ఒక పర్యాయము సూరదాసు ఎవరో పరస్త్రీని చూసినందుకు ప్రాయశ్చిత్తంగా తన కళ్ళను తానే పొడుచుకున్నాడు.అప్పటి నుండి కృష్ణచింతనలో కాలం గడుపుతూ వచ్చాడు. ఒకనాడతడు ద్వారకకు ప్రయాణమై వెళుతూ ప్రమాదవశాత్తు దారిలో ఒక పాడుపడిన బావిలో పడబోయాడు. అతడు నిరంతరము కృష్ణనామాన్ని స్మరిస్తూ ఉండడంచేత కృష్ణుడే ఒక గొల్లపిల్లవాని వేషంలో వచ్చి అతణ్ణి పడిపోకుండా పట్టుకొని “దాసుగారూ! ఎక్కడికి వెళ్ళాలి" అని అడిగాడు. "నాయనా! నేను ద్వారకకు వెళ్లాలి" అని చెప్పాడు. “అయితే నేను దారి చూపిస్తాను. కానీ ఇప్పుడు చీకటి పడుతోండి. ఇక్కడ సమీపంలోనే ఒక సత్రం ఉంది. ఈ రాత్రికి అక్కడ ఉండండి. రేపు ఉదయమే వచ్చి మిమ్మల్ని తీసుకు వెళతాను" అన్నాడు. "నాయనా! నీవు వెళ్ళిపోతే మళ్ళీ వస్తావో రావో! కనుక నీవు వెళ్ళకూడదు" అని గట్టిగా ప్రార్థించాడు. అంతేకాదు. "నీవు నా ప్రక్కనే పడుకో. నీచేయి నా పైన వేసుకో, నా చేయి నీపైన వేసుకుంటాను. అప్పుడు నీవు నా ప్రక్కనే ఉన్నావన్న ధైర్యం నాకుంటుంది" అన్నాడు. ఆ రాత్రి సూరదాసు కృష్ణునిపై చేయి వేసుకొని నిద్రించాడు. స్పర్శనం కర్మవిమోచనం, సంభాషణం సంకట నాశనం! కృష్ణుని స్పర్శచేత అతనిలో దివ్యమైన జ్ఞానం ఆవిర్భవించింది. తెల్లవారి లేచిన తరువాత కృష్ణుడు "సూరదాసూ! నేనే కృష్ణుణ్ణి. నీ అజ్ఞానాన్ని దూరం గావించే నిమిత్తమై నే విధంగా నాటకమాడాను" అని పలికి అతని కన్నులను ఒక్క తూరి స్పృశించాడు. తక్షణమే అతనికి చూపు వచ్చింది. కృష్ణుని దివ్య మంగళ స్వరూపాన్ని తనివితీర దర్శించాడు. "కృష్ణా! నిన్ను చూసిన కన్నులతో ఇతరులను చూడడానికినేనిష్టపడను. ఇంక నాకీ కన్నులు అక్కరలేదు. ఈ ప్రపంచంలో ఎంతో మందికి కన్నులున్నాయి. కాని ఏమి ప్రయోజనం? కన్నులుండి గ్రుడ్డులై కల్యాణకరమైన నీ మూర్తి దర్శింపనేరరైరి. నేను నీ రూపాన్ని చూశాను. నాకింతే చాలు. కనుక నాకీ చర్మచక్షువులు అవసరం లేదు. జ్ఞానచక్షువును ప్రసాదించు" అని ప్రార్థించాడు. అప్పుడు కృష్ణుడు అతని తలపై చేయి పెట్టాడు. అతని ప్రాణం కృష్ణునిలో లీనమై పోయింది.ఈ విధంగా ఎప్పుడు ఎక్కడ ఏ పరిస్థితిలో దైవాను గ్రహం లభిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. కనుక మీరు నామస్మరణ చేస్తూ ఎల్లప్పుడు సిద్ధంగా ఉండండి.
(స. సా.అ..98.పు 217/218)