ధర్మశాస్త్రము విద్యార్థి, గృహస్థు ఆర్జకుడు, యజమాని, సేవకుడు, సాధకుడు. సన్యాసి మొదలగు అన్ని తరగతులవారి నడవళ్ళును, వారి వారి యంతస్తులకు తగు విధమున నిర్ణయించు చట్టము. ప్రజలు ఆ చట్టమును పాటింపక తామీలోకమునకు వచ్చిన ప్రధాన ప్రయోజనమును మరచి తమ విధి విహితములైన కృత్యములు చెరిచి తప్పు దారులు పట్టినప్పుడు వారిని మరల మంచి మార్గమునకు మరలించుటకై భగవంతుడవతరించుచుండును. అనగా, మానవ రూపమున వచ్చి చెదరిపోయిన ధర్మమును చక్క బరచునని భావము. భగవద్గీతలో "ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే" అన్న భగవద్వాక్యమునకర్థమిదే.
(సా.వ. పు. 2)