అర్థములేని మర్యాదలకు లొంగక ఆత్మగౌరవమునకు ఆహుతి కాకుండుటయే, లజ్జిగల స్రీ యొక్క లక్షణము. ఇట్టి లక్షణమే గృహమునకొక లక్ష్మి. అందువల్లనే ఇల్లాలును గృహలక్ష్మి అని కూడ వాడుచుందురు.
(ధవా. పు. 32)
వివాహమైన స్త్రీకి గృహలక్ష్మి, ఇల్లాలు, ధర్మపత్ని, అర్ధాంగి మున్నగు గొప్ప బిరుదులు ఇవ్వబడినాయి. ఇలాంటి గొప్ప బిరుదులు కలిగిన స్త్రీలను ఈ నా డు పురుషులు చులకన భావంతో చూస్తున్నారు. ఇది చాలా పొరపాటు. స్త్రీలను గౌరవించినప్పుడే పురుషులకు కూడా గౌరవం పెరుగుతుంది. స్త్రీల హృదయాన్ని నొప్పించకూడదు; వారికి కన్నీరు తెప్పించకూడదు. స్త్రీలు కన్నీరు కార్చితే కుటుంబం అనేక కష్టాలకు గురి అవుతుంది. కాలిలో విరిగిన ముల్లును బయటికి తీయవచ్చుగాని, హృదయానికి గ్రుచ్చుకున్న కఠినమైన మాటను వెలికితీయటానికి వీలు కాదు. కనుక, కఠినమైన మాటలతో స్త్రీల హృదయాలను బాధ పెట్టకూడదు. “ఈమె నా భార్య కదా, ఈమెను ఇష్టమొచ్చినట్లు తిట్టే అధికారం నాకుంది", అనుకోకూడదు. భార్య ఏమైనా తప్పు చేస్తే సరిదిద్దవచ్చును. అంతేగాని, ఆమెను ఇష్టమొచ్చినట్లు తిట్టడానికి భర్తకు అధికారం లేదు. అయితే, మగవారందరూ ఆవిధంగా ఉండరు. కాని, కొంతమంది ఉంటారు. మగవారికి కొంచెం కోపం ఎక్కువ. ఆ కోపాన్ని హద్దులో పెట్టుకోవాలి. అది వారికే మంచిది.
(స. సా.. సె. పు. 262/263)
లోకానుభవములో ‘ఉద్యోగము పురుష లక్షణం అని గాని, కర్మ ‘పురుష లక్షణమని గాని అందురు. అది యేమాత్రము సమ్మతించవలసినది కాదు.
సర్వులకూ సమానమైనది, “ధర్మం పురుష లక్షణం" ప్రతి పురుషుడు కూడా ధర్మార్థ కామమోక్షములందు ధర్మ కర్మల ననుసరించవలెను. ఆవే పురుషార్ధ ధర్మములు. స్త్రీలకు పతివ్రత ధర్మమెట్లో, పురుషులకు బ్రహ్మచర్యమట్లు. స్త్రీకి ఏకపతి యెట్లో, పురుషునకు యేక సతి ఆట్లు, స్త్రీ పతిని ఏ రీతిగా దైవముగా తలంచి ఆతని మనసు ననుసరించి ప్రవర్తించుట ఎట్లు పతివ్రత ధర్మమో, పతి కూడనూ తన సతిని గృహలక్ష్మిగా భావించి, ఆమె మనసు ననుసరించి ప్రవర్తించవలెను. అప్పుడే పురుష లక్షణములకు తగినవాడగును.
(శ్రీ.స. సూ. పు. 110/111)
(చూ|| స్వర్గము)