నేడు ఆధునికులు కొందరు ఈ గోపుర నిర్మాణమేమిటి, డబ్బు "వేస్టు" అని లెక్కింతురు:
అది కేవలము దూరదృష్టిలేని దుండగుల లక్షణముకాని, ఊర్ధ్వ దృష్టి ఉన్నతభావము ఉన్నత గుణము కాదు. దాని యధార్థమును గమనించిన యెంత గూఢమై, పవిత్రమై, మార్గదర్శకమై యున్నదో చూడుడు! ఊరిబైట అనగా, గ్రామమునకు ప్రక్కల మార్గమున (వెలుపలి భాగమున) బాహ్య కర్మకలాపములలో సత్యమును మరచి, దారితప్పిపోతున్న పాంథులను, ఓయీ! శారీరక మోహబద్దుడవై, అహంకారమమకారివై అశాశ్విత అసత్య అనిత్య భౌతికసుఖములకు బానిసలై నీస్వస్వరూపమైన, నీ జన్మహక్కైన సత్య, నిత్య, నిర్మల నిస్వార్థమైన, సర్వసుఖ నిలయుడైన నన్ను మరచినావు. అందువలన నీవు లోకానికే దుఃఖాన్ని కూర్చుకొంటున్నావు. మధ్యా ప్రపంచ మోహితుడుకాకు, సత్యమైన పరమాత్మను నమ్ము, ఆ వెలుగులలో నడచు; జీవితశాంతికిదే మార్గము; ఇదే ధర్మము; రారారారాఅని పిలుచుచున్న గోపాలదేవుడెత్తిన హస్తమువలె, ఊరియందున్న భవనము లన్నింటికంటే యెత్తైనది గావుండి, గోపురము కనిపించును.
ఈ ఉన్నతభావముతో చేర్చిన గోపురములు మానవుని అధోదృష్టిని తొలగించి పూర్ణ దృష్టిని కలిగించును. ఇదే గోపురము నిర్మించుటలోనున్న ధర్మము. ఇట్టి పరమాశయములతో గోపురములుండును. ఇది సత్యమైన అనుభవధర్మము. అందులో వున్న అఖండజ్యోతియే జీవకోటికి శరణ్యము: ఆ అఖండజ్యోతి స్వరూపుని స్మరింపజేయు చిహ్నము. అది నిత్యకాంతిని చేకూర్చే మహాదీపము. అదే అంతర్ముఖత్వం: అదే బ్రహ్మనిష్ఠ, అదే హరిమయత.
(ధవా.పు. 92/93)
(చూ॥ ఆలయములు, గుడిగోపురాలు)