నేటి ఆధునిక యుగంలో నూటికి 90 పాళ్ళు తల్లిదండ్రులే పిల్లల్ని పాడుచేస్తున్నారు. వారికి ఇష్టమొచ్చినట్లు అధికార మిస్తున్నారు. తప్పులు చేస్తే దండించటం లేదు. పాపాలకు వడిగడితే నిందించటం లేదు. ఫలితంగా వారు మరింత పాతకులుగా మారిపోతున్నారు. అటువంటి కుమారులను తల్లిదండ్రులు ఏమాత్రం క్షమించరాదు. పుత్ర ప్రేమ ఉండవచ్చునుగాని ధృతరాష్ట్ర ప్రేమవలె మాత్రం ఉండరాదు. ధృతరాష్ట్రుని వలె, తల్లిదండ్రులు అక్రమాలు అనాచారాలు చేసే తమ కుమారులను క్షమిస్తూ పోరాదు. ధృతరాష్ట్రుడు కృష్ణుని బోధనలను విస్మరించాడు. విదురుని మాటలను వినలేదు. నా పుత్రులంతటి గొప్పవారు మరెవ్వరూ లేరని విర్రవీగాడు. ధృతరాష్ట్రుడు గ్రుడ్డివాడు. గ్రుడ్డిగా నమ్మాడు తన కుమారుడైన దుర్యోధనుని, ఎన్ని తప్పులు చేసినా మందలించలేదు. దుర్యోధనుని దుశ్చేష్టలకు అంతులేకుండా పోయింది. చిట్టచివరికి నూర్గురు కుమారులు మరణించారు. పుత్రుడు పుట్టినప్పుడే సంతోషించరాదు. పెరిగి సత్కీర్తి తెచ్చినప్పుడు సంతోషించాలి. పిల్లల్ని ప్రేమించవచ్చు. పెట్టేటప్పుడు పెట్టాలి. తప్పులు చేస్తే దండించాలి. ఏమాత్రం వెనుకాడరాదు. చిన్నతనంలో చిన్న తప్పులే చేస్తారు. ప్రేమతో వాటిని ఆమోదిస్తే, పెద్ద వాళ్ళయిన తరువాత పెద్ద తప్పులు చేయటానికి వెనకాడరు. రౌతు కొద్దీ సుఖం. తల్లిదండ్రుల పెంపకం మీదనే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కనుక తల్లిదండ్రుల ప్రేమ ధృతరాష్ట్ర ప్రేమవలె ఉండకూడదు.
(శ్రీ- 97, పుట 40)