బలి చక్రవర్తి దానపరుడు, సత్యమును కాపాడుకొనే నిమిత్తం, తన సర్వస్వాన్ని సమర్పించాడు. వామనుడు మూడడుగులు దానం కోరినప్పుడు, ఏమాత్రం వెనుకాడక ఇచ్చివేశాడు. శుక్రాచార్యుడు వద్దని చెప్పినా వినకయిచ్చిన వాగ్దానమును నిలబెట్టుకున్నాడు. బలి సత్యం కోసం నిలబడ్డాడు. కనుకనే వామనుడు బలిని పాతాళము నకు అణగదొక్కాడు. అంటే ఏమిటి? మరో జన్మలేకుండా ప్రసాదించాడన్న మాట. జన్మరాహిత్యమే మోక్షమన్నమాట. ఆనాడు బలి వామనుడ్ని ఒక చిన్న కోరిక కోరాడు. ఈనాడు ఏవిధంగా తమరు మా కేరళ దేశం వచ్చారో! అదే విధంగా ప్రతి సంవత్సరం కేరళ దర్శించి, కేరళప్రజలను కాపాడుతూండాలని కోరుకున్నాడు. కనుకనే వామనమూర్తి కేరళ వచ్చిన శుభదినమునకు చిహ్నంగా ఓణం అని పేరు పెట్టుకొని కేరళకు ప్రజలు ఆనాడు ఆనందాన్ని అనుభవిస్తూ వస్తున్నారు. కనుక బలిచక్రవర్తి చాలా పుణ్యాత్ముడు. అతని పూర్వజన్మ పుణ్యంవలన, అతను చేసిన త్యాగమువలననే, ఈ కేరళ ప్రజలకు ఈ “ఓణం" అనేటటువంటి గొప్ప పండుగ ఏర్పడింది.
(శ్రీ ఆ.2001 పు.87)
(చూ|| విశ్వామిత్రుడు, సంకల్పములు)