ఒక పౌర్ణమినాడు వశిష్టుడు చల్లని, చక్కని వెన్నెలలో అరుంధతితో ఒక గుట్టపై కూర్చుని ఉండగా అతనిని ఏవిధంగానైనా హతమార్చాలని విశ్వామిత్రులవారు చక్కని ఖడ్గమును తీసుకొని వెళ్లి ఆ కొండ దగ్గరలో ఒక పొదలో దాగి ఉన్నాడు. అతని శిరస్సును ఖండించడానికి అన్ని విధాల విశ్వామిత్రుడు సంసిద్ధంగా ఉంటున్నాడు. ఆ సమయములో వశిష్ట అరుంధతులు సంభాషించు కుంటున్నారు. అరుంధతి “ఈనాడు పూర్ణపౌర్ణమి. చంద్రుడు ఎంత తెల్లగా, ఎంతచల్లగా ప్రకాశిస్తున్నాడో ఇంత పరిశుద్ధమైన పూర్ణిమను నేనెన్నడూ చూడలేదు. కదా!" అన్నది. వశిష్టుడు, "అవును అరుంధతీ! ఈ పవిత్రత, చల్లదనము. ఈ పరిశుద్ధత, విశ్వామిత్రుని తపశ్శక్తి వల్లనే" అన్నాడు. ఈ మాట వినేటప్పటికి విశ్వామిత్రుని హృదయము చాలా మార్పుచెందినది. “ఈ వశిష్టులవారిది ఎంత గొప్ప హృదయము! భార్యల వద్ద నిజమైన సత్యాన్ని నిరూపించటం పురుషుల లక్షణం. అలాంటిది నాతపశ్శక్తిని భార్య వద్ద ఎంత గొప్పగావర్ణిస్తున్నాడు నాదే దుర్మార్గము" అని ఆకత్తిని పారవేసి, పరుగెత్తుకొని వచ్చి వశిష్టుని పాదముల పై పడినాడు. ఈ దృశ్యమును చూచివశిష్టులవారు "బ్రహ్మర్షిలెమ్ము " అన్నాడు. విశ్వామిత్రునికి ఎంతో ఆశ్యర్యం కలిగింది. ఇంత కాలము ఇంత తపశ్శక్తిని సంపాదించినప్పటికినీ నన్ను రాజర్షి అని పిలిచిన వశిష్టుడు ఈనాడు నేను దుర్మార్గమునకు పూనుకున్నపుడు బ్రహ్మర్షి" అని పిలుచుటలోగల అంతరార్థమును అడిగి తెలుసు కోవా" లనుకున్నాడు. అప్పుడు వశిష్టుడు "విశ్వామిత్రా! నీవు ఎవరికీ తల వంచేవాడవు కాదు. లొంగే టటువంటి వాడవు కాదు. ఈ విధమైన అహంకారము చేత నీవు స్వేచ్ఛా విహారము సలుపుతూ వచ్చావు. ఈనాడు నీ శిరస్సును వంచి, లొంగినట్లుగా పాదాక్రాంతుడవైనావు. ఇప్పటినుంచి నీవు బ్రహ్మర్షివి" అన్నాడు. దీని అంతరార్థమేమిటి? అహంకారముతో ఉండినంతవరకు, అసూయ అనేది అన్ని విధాల హింసిస్తూ ఉంటుంది. ఏనాడు ఆహంకారము పోయి వినయవిధేయతలతో ఉంటామో ఆనాడు మన పేరు ప్రతిష్టలు వ్యాప్తి కావటానికి అవకాశం ఉంటుంది. అహంకారంతో ఉండటంచేత అతనిని రాజర్షి అన్నారు. రజోగుణ సంపత్తి గలవాడు రాజర్షి. మహారాజు అనగా ఏమిటి? రాజులు రజోగుణము కలవారు కనుక రాజులు అన్నారు. కనుక ఏనాడు ఈ రజోగుణము పోయి, సాత్త్విక లక్షణములయిన వినయవిధేయతలతో ప్రవర్తిస్తామో, ఆనాడు పవిత్రత మనకు ఏర్పడుతుంది. క్రమక్రమేణా మనము వినయ విధేయతలతో ప్రవర్తించడానికి ప్రయత్నిస్తే మన హృదయానికి యీ అహంకార, అసూయలు సాధ్యమయినంతవరకు దూరము చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ. మన సేవాదళం వారు అనేక బహిరంగ సమావేశములలో కాని, గుంపుగా జనం చేరినచోట్ల గానీ అనేక సేవలు చేస్తుంటారు. తాను సేవాదళ సభ్యుడు కదా అని ఒక badge వేసుకునిఉండుట చేత ఒక అహంకారముతో ఇక్కడ కూర్చో, అక్కడ కూర్చోవద్దు అని వారి పైన జబర్దస్తీ చేయడానికి కొంత అవకాశం ఉంటుంది. నీవు వేసిన badge అహంకారాన్ని దూరం చేసేదేకాని, ఇనుమడింప చేసేది కాదు. వచ్చిన ప్రేక్షకులకు ప్రజలకు నీవు సాధకుడవు, సేవకుడవుకాని నీవు అధికారిని కాదు. ఒక ఇంటిలో సేవకుడు యజమానిపై అధికారం చెలాయించినపుడు యజమానికి ఎట్లుంటుందో నీవు యోచించు. మనము వచ్చేవారికి సేవచేయడానికి ఉంటున్నాము. మనముసేవకులుగా ఉంటుండి. వచ్చినవారిపై అధికారం చెలాయించడానికి ప్రయత్నిస్తే మన అధికారాన్ని మనం కోల్పోతాము. ఎదుటివారు ఒక వేళ మన సమావేశములో అభ్యంతరములు కలిగిస్తూ అడ్డుతగులుతుంటే వారికి మొట్టమొదట నమస్కరించాలి. వారకి మంచి మాటలతో ఇక్కడ కూర్చో, కొంచం జరిగితే అందరికీ వీలుగా ఉంటుందని చెప్పడానికి ప్రయత్నించాలి. అయితే కొంతమంది మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి సమయంలో మనం కూడా కొంచెం మూర్ఖంగా ఉండవలసి వస్తుంది.
(స. సా..ఆ.79పు,176/177)