గురునానక్ ఒకానొక సమయంలోపల హృషీకేశ్కి పొయాడు. అక్కడ నుంచి అందరు దివ్యమైన క్షేత్రమును దర్శిస్తున్నారు. తాను కూడా బదరీ పోవాలని వెళ్ళాడు. మనభారతీయులలో ఉండిన బలహీనత ఒకటే. బదరీలో తల్లిదండ్రులకు కాని పెద్దలకు కాని పిండం పెడితే ఇంక వాళ్ళకు జన్మ ఉండదని విశ్వాసం. అక్కడ పండాలందరు పెరుక్క తింటారు. పోయిన వారందరిని డబ్బుడబ్బని పీడిస్తూ ఉంటారు. ఒక బండపైన కూర్చోబెట్టి అందరికి పిండాలు పెట్టిస్తున్నారు పండాలు. ఇక్కడ పెట్టిన పిండము స్వర్గములోనో నరకములోనో ఉండినవారికందరికి చేరుతుందని వాళ్ళ బోధలు. నది ప్రక్కనే పిండాలు పెడుతుంటే ఈ గురునానక్ అక్కడ నీళ్ళలో పోయి దిగాడు. తూర్పు వైపున తిరిగాడు. నీళ్ళు ఊరికే చల్లుతున్నాడు. ఈ పండాలంతా చూచారు. ఏమిటి ఈ పిచ్చివాడు: నదిలో ఉన్న వీరంతా గట్టుకు చల్లేస్తున్నాడే: అని అందరు నవ్వుతున్నారు. హాస్యాస్పదంగా చూస్తున్నారు. వీరు హాస్యం చేసే కొలదీ అతను మరింత వేగంగా నీళ్ళు చల్లుతూ వచ్చాడు. వీళ్ళపై కూడా చల్లాడు. ఆ పండాలంతా వచ్చి కోపంలో పిచ్చివాడా! ఎక్కడికి నీళ్లు చల్లుతున్నావన్నారు. మా పంజాబులోపల మోగ అనేగ్రామములో మరొక మామిడితోట ఉంటుండాది. ఆ మామిడితోటకు నీళ్ళు చల్లుతున్నానన్నాడు. పిచ్చివాడా! ఉండేది బదరీలోపల, ఆలకనది నీళ్ళు ఇక్కడుంటున్నాయి, అక్కడ మోగ పంజాబులో ఉండే తోటకు నీళ్ళెట్లా చేరతాయి? అన్నారు. ఎక్కడో ఏలోకములోనో ఉన్నతల్లిదండ్రులకు ఇక్కడ పెట్టిన పిండాలు చేరుతుంటే నేనిక్కడ చల్లిన నీరు మోగాకు ఎందుకు చేరకూడదు? అన్నాడు. ఇవి వాళ్ళ బుద్ధిని కదలించే యుక్తులు.
(శ్రీ స.వి.వా.పు. 102)