"బ్రహ్మ ప్రాప్తి, కొత్తగా సాధించుకునే విషయం కాదు. జీవుడే బ్రహ్మస్వరూపుడు. "జీవో దేవ సనాతనః" లౌకిక జగత్తు నందు కూడా జీవుడై యుంటున్నాడు. దేహధారియై మనో ఇంద్రియ సంసర్గముచేత తాను కేవలము మానవుడనని భ్రమిస్తున్నాడు. మేఘముల జలము పరిశుద్ధమై యున్నప్పటికిని భూసంసర్గముచేత మాలిన్యమగుచున్నది. ఇంత మాత్రముచేత జలముయొక్క పరిశుభ్రత సమసిపోదు. అనేక ప్రదేశములందు అనంతకాలము అనేక రూపనామములు ధరించినప్పటికిని సముద్రము తన స్వభావము కోల్పోదు. అటులనే దేహమును మనస్సును, ఇంద్రియములను చేర్చుకొన్న జీవత్వము ఎంత కాలమైనప్పటికిని ఎన్ని విధములైన నామరూపములు మారినప్పటికిని బ్రహ్మతత్త్యము లక్ష్యమునందు ఉంచుకొనవలసి వస్తుంది. "మమైవాంతో జీవలోకే జీవభూత సనాతనః" అని గీత బోధించింది. సనాతనమైన నా అంశమే సర్వశరీరములయందు సర్వత్రా ప్రకాశించుచున్నది. దీని భావము "శృణ్వంతు విశ్వే అమృతశ్యపుత్రా:" ప్రతి మానవుడు అజ్ఞానమువలన తాను మానవుడవని భ్రమించుచున్నాడు. కాని నిజముగా అమృత పుత్రుడని వేదము ఎలుగెత్తి చాటు చున్నది.
(సా.పు.234)