గ్రంథములు కాని, గురువుకాని, దైవముకాని నిన్ను గమ్యానికి చేర్చలేరు. గమ్యానికి చేరడానికి నీకు నీవే నడవాలి. రహదారులపై ‘గైడ్ పోస్టు ఉంటుంది. "ఈ గ్రామములకు ఇది మార్గము" అంటూ మార్గమును చూపించడమే దాని తత్వము కాని, నిన్ను నడిపించడము కాదు. అదే విధముగా ఎవరికి వారే, స్వశక్తి చేత సుఖాన్ని, ఆనందాన్ని పొందడానికి కృషి చేయాలి.
(శ్రీ భ.ఉ. పు. 170)
గైడ్ పోస్టు అని నాలుగు మార్గములు పోయే ఒక ప్రదేశములో పెట్టి ఉంటారు. ఒక వైపున ఫలానా చోటికి. ఒక వైపున మరొక చోటికి పోతుందని వ్రాసి పెడతారు. ఫలానా గ్రామమునకు ఈదారి పోతుందని గైడ్ పోస్టు పైన వ్రాసి ఉంటుంది. కాని అది మనలను తీసుకొనిపోయి
గ్రామాలకు చేర్చదు. నడువవలసింది మనం. చేరవలసినది. మనం. అది కేవలం దిశను చూపేది మాత్రమే. అదేవిధముగ భగవద్గీత సాక్షాత్కార ప్రాప్తిని విశ్వరూప సందర్శన మార్గమును, విభూతుల శక్తి సామర్థ్యములను నిరూపిస్తుందే కాని ఆచరించవలసింది మనం. కనుక గ్రంథములు చదివి. అనేక విధములుగా పరిశ్రమించి నిరాశా నిస్పృహలకు గురియై దీని పైన నిరుత్సాహము పెంచుకోవటం మంచిదికాదు.
(స.సా. న 84 పు. 297)