మీ కందరికిని తెలుగు మహాభారతంలో బలహీనుడు ఎట్టివాడు అని పరీక్షచేసే నిమిత్తమై ఒకానొక సమయంలో కృష్ణుడు కౌరవులయందు ఒకరిని ఎన్నుకొన్నాడు. ఒకనాడు ఒకరికి ఒకరు తెలియకుండా తాను పరీక్షించటానికి పూనుకున్నాడు. కౌరవులయందు దుర్యోధనుని పిలిచి ఒకనాడు దుర్యోధనా! నాకు ఏదో ఒక ఘనకార్యము కావలసిన అవసరముండి వచ్చాను. నీవు నాకది చేసి పెట్టెదవా?" అని అడిగాడు. తప్పక భగవంతుడే వచ్చి చేయడానికి నన్ను అడిగినప్పుడు నేను దీనిని కాదని చెప్పుదునా? "తప్పక చేస్తాను" అని అహంకారము చేత వాగ్దాన మిచ్చాడు. నాకు ఒక ఉత్తమ చిత్తుడైన వ్యక్తితో అవసరమున్నది. పవిత్రహృదయుడు, శాంత స్వరూపుడు నాకు అవసరంగా ఉంటున్నాడు. అలాంటి వ్యక్తిని ఈ రాజ్యంలోపల ఎక్కడైనా వెతికి తేగలవా? అన్నాడు. "తప్పక తేగలను" అని ఆనాడు రథంలో రాజ్యమంతా తిరిగాడు. ఎక్కడా విచారించలేదు. అహంకారికి విచారించే అవకాశము ఉండదు. తిరిగి వెనుకకు వచ్చాడు. "స్వామీ! అట్టి ఉత్తముడైనటువంటి వ్యక్తి నాకీ రాజ్యములో ఎక్కడా కనిపించలేదు. ఒక వేళ ఒకరో యిద్దరో ఉండినారంటే అందులో నేను మాత్రమే ప్రధానమైనటువంటి వాడను" అని ఆహంకారంగా తెలుపుకున్నాడు. "సరే ఆట్లయితే తరువాత నీలో కొంత అవసరముంది. తప్పక నిన్ను వినియోగించుకుంటాను" అని చెప్పి వెనుకకు వచ్చేశాడు కృష్ణుడు. తిరిగి పాండవుల దగ్గరకు వెళ్లాడు. "ధర్మజా! నీతో ఒక అత్యవసరమైనటువంటి పని ఉండటంచేత వచ్చాను. ఎవరైనా నీ రాజ్యములో అతినీచుడు, దుర్మార్గుడు. అసత్యవాది, అధర్మప్రియుడు ఉండిన తేగలవా?" అన్నాడు. ఈ ధర్మజుడు వినయవిధేయతలలో తాను శిరస్సువంచి అన్ని ప్రదేశములలో వెదకి వచ్చాడు. అతని దృష్టిలో అందరూమంచి వారుగానే కనిపించారు. "స్వామీ! నారాజ్యములో చెడ్డవారైన వారు ఎంతవెదకినా నాకు కనిపించలేదు. అంతో యింతో చెడ్డ తనము నాలోఉండవచ్చును. కానీ నా ప్రజలలో లేదు. ఆ చెడ్డవానిగా నన్నే నీవు స్వీకరించి నీయిష్టం వచ్చిన రీతిగా కావించుకో మన్నాడు. కనుక ఈ దుర్యోధనునకు ధర్మజునకు ఉన్న వ్యత్యాసం ప్రత్యేకంగా మనం విచారించినపుడు దుర్యోధనునిలో ఉన్నటువంటి ఆహంకారమే అతనికి మంచివారు కనబడకుండా పోవటం, ధర్మజుని యందున్న వినయవిధేయతలే అతనికి చెడ్డవారు కనబడకుండా పోవటం. కనుక ఈ మంచిచెడ్డలకు మనయొక్క దృష్టిదోషము మనోదోషములే,మూలకారణం కాని ప్రకృతి యొక్క దోషము కాదు. కనుకనే మొట్టమొదట మన యొక్క దృష్టిని. మనస్తత్త్వమును మనము వినయవిధేయతలుగా మార్చుకున్నపుడు అహంకారము నకు కాని, అసూయలకు కాని అవకాశం లేకుండా ఉంటుంది. ఇంతేకాకుండా ఇంకొక సులభమైన మార్గాన్ని మనం అవలంభించాలను కుంటే సర్వజీవులయందు సర్వేశ్వరుడొక్కడే నా ఆరాధ్యదైవము అందరియందూ ఒకడుగానే ఉంటున్నాడు" అనేటటువంటి తత్త్వాన్ని మనం అభివృద్ధి పరచుకుంటూ రావాలి. కనుక అందరియందు ఉన్నటు వంటి భగవంతునిపై మనం అహంకారం పూనటానికి ఏమాత్రం అవకాశం ఉండదు. అందరియందు ఉన్నటువంటి భగవంతుని అసూయతో చూడటానికి అవకాశం ఉండదు.
(స. సా. అ.79పు.174/175)