ఒకానొక సమయంలో జనకమహారాజ పండిత మహాసభను యేర్పాటు చేశాడు. ఇందులో గొప్పగొప్ప పండితులంతా ప్రవేశించారు. ప్రతివాది భయంకరులు ప్రవేశించారు. వాగ్థోరణితో జగత్తునంతా ఆడించే శక్తిసామర్థ్యములు కలిగినవారు ప్రవేశించారు. భూమిని కదిలింపజేసేవారు ప్రవేశించారు. వారి ప్రతిభలు, పట్టుదలలు చాలా భయంకరమైనవి. సామాన్య మానవుడు అందులో ప్రవేశించుటకు యేమాత్రము అవకాశములేదు. జనకమహారాజు సమావేశములో గొప్పగొప్ప వారికే అవకాశముంటాది గాని సామాన్యులకు అవకాశముండదు. ఇటువంటి మహాసభలోపల అష్టావక్రుడు ప్రవేశించటానికి ప్రయత్నించాడు. అష్టావక్రుని లోనికి వదలేవారెవరు? అతనికి యెట్టి రెకమెండేషను లేదు, యెట్టి సహాయము లేదు. అతనికున్నది దైవసహాయము ఒక్కటే. దానిని నమ్మినవారికి యెవరికి యేవిధమైన నష్టకష్టములు ప్రాప్తించవు. తాత్కాలికముగా అడ్డులు తగిలినప్పటికిని మున్ముందు విజయమును సాధిస్తుంది. మూడు దినములు జనకమహారాజు ద్వారము దగ్గర కావలి కాచాడు. ఈ సమావేశములో పాల్గొనుటకై వెళ్లే వారలను పండితులను చూస్తూ వచ్చాడు. మహనీయులకంతా యిట్టి ప్రాప్తి లభిస్తుండాది. నాకు కూడను సాధ్యమైతే లభించవచ్చని సంకల్పాన్ని బలహీనము చేసుకోకుండా వున్నాడు. ఎవరో ఒక మహనీయుడు ఇతని పరిస్థితిని చూచి జనకమహారాజునకు చెప్పాడు. ఇతను వయోవృద్ధుడు కాదు. మధ్యవయస్కుడుగా వుంటున్నాడు. ఇతనికి యేమాత్రము భవము లేనట్టుగా కనుపిస్తుందిది. అనుభవమో నిరనుభవమో అనేది నిర్ణయించటము సాధ్యము కాదు. ఏపుట్టలో యెట్టి పాముండునో యెలాంటి వ్యక్తియో యెలాంటి పవిత్రమైన విషయములు వెలువడుతున్నాయో గుర్తించుకోవాలని జనక మహారాజు అతనిని లోపలకు ప్రవేశ పెట్టాడు.
సమావేశము చాలా నిండుగా, పవిత్రమైన వాతావరణములో వుంటుందిది. జనక మహారాజు తన స్థానములో ఆసీనుడయ్యాడు. ఈ సమయములో అష్టావక్రుడు ప్రవేశించాడు. ఇతని రూపమును చూచి సమావేశములో వుండిన గొప్ప గొప్ప పండితులందరూ ఫక్కున నవ్వారు. కానీ జనకుడు కన్ను వాల్చకుండా చూస్తున్నాడు. ఆయన నవ్వలేదు. ఈ లోపల అష్టావక్రుడు పండితులకంటె అధికముగా గట్టిగా నవ్వాడు. పండితులకు ఆశ్యర్యమేసింది. మేము నవ్వటము లోపల కారణము లేకపోలేదు. ఇతను నవ్వటానికి కారణము యేమిటి? అని ఒక పెద్ద సమస్యగా యేర్పడింది. ఇలాంటి వికార ఆకారమును చూచిన యెట్టి మనుష్యునకైన తనకు తెలియకుండానే నవ్వు రావచ్చు. ఇది అమాయకత్వముగా మనము భావించవచ్చు. ఒకతల్లి చంటిబిడ్డను యెత్తుకొని పోతుంటే యెవరైనా వస్తుంటే వారిని చూచి చంటి బిడ్డ నవ్వుతుంది. చంటిబిడ్డ నవ్వితే యెలాంటి వారైనా తెలియకుండా వారు కూడ నవ్వుతారు. ఇది అమాయకత్వములో వుండిన పవిత్రత. కాని యిక్కడ పవిత్రతలో వుండిన అమాయకత్వము. పండితులంతా చాలా గొప్పవారు, అమాయకత్వం లేనివారు. ఈ వ్యక్తి నవ్వటములో కారణమేమిటో గుర్తించాలని అందరూ కాచుకొని వున్నారు. అందులో ఒక పండితుడు సాహసించి నాయనా నీవు యెవరవు? నీ రూపము చేస్తే మాకు నవ్వు వస్తుంది. దీనివల్లనే మేమందరము నవ్వాము. కాని నీవు నవ్వటానికి కారణము యేమిటి? అన్నాడు. అయ్యా! యిక్కడ యేదో గొప్ప పండితుల మహాసభ జరుగుతుండాదని ప్రవేశించాను. ఈ సమావేశములో ఇటువంటివారంతా వుంటున్నారంటే యీ సమావేశమునకే వచ్చివుండేవాడిని కాను. గొప్పగొప్ప పండితులు వుంటారని నేను ప్రవేశించాను. కాని యిక్కడంతా చర్మకారులు మాత్రమే వుంటున్నారు. అన్నాడు. ఈ మాట వినేటప్పటికి పండితులకు చాలా కోపము వచ్చింది. చర్మకారులంటే చెప్పులు కుట్టేవారిని అర్థము. అందరు ఉగ్రులైనారు. అష్టావక్రుడు మీ చర్యలకు యీ పదమే సరియైన పదము అన్నాడు. చెప్పులు కుట్టేవానికే చర్మము విషయము తెలుస్తుంది. మిగతా వారికి యేమాత్రము తెలియదు. కాబట్టి మీరందరు నా చర్మమును చూచి నవ్వుతున్నారు. నా పాండిత్యమును చూడటానికి మీరు ప్రయత్నము చేయలేదు. అన్నాడు. కనుక పండితులైనవారు అంతర్దర్శనము కలిగివుండాలి.
అంతర్దర్శనము లేని తత్వము పాండిత్యమునకు అవకాశము కాదన్నాడు. సత్యమును గుర్తించిన జనకుడు యితనిని ప్రవేశపెట్టి యితని పాండిత్యమును చర్చించుమని కోరాడు. అదేవిధముగనే లోకములో యెంత గొప్పవారైనప్పటికిని బాహ్యదృష్టిని అభివృద్ధి పరచుకుంటారు. గాని అంతర్ దృష్టిని ప్రయత్న పూర్వకముగా సాధించటము లేదు. దేహసౌందర్యము, దేహపటుత్వము, దేహము శక్తిసామర్థ్యములు నీవు వూహించవచ్చును. కాని దైవము మానసికపరిశుద్దినే హృదయము యొక్క శాంతస్వభావమునే పరిశీలిస్తాడు. అంతర్ దృష్టిని అభివృద్ధిపరచుకొని అంతర్భావములను ప్రశాంతమైనరీతిగా చూచుకోవాలి. ఎట్టిసమయమునందు గాని వుద్రేకములకుగాని యింకేవిధమైన ఆవేశములకు గాని గురికారాదు. ఎవరైనా నిన్ను దూషించారనుకో దూషించటము వలన నీకు ఒరిగేది తరిగేది యేమీ లేదు. వారియందుండిన భావములు బయటకు రాని. నివే మాత్రము ఆవేశముతో వుద్రేకమును తెప్పించుకోరాదు. శాంతముగా వుండు. నీపైన ఆతనికి కలిగిన ద్వేషము యేమిటో అదంతా ఒక్కతూరి బయట పడిపోనీ. నీవు నిలపటానికి ప్రయత్నిస్తే అది ప్రమాదమును చేకూరుస్తుంది.
(శ్రీ స. గీ. పు.299/302)
ఒకానొక సమయంలో జనకమహారాజు ఆస్థానంలో పండితుల సభ ఏర్పాటు చేయబడినదని తెలుసుకొని అష్టావక్రుడు వచ్చాడు. అతడు సభలో ప్రవేశించగానే ఎనిమిది వంకరలతో కూడిన అతని దేహాన్ని చూసి పండితులంతా ఫక్కున నవ్వారు. కాని ఆష్టావక్రుడేమీ సామాన్యుడు కాదు. వెంటనే అతడు కూడా వారికంటే గట్టిగా నవ్వసాగాడు. ఆ పండితులందరికీ ఆశ్చర్యం వేసింది. "మేము నీరూపమును చూసి నవ్వాము. దానికొక కారణముంది. మరి నీవు నవ్వటానికి కారణ మేమిటి?" అని ప్రశ్నించారు. అప్పుడు ఆష్టావక్రుడు దానికి చక్కని జవాబు చెప్పాడు. నేను ఇక్కడేదో పండితుల సభ జరుగుతున్నదని భావించి వచ్చాను. కాని ఇంతమంది మూర్ఖులు ఇక్కడ సమావేశమయ్యారని అనుకోలేదు. మీ మూర్ఖత్వాన్ని చూసి నాకు నవ్వు వచ్చింది. పండితా: సమదర్శినః సమత్వమైన ఆత్మతత్వాన్ని చూపేవారు పండితులు, చర్మము యొక్క మంచి చెడ్డలను చూపేవారు చర్మకారులు, పండితుల సభకు మీలాంటి చర్మకారులను మహారాజు ఎందుకు ఆహ్వానించాడా అని నవ్వు వచ్చింది" అన్నాడు. .
(స.సా.ఏ. 97 పు.88)