అర్జునుని దృష్టి కేవలము దేహముల పైన వుండుటచే ఆత్మ దృష్టిని అనుగ్రహించుటయే, దేహ, ఆత్మలను విడదీయుటయే సమస్త సాధలన యొక్క లక్ష్యము. దీనిని బోధించుటయే కృష్ణ బోధ. అర్జునుడు సందేహముల నూహించకున్ననూ తానే ఆ సందేహముల నూహించి సమాధానమును చెప్పెను. అర్జునా! నీవూ, నీకు సంబంధించిన బంధు రాజులూ నీ మూలమున చచ్చెదరని దుఃఖించుచుంటివి. ధర్మములను వల్లించితివి కానీ పండితులు చచ్చిన వారి కొరకును బ్రతికిన వారి కొరకును దుఃఖించరు. యేల దుఃఖింప రందువా? నీవు దుఃఖించునది దేహముల కొరకు కదా! యిది వరకటి పూర్వపు దేహమునకు జరిగిన అవస్థలకు (మార్పులు) దు:ఖించితివా? శిశుత్వము నుండి బాల్యత్వము, బాల్యత్వము నుండి కౌమారము. కౌమారము నుండి యవ్వనము, యవ్వనము నుండి వృద్ధాప్యము, తరువాత మరణావస్థ, మరణము కూడ పై అవస్థలలో ఒక్కటి కదా! పై నాలుగవస్థలకు నీవే మాత్రముదు:ఖించితివి? ఈ మరణావస్థకు దుఃఖించు టెందుకు? ఏది? నీబాల్యమున నీ సోదరులతో ఆటలాడిన దేహము లేదు కదా! ఆనాడు దృష్టద్యుమ్నుని కట్టి తెచ్చిన బాల్య దేహము నేడున్నదా? కాని ఆ విషయము నేటికి కూడనూ నీకు జ్ఞాపకమున్నది కదా! అటులనే నీ దేహావస్థలో మార్పు కలిగిననూ ఆత్మయయిన ప్రజ్ఞానము యే నాటికీ అమృత స్వరూపమును కలిగి యుండును, ఇదే జ్ఞానుల లక్షణము.
(గీ.పూ. 4,5)