"రాముడు, కృష్ణుడు దేవి, షిరడీబాబా, అంటూ ఎన్నెన్నో దేవతామూర్తుల నామములను గానం చేసినప్పుడు నేను వారికి భిన్నమని ఎన్నడూ భావించలేదు. భజన యొక్క లక్ష్యమే నేనైనప్పుడు నేనే సంకీర్తనము చేయుటలో నా కొచ్చే లాభమే మున్నది? పట్టభద్రుడైన ఒక అధ్యాపకుడు కూడా ఒక చిన్న పసిబిడ్డకు విద్యారంభం చేయవలసి వచ్చినప్పుడు . అ...ఆ...ఇ...ఈ... అంటూ అచ్చులతోప్రారంభించినట్లుగానే మీకు భగవన్నామ సంకీర్తన నేర్పే నిమిత్తమేనేను కూడా సంకీర్తనము చేయ వలసి వస్తున్నది. ఒక గొప్ప పరుగుపందెపు ఆటగాడు కూడా, తప్పటడుగులు వేసే తన బిడ్డకు నడక నేర్పేందుకు ఒక తోపుడు బండిని తాను పట్టుకుని నడిచి చూపించవలసిన అగత్యం ఏర్పడినట్లు నేను కూడా నామావళిని పాడటం, వాటిని మీరు నేర్చుకుని గానం చేసేందుకే. యింతకన్నా కూడా ఒక మెట్టు మీకోసం, నేను దిగవలసి వచ్చినా అది కూడా మీ శ్రేయస్సుకై చేయటానికి సిద్ధంగా వున్నాను. బురదలో పడ్డ బిడ్డను రక్షించటానికి తల్లి తాను కూడా ఆ బురదలో ఏ విధంగా దిగుతుందో అదే విధంగా మీ కొచ్చే ఉపద్రవాలనుండి మిమ్ము రక్షించేందుకు ఒక తల్లిగా నేను కూడా వాటిలో పాలుపంచుకున్నట్లుగా నటిస్తాను. అంతెందుకు దొంగను పట్టేందుకు యుక్తిగా ఒక పోలీసు అధికారి కూడా దొంగవేషమే వేయవలసి వచ్చినట్లు నేను కూడా అప్పుడప్పుడు, మీరు చేసే తప్పు పనులనే నేనూ చేస్తున్నట్లుగా మిమ్మల్ని భ్రమింప చేస్తుంటాను." (స్వాపు.306/307)
"తియ్యని తేనె వంటి భగవన్నామామృతమును, సులభంగా, ఆస్వాదించేందుకే, మీకీ నామభజన అందిస్తున్నాను. మంత్రము, జపము, పూజ, యోగము వంటి సాధనలు, మీకు కఠినము, కష్టసాధ్యము. అందువల్ల సులభమైన నామ సంకీర్తనమే మీకు తగిన సాధన. భగవంతుని దివ్యనామాన్ని మీ నాలికపై నిలిపి, మీ ప్రాణశక్తియైన శ్వాసంతో లయమొందించి, ఆనందముగా భజన చేయండి! తాళము వేస్తూ పాడండి. రెండు చేతులు కలిపి చప్పట్లు కొట్టగానే, చెట్టుమీద చేరిన కాకిగుంపు ఒక్క మాటుగా, ఏ విధంగా ఎగిరిపోతుందో, అదేవిధంగా మీరు భజన చేసేటప్పుడు ఆ కరతాళధ్వనికి, మీ మనస్సులలో జనించే పాపపంకిలపుటాలోచనలన్నీ ఒక్క మాటుగా, ఎగిరిపోయి అచ్చట ఆ పరమాత్ముని నామము మాత్రమే నిలిచి, పవిత్రమవుతుంది" (సా.పు.31/312)
మరుపురాని మధురానుభూతియే భజన. నామి యొక్క సన్నిధికి చేర్చునానా నామము. మీ హృదయములు దయతో కరిగి భక్తి భావముతో పరిశుద్ధమై ప్రేమతో పాంగినప్పుడు, స్వామికి చాలా ఆనందము కలుగును, ఆనందో ద్రేకములో పాడండి, అంతే చాలు. అర్థమయ్యే రీతిగా, ఆనందము తొణుకు లాడేటట్టుగా భజన చెయ్యాలి. యాంత్రికముగాగ్రామ్ ఫోన్ ప్లేట్లవలె టేప్ రికార్డుల వలె, భజనలు పాడితే స్వామికే మాత్రము తృప్తి యుండదు. భజనలో పాల్గొన్న తరువాత మన స్థితిలో ఏకించితై నా మార్పు కలిగినదా, అని పరీక్షించవలెనని చాలామార్లు శ్రీవారు హెచ్చరించియున్నారు కదా? పూర్వపు మాదిరే ఈర్ష అసూయ, కలహ ప్రీతి, పరనిందాసక్తి, ఆత్మస్తుతి మొదలగు దుర్గుణములే మిగిలియున్నవా? నిర్మలమైన ఉదాత్త దృష్టి కలుగలేదా? సాటి మానవులలో వెలుగుచున్న దైవత్వమును వీక్షించి ఆనందించుచున్నారా? మాటలు తగ్గి, సేవాసక్తి పెరిగి మునుపటి కన్న మిన్నగా పరులను శత్రుమిత్రులనే భేదభావము లేక ప్రేమించగలిగిన, భజన సాధన ఫలించినటులే.
భజన ఒక దివ్యానుభూతి. దాని ఫలితముగా శాంతి ప్రేమలను పొంది సుఖింతుము. భజనలో కొంతసేపైననూ దైవసాన్నిహిత్యమును అనుభవించ కలిగెదము.
అన్నింటి కన్న భజన కార్యక్రమమే స్వామికి ఆనందము నందించును. అయితే ఉత్సాహముగా ఉల్లాసముగా ప్రతి పదము యొక్క అర్థమునూ, సారమును గ్రహించి ఆనందించే భజనయే. ఇతరులకు కూడా ఆనంద మందించును. రాగము, తాళము శ్రుతి, పదభావములు అన్ని మధురముగా ఉండాలి. (త.శ.మ.పు.300/301)
మన భజన పాటలు, నామావళుల గానము హృదయ కుహరమునుండి వెలువడినవా? లేదా? అని మన మెట్లు గ్రహించగలము? శ్రద్ధగా విని పాడ ప్రయత్నించు భక్తుని కన్నమనకు వేరు పరీక్షించు మార్గము లేదు. ప్రగాఢమైన భక్తితో మధురకంఠముతో రాగతాళ లయబద్ధముగా అందరి హృదయవాసి అయిన సాయిభగవానుని ఆనందపరచగల భజనలే పాడవలెను. అందరి ఆనందమే సాయికి హాయి. త .శ.మ.పు.302)
అంతా భజనలలో పాల్గొనాలి. నోరు దేవుడు యిచ్చిన దెందుకు? పరమాత్మ నామమును నాలుక మీద నాట్యం చేయించేటందులకే! జీవిత మనే ఏడారిలో, మానవుని దాహము తీర్చగలదా ఒక్క నామము మాత్రమే. "సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనమ్" దానిలో ఆసక్తి కలిగిన వారు అందరు చేరే అవకాశము కలిగించాలి. అనుకూలము కలిగిన స్థలమందు, కాలమందు, భజనలను ఆనందముగా చేయండి. మీకు ఆత్మానందము అందిచ్చే ఏ భగవన్నామమైనా సరే, శ్రావ్యముగా, హృదయములోని ఆవేదనతో, ఉత్సాహముతో పాడండి. ప్రణవోచ్చారణములో (మూడుసార్లు) భజనము మొదలు పెట్టిదానితోనే ముక్తాయ పరచండి. మీరు ఏనామముతో భజన చేసినా నాకే చెందుతుంది. అన్ని నామములు, రూపములు నావేగా. ( సా.పు.4)
ఒక వృక్షం క్రింద చేరి గట్టిగా శబ్దంచేస్తూ చప్పట్లు కొడితే కొమ్మల మీద పక్షులన్నీ దూరంగా పోతాయి. మన జీవితం కూడా ఇటువంటిదే. జీవిత వృక్షం పై కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనే పక్షులు మహా గందరగోళం చేస్తూంటాయి. కనుక మీరు "రామ కృష్ణగోవింద నారాయణ" అని శబ్దం చేస్తూ, లయగా చప్పట్లు కొడితే అవన్నీ ఎగిరిపోయి మీ హృదయ క్షేత్రాలు శుభ్రమవుతాయి." (త శ.మ.పు.36/37)
“నిన్నటినుండి మనము అఖండ నామసంకీర్తన చేశామనుకుంటున్నాము. నిన్న తొమ్మిది గంటలకు ప్రారంభించి ఈనాడు తొమ్మిది గంటలకు మనం ముగించుకొన్నామంటే, ఇది అఖండ భజన అనిపించుకొంటుందా?! “సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం” మన ఉచ్చ్వాస నిశ్వాసములవలె భగవన్నామస్మరణకూడా నిరంతరాయంగా సాగుతూ ఉండాలి. అప్పుడే అది అఖండ భజన అవుతుందిగాని, లేకపోతే కేవలం ఖండ భజనగానే ఉంటుంది. అయితే, అఖండమైన ఆత్మతత్త్వాన్ని చేరుకోవటానికి దీనిని ఒక సోపానంగా భావించుకోవాలి”
"పాపభయంబు పోయె,
పరిపాటైపోయెను దుష్కృతంబిలన్,
శ్రీపతి భక్తిపోయె, వివరింపగలేని
దురంతకృత్యముల్
దాపురమయ్యె లోకమున,
తాపసలోక శరణ్యుడైన ఆ
శ్రీపతి నామచింతనయె
చేకురజేయు సుఖంబు మానవా!”.
(సనాతన సారథి, ఫి 2020 పు7)