భగవదారాధకులను, భగవత్ చిత్రములను భగవత్ స్వరూప శిలలను, సాత్విక మార్గమున ప్రవర్తించు సాధనలు సలుపు మహనీయులను చూచుట, అట్టివారి కథలను వినుట, వారల చిత్రములను స్వరూపములను, ప్రతిమలను ఇంటియందుంచుకొనుట, ఇవ్విధములైన చూపులు, శ్రవణములు సాత్వికములగును. విలాస దృశ్యములు, విలాస చిత్రములు చూచుట కానీ, వాటిని గురించి వినుట కానీ, ఆడంబరములతో అధికారుల వెంట తిరుగుట కాని, అట్టి వారలతో చేరిన చిత్రపటములను వర్ణించుట కానీ, అట్టి చిత్రములే ఇంటిలో యెటు చూచినా ప్రదర్శించుటకాని, అనగా విలాస, ఆడంబర, అహంకార, అధికార చిత్రములు చూచుట కానీ, పూజాగృహములందుంచుట కానీ, రాజసిక మగును. ఇక దుర్మార్గ, దురాచార, క్రూర విషయములను వినుట కాని, చూచుట కానీ, అట్టివారలతో సంభాషించుట కానీ, అట్టివారి చిత్రములను ఇంటియందుంచుకొనుట కాని, భూత ప్రేత, పిశాచారాధనలు కాని, తామసిక శ్రవణ దృశ్యములగును.
(గీ.పు.235)