సృష్టికి పూర్వము జలమునందు అవ్యక్తముగా నుండిన భూమిని వెలుపలకు తీయుటం చేతనే విష్ణువునకు గోపాల అనే పేరు సార్థకమౌతూ వచ్చింది.
గో అనగా భూమి.గో అనగా స్వర్గము.గో అనగా వాక్కు.గో అనగా గోవు.
భూమిని జలమునుండి తీయటం చేతనే ఇతనికి గోవింద అనే సార్థకనామం కలిగింది. వింద అనగా పొందటం. భూమిని పొందినవాడు కనుక ఇతనికి గోవిందుడు అని పేరు. భూమిని సంర క్షించిన వాడు కనుక ఇతనికి గోవింద అని పేరు. గో అనగా జీవుడని మరొక అర్ధం. జీవులను పాలించువాడు కనుకనే ఇతనికి గోపాల అని మరొక సార్థకనామము. లౌకిక దృష్టితో గోవులను ఆవులను కాచినవాడు కనుక గోపాలుడని మరొక పేరు. గోలోకవాసి అనగా జీవలోకవాసి, జీవుని నివాస స్థానము హృదయము. ఏతావాతా హృదయవాసియే గోపాలుడు అనే సార్ధక నామాన్ని వేదాంతము ప్రబోధిస్తూ వచ్చింది.
(స.వ. 1984.పు. 228)
(చూబృందావనము)