ప్రేమను పెంచుకోండి. మీ విరోధిని కూడా ప్రేమించండి. లేనిపోని మాటలచేత ఇతరుల మనస్సును నొప్పించకండి. ఈనాడు మీరెవరినైనా నొప్పిస్తే భవిష్యత్తులో దానికి పదింతలు మీరు నొప్పి పడవలసి వస్తుంది. అప్పుడు ఏడ్చి ప్రయోజన మేమిటి? మీరు ఎవరికి అపకారం చేసినా దాని ఫలితం పదిరెట్లు భవిష్యత్తులో మీరే అనుభవించవలసి వస్తుంది. ఈ సత్యాన్ని గుర్తించిన వ్యక్తి ఎవ్వరికీ అపకారం తలపెట్టడు. తోటివారికి చేతనైనంత ఉపకారం చేయండి. పల్లెలలోను, పట్టణములలోని మురికివాడలలోను ప్రవేశించి, వాటిని పరిశుద్ధ పరచి, చిన్న పిల్లలకు తగిన సహాయం చేసి, వారికి కడుపుకింత అన్నము, కట్టటానికి ఇంత బట్ట అందిస్తే మీరెంతో మేలు చేసినవారవుతారు. నేను ఇప్పుడే కాదు. చిన్నతనం నుండియే ఇతరులకు సహాయం చేస్తూ వచ్చాను. ఎవరైనా బిక్షగాడు ఇంటి ముందుకు వస్తే, ఇంటివారు ఇప్పుడు లేదు. ఫో. ఫో అనేవారు. కాని వారికి తెలియకుండా నేను మెల్లగా బయటకు తెచ్చి పెట్టేవాడిని. ఎవరికైనా గుడ్డలు కావాలంటే నా దగ్గరున్న పాత వస్త్రములను ఇచ్చేవాడిని. యథార్థం మీకు చెపుతున్నాను - సంవత్సరమంతా ఒక షర్టు, ఒక నిక్కరే ఉండేవి నాకు. స్కూలుకు పోయేటప్పుడు మాత్రం వాటిని వేసుకుని, ఇంటికి వచ్చిన తరువాత విప్పేసి, టవల్ కట్టుకొని, వాటిని ఉతికి ఆరబెట్టుకొని, ఒక పాత్రలో నిప్పులు వేసుకొని ఇ స్రీ చేసుకునేవాడిని. గృహం అబ్బాయి(తండ్రి) ఉండేవాడు. ఆయన నన్ను ఎప్పుడూ తిట్టేవాడు కాదు. ఎప్పుడూ తిట్టలేదు. ఎప్పుడూ కొట్టలేదు. "మహా త్యాగివిరా నీవు, నీ వైరాగ్యం మాకెక్కడొస్తుంది." అని తమాషా చేసేవాడు. నన్ను "వేదాంతి" అని పిల్చేవాడు. గృహం అమ్మాయి (తల్లి) కూడా అంతే! ఆమె కూడా నన్ను చాల ప్రేమలో చూసేది. అనేకమంది భక్తులు ఆమెకు తమ బాధలు చెప్పుకునేవారు. "అమ్మా! స్వామితో మీరైనా చెప్పండి" అని ఆమె పాదాలపై పడేవారు. ఆమె అవన్ని నాతో చెప్పడానికి వస్తే “వారి సుద్దులు, వీరి సుద్దులు నీ వెందుకు పట్టించుకుంటావు? ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకో " అనే వాడిని. “స్వామీ! నేనింత మాత్రమైనా వారికి సహాయం చేయకపోతే నేను పుట్టి ప్రయోజనం మేమిటి? వారి బాధలు మీకు చెపితే చాలు, అవి కొంత పరిహారమవుతాయి. కాబట్టి, మీరు నన్నెంత కోప్పడినా నేను మాత్రం చెప్పటం మానను" అనేది. ఈ విధంగా పవిత్రమైన భావాలతో వారు జీవితాన్ని గడిపారు. కుటుంబమును బట్టి వంశమంతా అభివృద్ధి అవుతుంది. కనుక మీరు ఇంటియందుగాని, బయట గాని మంచిగా ప్రవర్తించాలి. మంచి గుణాలను పెంచుకోవాలి.
(స.సా.మా 99 పు. 63/64)