పూర్వజన్మల కర్మను ఈ జన్మలో పూర్తిగా అనుభవించాలనీ భగవదనుగ్రహం ఎంత వున్నప్పటికీ దానిని తప్పించలేదని మీరు అనుకోవచ్చు. ఈ విధమైన బోధ మీకు ఎవరో చేసివుంటారు. అందు వల్ల మీరు ఆ విధంగా తలుస్తున్నారు. ఆ విధంగా మీరు కర్మను అనుభవించనవసరం లేదని నేను అభయమిస్తున్నాను. తీవ్రమైన బాధ కలిగినప్పుడు వైద్యుడు మత్తు ఇంజక్షనిస్తాడు. శరీరానికి ఆ బాధ తెలియదు. బాధ వున్నప్పటికి తెలియకుండానే మత్తుమందు వంటిది దైవానుగ్రహం. మీరు అనుభవించ వలసినకర్మ యొక్క తీవ్రబాధను అనుగ్రహం హరిస్తుంది. కొంతకాలము తరువాత పనిచెయ్యని మందులు కొన్ని వున్నవి. ఆ విధంగానే కర్మ ఫలం అనుభవానికి రాకుండా పోతుంది. కర్మఫలం అనుభవించవలసి వున్నప్పటికీ దాని బాధలేకుండా తెలియకుండా చేస్తుంది అనుగ్రహం. భగవంతుడు కర్మ ఫలం నుంచి పూర్తిగా రక్షించగలడు.గురుపూర్ణిమకు వారం దినాల ముందు ఒక భక్తుని పక్షవాతమునూ హృద్రోగమున నేను అనుభవించి అతడిని రక్షించాను. లలాటలిఖితం చెరిపివేయలేము అనటం పొరపాటు. కిందటి జన్మలోకూడ చేసుకున్న కర్మను ఈ జన్మలో అభవించక తప్పదనటం కూడా సరికాదు. అనుగ్రహం అన్నింటిని రద్దుచేయగలదు. దానికి ఆటంకాలు లేవు. అది సర్వశక్తిమంతమైన అను గ్రహమని మరువకండి.
(వ.1963పు.180/181)