“ఏ పరమభక్తులు ఇతర చింతనలను చేరనివ్వక సర్వకర్మలు ఈశ్వరార్పణ బుద్ధితో సలుపుదురో, నిరంతరము నన్నే ధ్యానించి, సేవించి, పూజించి, స్మరింతురో, అట్టి సర్వకాలములందూ సమాహిత చిత్తులైనవారి యోగక్షేమమును నేనే స్వయముగా చూచుకొను చుందును.
(గీ.పు.163)
గీతలో "యోగక్షేమం వహామ్యహం" అన్నాడు. యోగక్షేమమనగా నీవు బాగున్నావా? మీ ఇంట్లో అందరు బాగున్నారా? అని విచారించడం కాదు. యోగమనగా లేనిది. సంపాదించడము. క్షేమమనగా సంపాదించు కున్నదానిని కాపాడుకోవటం. యోగ క్షేమమనగా అశాశ్వతమైన, అనిత్యమైన, అసత్యమైన యీ దేహమునకు సంబంధించినది కాదు. ఏనాటికైనా, ఎవరిదైనాశ్మశానానికి వెళుతుంది శరీరము. మనము సాధించిన దానిని కాపాడు కోవడం అంటే దానిని సాధించడము? విజ్ఞాన, ప్రజ్ఞాన, సుజ్ఞాన తత్వమును సాధించాము. దీనిని కాపాడుకోవటమే క్షేమం, అంటే –
సౌఖ్య మనుభవింప జాలని వానికి
ఎంత కలిమి యున్న నేమి ఫలము?
నీరు గతుకు కుక్కకు ఏరెంత పారినా
ప్రీతి కలుగబోదు పిసినిగొట్టుకు.
కుక్కకు నీరెంత పోసినా, అది జుర్రుకొని త్రాగలేదు. నాలిక తోనే త్రాగాలి. మనలో దివ్యత్వమనే శక్తి ఆపారంగా ఉన్నప్పటికీ అనుభవింపలేక పోతున్నాము. ఎందువలన? పాతవాసనలచే, దురభ్యాసములచే, దుశ్చింతలచే మనముదానిని నాలుకతోనే ఆనుభవిస్తున్నాము. జుర్రుకొని ఎక్కువగా అనుభవించలేక పోతున్నాము. అలాంటి వారికి తృప్తి వుండదు.
(శ్రీ.ది.పు.102/103)
శ్లో! పత్రం పుష్పం ఫలం తోయం యోమేభక్తా ప్రయచ్చతి
తదహం భక్త్యుపహృత మశ్నామి ప్రయతాత్మనః || గీ.9-26
భక్తితో సమర్పించు పత్రమో, పుష్పమో, ఫలమో, తోయమో ఏదైననూ భగవంతుడు ప్రీతితో స్వీకరిస్తాడు. కాని పత్రమనగా ఏమిటి; ఏ బిల్వ పత్రమో, ఏ తులసీపత్రమో కాదు. ఈ పత్రములన్నియూ ఆయాకాలములో రాలిపోతుంటాయి. కనుకనే దేహము కూడా ఒక పత్రము వంటిదని అన్నారు. ఎప్పుడో కాలము వచ్చినప్పుడు దేహము కూడా రాలిపోతుంది. ఆ దేహమునే పత్రము త్రిగుణములతో కూడినటువంటిది. దీనిని భగవంతునికి అర్పితము చేయాలి. మరి పుష్పమనగా ఏమిటి? ఏ మల్లెపుష్పమో బంతి పుష్పమో, చామంతి పుష్పమో కాదు. ఎప్పటికీ వాడిపోనటువంటి హృదయపుష్పము. దానిని భగవంతునికి సమర్పించాలి. ఇక ఫలము: ఏమిటీ ఫలము? అరటిపండు, అనాసపండు కాదు: కర్మఫలము, నిష్కామబుద్ధితో చేసిన కర్మఫలమును భగవంతునికి కైంకర్యము చేయాలి. తదుపరి తోయము. అనగా బావి నుండి తెచ్చిన జలము, గంగాజలమూ కాదు; పవిత్రమైన ఆనందభాష్పములు. కన్నులను సంస్కృతములో నయనములని అన్నారు. నీరుని నారము అని అన్నారు. కనుక నయవముల నుండి వచ్చే నారములను ఒక్క నారాయణునికి మాత్రమేఅర్పించాలి. అనగా ఒక్క దైవము కొరకు మాత్రమే మనకంటి ధారలను విడవాలి గాని, అన్యచింతలకు మనం కంటిధారలు కార్చకూడదు. అదే నిజమైన తోయము! ఇట్టి ఫల పుష్పాదులను పరిశుద్ధముగా సమర్పించు భక్తులు, అన్య చింతనలు లేక, అనవరతము, అఖండ సచ్చిదానంద పరబ్రహ్మ ధ్యానమందే నిమగ్నులైన అట్టి వారి యోగక్షేమములు భగవంతుడే చూచుకుంటాడు.
(శ్రీభ. ఉ.పు.32)