సుకృతులు నిరంతరము సద్గుణ, సదాలోచన, సర్వేశ్వర చింతనలలో భగవదాసక్తులై ఆరాటపడుచుందురు. అట్టివారు అర్హులు కావచ్చు. అర్ధార్థులు కావచ్చు. జిజ్ఞాసువులు కావచ్చు. వీరి జన్మజన్మాల పుణ్యకర్మలే వీరికిట్టి స్వభావములు కలిగించును. సంస్కారములో ఈ జన్మయందు కూడనూ పుణ్యకర్మలే ఆచరింతురు. సుకృతులు. కాని గీత సకామ కర్మలను అంగీకరించదు. నిష్కామ కర్మనే నిర్మోహమాటంగా అందించుచున్నది. ఆర్త, అర్ధారి, జిజ్ఞాసు, జ్ఞాని అనే ఈ నాలుగు విధములైన భక్తులలో మొదటి ముగ్గురు అయిన ఆర్త, అర్ధార్థి, జిజ్ఞానులు. భగవంతుని పరోక్షముగా భావించి ప్రార్థింతురు. అయితే వాని అట్లుకాక స్వాత్మరూపముగా అపరోక్షముగా పెరిగి సేవిస్తాడు. అట్టివాడు సదా భగవన్నిష్ణుడై యుండును. పై మొదటి మూడు మార్గములవారు తమ తమ అభీష్టప్రాప్తి కోసం భగవంతుని సాధనంగా ఉపయోగించుకొందురు.
జ్ఞానిది ఏకభక్తి: మిగిలిన ఆర్త, అర్ధార్థి, జిజ్ఞాను లను మూడు అవస్థలవారిది అనేక భక్తి (అనగా కోరే వస్తువులయందూ, విషయములందూ, భూతముల యందూ, భగవంతునియందూ, అన్నింటియందూప్రేమను ప్రవహింపజేయుదురు). అట్టివారు భగవంతునికే కాక వస్తు వాహనములకు విషయ విహారములకూ భక్తులగుదురు. జ్ఞాని భగవంతునకు తప్ప మరే ఇతరమైన వాటిని కన్నెత్తి కూడనూ చూడడు. చూచిననూ అతనికి సర్వమూ భగవంతుడుగా గోచరించును అందువలన పరమాత్ముడు జ్ఞాని నాకు అతి ప్రియమైన వాడని తెలిపెను. భగవంతునకు అందరూ సమానమే అయిననూ, చెంతచేరి సన్నిహితులుగా వున్నవారిపై ప్రేమ ప్రత్యక్ష గోచరము, అనుభవము. కనుక జ్ఞాని భగవంతునికి అతి సమీపమున ఉన్నవాడనే తలంచవలెను.
శీతలబాధ తీర్చుట అగ్నికి సహజ గుణము; ఆయిన్పటికిని దగ్గర కూర్చొనక అతి దూరమున నుండిన వానికిశీతలమెట్లు తీర్చును ఆతని శీతల బాధను తీర్చనంత మాత్రమున అగ్నికి
శక్తి లేదని అర్థము కాదు. శీతల బాధను తీర్చుకొనవలెనని అభీష్టమున్న వాడు యెట్లు అగ్ని సమీపమున నివసించవలెనో అటులనే అనుగ్రహమను జ్ఞానాగ్నిని అనుభవించి తమ తమ ఈతి బాధలను, శీతలమును దూరము చేసుకొనవలెనన్న అభీష్టము కలవారు, జ్ఞానులై పరమాత్మునికి సన్నిహితులగుటకు ప్రయత్నించవలెను.
సాధకులలో కలిగిన ప్రయత్న లోపమునకు సర్వేశ్వరుని అడ్డు పెట్టుకొని, దేవునకు పావులనీ, పుణ్యలనీ, జ్ఞానులనీ, అజ్ఞానులని భేదమున్నదన్న అవి అర్ధములేని వ్యర్థపూజలు భగవంతునికెప్పుడూ అట్టి భేదములు లేవు. నిజముగా భగవంతునికే అట్టి భేదములే వుండి యుండిన పాపులు లోకమున ఒక నిమిషము కూడనూ బ్రతుకలేరు. భగవంతున కట్టి భేదములేదు. కనుకనే అందరూ లోకమున బ్రతుకు చున్నారు. ఇట్టి సత్యము జ్ఞానికి మాత్రమే తెలియును. కాని తక్కిన వారలకు తెలియదు. కనుకనే దేవుడు మాకు దూరముగా యెక్కడో ఉన్నాడని పిచ్చి భ్రాంతిలో పడి పరితపించుచున్నారు.
జ్ఞాని మాయాతీతుడు, గుణరహితుడు, జిజ్ఞాసువు అట్లుకాక అన్య అపేక్షలకు చోటివ్వక నిరంతరము భగవత్ చింతనలతో సత్ ప్రవర్తనలతో, సదాలోచనలతో కాలమును గడుపును. ఇక అర్థార్థుడు, ఆర్తుడు క్రమక్రమేణ విషయ విచారణచేసి సాధనలతో విశ్వాసములతో జిజ్ఞాసువుగా మారి దానిద్వారా జ్ఞానమును చేరగలుగు చున్నారు. దానిని ఆశ్రయించి తరించుచున్నారు.
పై విధముగ సాధన స్థానములు ఒకదానిద్వారా ఒకటిని దాటేగమ్యమును చేరును. అట్లు లేక ఒక పర్యాయము గమ్యమునకు చేరవలెనన్న అది సాధ్యముకాదు. దీనికి ఒక ఉదాహరణము; జ్ఞానమను నది ‘త్రూ రైలు అనగా అందులో సాధకుడు ప్రయాణము చేసిన యెక్కడా మధ్యలో దిగనక్కరలేక తాను చేరవలసిన స్థానమును చేరును.
జిజ్ఞాసు అనునది త్రూక్యారేజి (రైలు పెట్టి). అందులో ప్రయాణము చేయు సాధకుడు దిగనక్కరలేదు. కానీ ఈ పెట్టెను మరొక బండికి తగిలింతురు. అట్టి మార్పులుండును. దానిద్వారా గమ్యమును చేరును. ఇక ఆర్తుడు, అర్ధార్థుడు అనునది సామాన్యమయిన రైలు బండి. అనగా త్రూ రైలు కాదు, త్రూక్యారేజి కాదు. ఆ బండి పూర్తి గమ్యము వరకూ పోదు. కనుక ఆ బండిలో యెక్కిన సాధకుడను ప్రయాణీకుడు మధ్య మధ్య బండినుండి దిగి తరువాత మరొక బండికి కాచుకొని వుండి ఆ తరువాత మరొకబండి యెక్కి దానిద్వారా గమ్యమును చేరును. ఇందులో ప్రయాణము చేయువారు కొన్ని కష్టములకు శ్రమలకు గురికావలసి వచ్చును. అయితే కడకు గమ్యము మాత్రము నలుగురూ చేరుదురు, కాని కాల కర్మములు వ్యత్యాసము. అందువలననే భగవంతుడు "ఈ నాలుగు విధముల వారూ నావారే" అని పలుమారులు తెలుపుచుండును. కారణమేమి? గమ్యము ఒక్కటే గనుక. కాన అల్ప వస్తువులను కొరిక అది దైవమును కోరుటలో ఆనందము మెండు. అల్ప వస్తువును కోరేవారు కృపణులు, భగవంతుని కోరే వారు ఉదారులు అని కూడనూ కృష్ణ పరమాత్మ అన్నాడు.
(గీ.పు.114/118)