోపంబు వలన సర్వము చెడున్”
మూడవ శత్రువు కోరిక. ఇది మానవుని యందు నఖశిఖపర్యంతము వ్యాపించి ఉన్నది. ఒక్క కోరిక తీరిన క్షణమే పది కోరికలు అభివృద్ధి అవుతుంటాయి. ఏనాడు మానవుడు తన కోరికలను అదుపులో పెట్టుకొనునో, ఆనాడే అతని సర్వ సంకల్పములు సిద్ధిస్తాయి.సర్వసంపదలూ అతనికి చేకూరుతాయి.
ఇక నాలుగవది లోభము. ఇది ఏనాడూ మానవుని నుండి వేరగునో ఆనాడే అతనికి సుఖము లభిస్తుంది. లోభత్వము కలిగిన వానికి శారీరక, మానసిక ఆధ్యాత్మిక సుఖములన్నీ దూరమైపోతాయి. లోభిని కుక్కతో పోల్చారు. గడ్డివాముపై కూర్చున్న కుక్క పశువులను దగ్గరకు రానివ్వదు. తాను ఆ గడ్డి తినదు. అదే విధంగా లోభి తాను భుజించడు, పరులకు అందించడు. కలలో కూడా లోభికి సుఖము ఉండదు. నిజంగా ఈ నాలుగూ మానవుని యందు ఉండవలసినవి కావు.
(శ్రీభ.ఉపు.177)
ఆత్మనుండి మొట్టమొదట వినుపించే శబ్దము నేను. ఈ నేను అనే శబ్దము పుట్టిన తరువాతనే సృష్టి అంతయు ప్రారంభమైనది. నేను లేకుండిన సృష్టియే లేదు. నేను బ్రహ్మ, ఆత్మ పర్యాయపదములు. మనోరహితమైన నేను స్వస్వరూపమైన ఆత్మ. మనోసహితమైన నేనే మిథ్యాత్మ, ఉన్నది ఒకే ఆత్మ. అదే ఒక్క నేను.
(బృత్ర.పు.124)
(చూ॥ అనహంకారము, శాంతి, శ్రీరాముడు)