కోర్కెల అదుపు కార్యక్రమంలో నాలుగు ప్రధానాంశాలు ఇమిడివున్నాయి. 1. ధనాన్ని వ్యర్థం చేయవద్దు, 2. ఆహారాన్ని వ్యర్థం చేయవద్దు. 3. కాలాన్ని వ్యర్థం చేయవద్దు 4. నీ శక్తిని, మేధస్సుమ వృధా చేయవద్దు. ఈ నాలుగింటిలో పొదుపును పాటించడం ద్వారా దివ్యత్వాన్ని అభివృద్ధి గావించుకొని పరతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఆస్కారం కలుగుతుందని ఈ ఆశల అదుపు కార్యక్రమాన్ని సూచించాము. అయితే కొంతమంది ధనాన్ని వ్యర్థం చేయకుండా ప్రోగుచేసి, ఏదో ఒక కార్యక్రమానికి అర్పించుకోవటమే దీని ఆంతరార్థామని భావించి, వారివారి కార్యములందు వ్యయపరుస్తూ కోర్కెల ఆదుపు కోసం కొంత మిగిలించామని కొంత ధనాన్ని మాత్రమే బ్యాంకులో కడుతున్నారు. ధనాశతో సాయి ఈ సంస్థను ప్రారంభించ లేదు. మీ ఆశలను అరికట్టుకొని వైరాగ్య మార్గంలో దివ్యానందాన్ని అనుభవించాలనే నా ఆశ కాని, పవిత్రమైన నా భావాన్ని అర్థం చేసుకోకుండా కోర్కెల అదుపు పేర కొంత ధనాన్ని సంస్థకు అర్పించటమే దీని లక్ష్యంగా మీరు భావించారు. ఇది సరైన మార్గంకాదు.
భారతదేశంలో కోర్కెల అదుపు కార్యక్రమం క్రింద ఆశలను అరికట్టుకొనక కేవలం డబ్బును మాత్రం ప్రోగుచేసి సత్యసాయి ట్రస్టు పేర 60 లక్షలు కట్టారు. ధనాన్ని ఆశించే తుచ్చభావం నాలో లేదు. ఈనాడు కాదు, ఏనాడుకూడా నేను ఎవ్వరిని ఇంత ధనం కావాలని ఆశించిన క్షణంలేదు. నా పవిత్ర కర్మలే ఆ ధనమును సమకూర్చి ఆయా కార్యాలను జరుపుతూ వస్తున్నాయి. నాకు కావలసింది. పవిత్రమైన ప్రేమ తప్ప ఈ ధనం నాకు అక్కరలేదు. మీ రందరు ఐకమత్యంగా ఉండి దివ్యత్వాన్ని ప్రకటించి ప్రచార ప్రబోధలు సలిపి భారతదేశ ప్రాచీన సంప్రదాయ సంస్కృతులను నిలబెట్టాలి. జన సేవే జనార్ధన సేవ అనే విశాల భావాన్ని పెంచుకోవాలి. నేను నాది అనే సంకుచిత భావాన్ని త్రుంచివేయాలి. ప్రేమ భావాన్ని పెంచుకొని సంకుచిత భావాన్ని త్రుంచుకొని విశాల హృదయంలో సమాజ సేవలో పాల్గొనాలి. ఈనాడే కాదు, ఏనాడు కూడా సత్యసాయి సంస్థలకు ధనం తో సంబంధముండబోదనే నా ఆశ. ధనం సంస్థ పేరును చెడగొడుతుంది.
సత్యసాయి సంస్థ సభ్యులు దేశానికి వెన్నెముక వంటి వారు. కార్యకర్తలు సక్రమమార్గంలో ప్రవర్తించకపోతే సంస్థ అనే వెన్నెముకే విరిగిపోతుంది. సంస్థను పెడమార్గం పట్టించకండి. అన్ని సంస్థలకు ఆదర్శవంతమైన ఈ సత్యసాయి సంస్థను సవ్యమైన భవ్యమైన మార్గంలో ప్రవేశపెట్టి సత్కీర్తిని తెచ్చుకోండి. ధనానికి సత్యసాయి సంస్థకు ఎట్టి సంబంధము ఉండదు. అట్టి సంబంధం కలిగి ఉన్న సంస్థ సత్యసాయి సంస్థ కానేరదు. ప్రేమతో ప్రేమ, హృదయంతో హృదయం చేరినప్పుడే సన్నిహిత సంబంధం ఏర్పడుతుంది. ఈనాడు అన్ని రాష్ట్రాల అధ్యక్షులు ఇక్కడ ఉన్నారు. ఏయే రాష్ట్రం నుండి ఎంతెంత ధనం ప్రోగుచేశారో ఏయే జిల్లా నుండి ఎంతెంత బిక్షమెత్తుకున్నారో ఆ
భిక్షపు ధనం 60 లక్షలు తిరిగి మీకే ఇచ్చేస్తున్నాను. మీరే దీనిని ఉపయోగ పెట్టుకోండి. ఏ జిల్లా నుండి వసూలు చేశారో ఆ జిల్లాలోనే సరైన సేవలు సలిపి దీనులకు దిక్కు లేనివారికి తగిన సహాయం చేయండి, మిమ్మల్ని నేను కోరేది నిర్మలమైన ప్రేమ మాత్రమే. నిస్వార్థమైన ప్రేమకు మాత్రమే నా చేయిని మీ ముందు చాపేది. ఇంక దేకిని కూడా చేయి చాపను. నా చేయి ఇవ్వడానికే తప్ప పుచ్చుకోవడాని కెప్పుడూ ముందుకు రాదు. సత్యసాయి పేరుతో కొంత ధనాన్ని వసూలు చేసినా అది సత్యసాయికి సంబంధించినది కాదనే సత్యాన్ని మీరు గుర్తించాలి. నేను ఆశించను. ఆశించలేదు. ఆశించబోను, ఈ పవిత్రభావం కూడా నాకొరకు కాదు, లోకకళ్యాణం కొరకు, సత్యసాయి సంస్థల సభ్యులందరు పవిత్ర హృదయాలను అభివృద్ధి పరచుకొని ప్రపంచంలో ప్రవేశించి చేరిన మాలిన్యాన్ని శుభ్రపరచి, దివ్యమైన వాతావరణాన్ని అభివృద్ధి పరచాలి. మన పని సేవ, సేవ, సేవ, ఇదే ప్రధాన లక్షం.
(స.సా.డి.85 పు.321/322)
(చూ॥ దుష్ప్రచారములు)