బ్రహ్మజ్ఞానమునకు జిజ్ఞాసా నివృత్తియే పర్యవసానము: సాక్షాత్కారమే దాని ఫలము. ఈ సర్వోత్కృష్ట స్థానము సమాధి లభ్యము. సాక్షాత్కారమున కనివార్యముగా పూర్వాంగములగు శ్రవణ మనన నిధి ధ్యాసములు బుద్ధివిషయములే అగుచున్నవి. ఈ జన్మమునందే ఆత్మస్వరూపమును తెలిసికొనినయెడల దాని ఫలముగ సత్యస్వరూపము సిద్ధించును. అట్లు తెలిసికొనలేక పోయినయెడల జన్మ నిష్పలమగును. జ్ఞానులగువారు ప్రతి భూతమునందును నద్వితీయమగు ఆత్మ తత్త్యమును గ్రహించి ఈ లోకమునుండి పోయిన తరువాత జనన మరణములు లేని వారగుచున్నారు. బ్రహ్మజ్ఞానమునకు అధికారి మనుజుడు. అతడు సమర్థుడై పూర్వోక్త లక్షణ లక్షితమగు పరమాత్మస్వరూపమునుపూర్వోక్త ప్రకారమున తెలిసికొనినచో వాని జన్మము సఫలమగును. అట్లు కానిచో వృథాయగును. సుప్రసిద్ధమైన పరబ్రహ్మము మెరుపుతీగవలె ప్రకాశించును. కనురెప్పపాటువలె అత్యంత శీఘ్రముగా ప్రకాశతిరోధానములు గలది. ఇది బ్రహ్మ యొక్క దైనిక స్వరూపము. బ్రహ్మ యొక్క స్వరూపము దుర్వజ్ఞేయము. మనస్సు బ్రహ్మమునకు ఉపాధియగుటంజేసి అది అత్యంత సమీపమున నున్నటుల కాన్పించుచున్నది. అందువలన మనస్సు బ్రహ్మమును పొందుచున్నట్టున్నది. నిజముగా అది అద్దానిని పొందుటలేదు. అత్యంత సామీప్యముచే నేను బ్రహ్మమయితినని ప్రతిక్షణము సాధకుడు స్మరించుచున్నాడు. అందువలన బ్రహ్మ సాక్షార్కా రాభిలాష యతనికి పలుమారు కలుగుచున్నది. అట్టి స్మరణ సంకల్పాది చిహ్నములచేత బ్రహ్మ ముపాస్యమగుచున్నదని భావము. బ్రహ్మజ్ఞానికి ధర్మాధర్మములు పుణ్య పాపములు నశించును. ధర్మాచరణచే ఉత్తమలోకమును, అధర్మాచరణచే అధోలోకమును సంప్రాప్తమగును. రెండునూ బంధ కారణములే. సమస్త హృదయ గ్రంథులను శిథిలముచేసి, అవిద్య సంతమొందించి, సాధకుని అత్యంతము బ్రహ్మసామీప్యమును పొందించు నది కనుక ఉపనిషత్తను పేరు వచ్చినది. బ్రహ్మజ్ఞానమునకు తపస్సు, దమము, అగ్నిహోత్రాది కర్మలు ప్రతిష్టాభూతములు. వేదములు దాని అంగములుగా ఉన్నవి. సత్యమే అద్దానికి నివాసము.బ్రహ్మ జ్ఞానోపదేశమంతయు ఈ ఉపనిషత్తున చెప్పబడినది. ఈ ఉపనిషత్తున ఉపదేశింపబడిన దంతయును సత్యజ్ఞానానంతలక్షితమగు బ్రహ్మ విషయమై ఉన్నది.
(ఉ.వా.9.పు.54/56)
(చూ॥ ఉత్తు సమన్వయాత్, దక్షుడు, సచ్చిదానంద)