ప్రేమతత్త్వాన్ని అనుభవించే నిమిత్తమై మనం అనేక శ్రమలకు ఓర్చుకోవలసి వస్తుంది.
"పిలిచి అడుగ చెఱకు పెట్టునా బెల్లంబు?
పిప్పి గొట్టి రసము పీల్చకున్న”
చెఱకును బాధ పెట్టడం ఎందుకని ఊరుకుంటే దానిలోని రసము దక్కుతుందా? మన దేహము కూడా మధురమైన ప్రేమతో కూడిన చెఱకు" వంటిది. ఈ శరీరమునకు అనేక విధములైన బాధలు కలిగినప్పుడే ఆదివ్యమైన ప్రేమ మన నుండి ఆవిర్భవిస్తుంది. శరీరమునకు బాధలు కలుగక మనస్సుకు నొప్పి కలుగక, భావములకు విరుద్ధముగాక దివ్యమైన తత్త్యము మనకు లభించాలంటే ఎలా లభిస్తుంది. కాలు కదపకూడదు, గడపదాటకూడదు, నయాపైస ఖర్చుకాకూడదు, కైవల్యం ఒళ్ళో ఉట్టిపడాలి" ఇది ఈనాటి మానవుని భ్రాంతి. భగవంతుని ప్రేమ ఇంతసులభంగా లభించేది కాదు. ఈ ప్రేమ అనే మహావిలువలైన రత్నం త్యాగమనే బజారునందు మాత్రమే లభ్యమౌతుంది.
(స.సా.జ.94.పు.3)
చెరకుగడ తాను నరకబడ్డం, ముక్కలుగా చేయబడ్డం రసంగా పిండబడడం సహించాలి. ఈ కష్టాలే లేకపోతే ఆగెడ ఎండిపోయి ఊరుకుంటుంది. జిహ్వకు తీపి చేకూర్చలేదు. అట్లాగే మానవుడు యిబ్బందుల్ని ఆహ్వానించాలి. అది మాత్రమే అతని ఆత్మకు ఆనందాన్ని సమకూరుస్తుంది.
(సా,అ . పు. 86)