ఈ జనన మరణములు దేహమునకు మాత్రమే గాని ఆత్మకు లేవు, సత్యములో చేరిపోతే మనకు ఇంక అంతా ఆనందమే.
దేనిని వదలవలెనో దానిని వదిలి పెట్టినప్పుడే ఆనందం దేనిని చేరవలెనో దానిని చేరినప్పుడే ఆనందం.
వదలవలసింది. జగద్భావము. తెలుసుకోవలసింది జీవతత్వము, చేరవలసింది బ్రహ్మత్వము, ఈ మూడూ చేరినప్పుడే మనిషికి ఆనందం. అది తెలియనంత వరకూ దుఃఖమే.
అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయ
ఈ 3 పదములు ముచ్చటగా జీవతత్వమును నిరూపిస్తున్నవి.
అసతోమా సద్గమయ అనగా ‘అసత్తు అనే జగత్తునుండి దైవత్వమనే "సత్తుకు" చేరాలి.
తమసోమా జ్యోతిర్గమయ అనగా దేహమే నేను అనే ఆజ్ఞానం నుండి “జీవుడే నేను" అనే జ్ఞాన జ్యోతిలో చేరాలి. "మృత్యోర్మా అమృతంగమయ" అనగా దేహమనే మృత్యువు నుండి ఆత్మ అనే అమృతత్వంలో చేరిపోవాలి. మృత్యువు దేహమునకే ఉన్నదిగాని దివ్యత్వమునకు లేదనే విషయము తెలుసుకోవాలి.
(త్వశ మ.పు.42)
(చూ|| అనుభవజ్ఞానము, తల్లి తండ్రులు)