మనోవాక్కాయములను ధర్మసాధనల కొరకు వినియోగించిన అది తపోయజ్ఞమగును. ఒకవేళ శరీరమునకు అన్నము దొరకక పస్తుపరుండిన, అది తపస్సగునా? కాదు. చిత్తవృత్తులను అణచుకొనుట యోగమందురు, సర్వకర్మలు చేయుచూ కర్మ బంధములకు చిక్కకుండుటే యోగమందురు, మనస్సును భగవంతునితో లగ్నము చేయు సాథనే యోగము. ఇక స్వాధ్యాయమన, మోక్షశాస్త్రములను భక్తి శ్రద్ధలతో వినయ భయ విశ్వాసములతో పఠించుట. వీటివలన ఋషి రుణము తీరును. దీనివలన పుణ్యము లభించుటయే గాక పాపము నశించును. తరువాత జ్ఞాన యజ్ఞము. ఇది అపరోక్షజ్ఞానము కాదు. సాధన రూపమైన పరోక్షజ్ఞానము. వీటికి సంబంధించిన శాస్త్రములను శ్రద్ధతో విని, పఠించి యుక్తి ప్రయుక్తులతో మననము సలుపవలెను. ఇది సిద్ధరూపము కాదు. ఇట్టి దానినే జ్ఞానయజ్ఞమందురు. పెద్దలవలననూ ఆత్మవిచారణ సలిపి, ఆత్మతత్త్యమును యెరుగవలెనను ఆశనే జ్ఞానమని అందురు. జ్ఞానయజ్ఞమని పిలుతురు. విహితమైన కర్తవ్య కర్మల నొనర్చవలెను. అర్జునా! ఇట్టి పవిత్రజ్ఞానము అందరికీ లభ్యమగునా అని సంశయింతువేమో! లేక ఇది లభించు వుపాయమేది అని ప్రశ్నింతువేమో! విను. ఈ పవిత్రమైన తత్వమును బడయ గోరువారు తత్వవేత్తలగు మహనీయుల చెంతచేరి వారి చిత్తములు ప్రసన్నము లగునట్లు చేసి, సమయ సందర్భములు చూచుకొని వారి మనసు నెరింగి మెలగవలెను."
(గీ.పూ.86)