"పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం:
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే||
అని శ్రీకృష్ణుడు భగవద్గీత యందు తెలిపియున్నాడు. అనగా సద్గుణములు కలిగిన వారిని రక్షించి, దుర్గుణములు కలిగిన వారిని శిక్షించి ధర్మ స్థాపన చేయుట. అని భావిస్తున్నాము. ఇది సరియైనది కాదు. “రాక్షసత్వాన్ని రూపుమాపి, దైవత్వాన్ని అభివృద్ధి పరచి, దివ్యత్వమైన ధర్మాన్ని జగత్తు యందు స్థాపించుట" యే దీనికి సరియైన అర్థము. ఇక్కడ రాక్షసత్వం అనగా ఏమిటి? దైవత్వం అనగా ఏమిటి? అని మనం విచారించాలి. "పరిత్రాణాయ సాధూనాం" అనే పదములో “సాధుత్వం" అనగా నిర్మలంగా, నిస్వార్థంగా, నిరహంకారంగా ఉండిన మావన స్వభావము అని అర్థం. "వినాశాయచదుష్పతాం" ఇక్కడ దుష్కృతములనగా దుర్మార్గులైన, దుష్టులైన మానవులు కాదు. రాగ ద్వేషాలు, అసూయ, అహంకారము - ఇవే "దుష్టులు" ఈ "దుష్టుల" హతమార్చి నిర్మల నిస్వార్థ, నిరహంకారములను రక్షించుటయే - ధర్మ సంస్థాపన, ధర్మమనగా ఏమిటి? రామో విగ్రహవాన్ ధర్మః" భగవంతుడే ధర్మస్వరూపుడు.
(స.సా.న.91 పు.290)