ఈనాడు ముఖ్య అతిథిగా వచ్చిన గోల్డ్ స్టీన్ సామాన్యమైన వాడు కాదు. ఆయనకు ధనమునందు తక్కువ లేదు. విద్యయందు తక్కువలేదు. గొప్ప పేరు ప్రతిష్ఠలు కల్గినవాడు. అతని ఎదురుగా చెప్పకూడదుగాని, అతనిలో చాల సద్గుణాలున్నాయి. అతడు ప్రతి నెల ఇక్కడికి వస్తున్నాడు. ఎందుకోసం తరచుగా వస్తున్నావని నేను అడిగాను. "స్వామీ! నాకు ఆనందం కావాలి. ఆనందం ఇక్కడే ఉంది, బయట లేదు" అన్నాడు. అతనికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారునికి గొప్ప సినిమా యాక్టర్ బిడ్డతో వివాహం నిశ్చయమైంది. వారు కూడా గొప్ప శ్రీమంతులే. గోల్డ్ స్టీన్ తన కుమారుని వివాహం అమెరికాలోనే ఏ చర్చిలో నైనా చేసుకోవచ్చు. ఎంత ఆడంబరంగానైనా చేసుకోవచ్చు. కానీ, అతనికి ఆడంబరమంటే ఇష్టం లేదు. అతనికి మంచితనం కావాలి, గొప్పతనం అవసరం లేదు. ఆ సినిమా యాక్టర్ కూడా తన బిడ్డను తీసుకుని ఇక్కడికే వచ్చింది. గోల్డ్ స్టేన్ తన కుమారుణ్ణి తీసుకు వచ్చాడు. ఇక్కడే చిన్న కోర్కెల రూమ్ లో వారి వివాహం జరిగిపోయింది. ఇప్పుడా బిడ్డలు ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు. రెండవ కుమారుడు కూడా "నాన్నా! నా వివాహం స్వామి ఎక్కడ చెపితే అక్కడ చేయాలి" అన్నాడు. ఆరు సంవత్సరముల నుండి చాల ప్రయత్నం చేశారు. ఒకరోజు గోల్డ్ స్టీన్ ను పిలిచి అబ్బాయిని ఇక్కడికి తీసుకురా అని చెప్పాను. గొప్ప శ్రీమంతులు, మంచి గుణవంతులు, ఆదర్శవంతులైన వారి కుమార్తెతో అతని వివాహం నిశ్చయం చేశాను. సాధారణంగా వివాహమైన తరువాత ఆడపిల్లలు అమ్మ ఇంటి నుండి అత్తవారింటికి పోయే సమయంలో చాల ఏడుస్తారు. ఆ అమ్మాయి కూడా ఇక్కడి నుండి వెళ్ళేటప్పుడు చాల ఏడ్చింది. "కొడుకును ఎత్తుకొని రామ్మా" అని నేను ఆమెను ఆశీర్వదించి పంపాను. ఇప్పుడామెకు ఒక కొడుకు పుట్టాడు. వారిని ఇక్కడికి ఎప్పుడు తీసుకొని రావాలని అడగటానికి అతడు వచ్చాడు. ఈ విధంగా ప్రతి విషయంలో వారు స్వామి ఆజ్ఞానుసారం వర్తిస్తూ ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు. గోల్డ్ స్టీన్ కుమారులిద్దరూ చాల మంచి పిల్లలు. సాయి సంస్థలలో సంబంధము పెట్టుకోవడం చేతనే వారికి మంచితనం అలవడింది. వారి భార్యలు కూడా చాల మంచివారు. ఆమెరికాలోని సాయిసంస్థలను ఇప్పుడు గోల్డ్ స్టేనే చూసుకుంటున్నాడు. భక్తి, క్రమశిక్షణ, కర్తవ్య పాలన ఈ మూడు అతనిలో ఉన్నాయి. మీరు కూడా అట్టి ఆదర్శవంతమైన జీవితాన్ని గడపండి. మంచి పేరు తెచ్చుకోండి. మీరు భవిష్యత్తులో బాగుపడాలనుకుంటే వర్తమానంలో మీ తల్లిదండ్రులను గౌరవించండి. గతాన్ని గురించి చింతించకండి. వర్తమానంలో మంచిగా జీవించండి. భూత భవిష్యత్కాలములను వృక్షములతోను, వర్తమానమును విత్తనముతోను పోల్చవచ్చును. భూత కాలమనే వృక్షము నుండియే వర్తమానమనే విత్తనం వచ్చింది. వర్తమానమనే విత్తనము నుండియే భవిష్యత్తనే వృక్షం రూపొందుతుంది. కనుక, మీరు ఏ చెడ్డ పని చేసినా, ఒకే మంచి పని చేసినా వాటి ఫలితమును అనుభవించక తప్పదు. కనుక, మంచినే చూడండి, మంచినే చేయండి, మంచిగా ఉండండి. దివ్యత్వానికి మార్గం ఇదే.
(స. సా. జ. 2000 పు. 21/22)