ఒకానొక సమయంలో నారదుడు వైకుంఠానికి వెళ్ళి విష్ణువును దర్శించాడు. విష్ణువు నారదుణ్ణి పరీక్షింపగోరి, "నారదా! నీకు ఎట్టి బాధ్యతలూ లేవు. ఎట్టి ఆటంకములూ లేవు, సర్వ కాల సర్వావస్థలయందు నారాయణ, నారాయణ అని నామస్మరణతో నీకాలాన్ని పవిత్రం గావించుకుంటున్నావు. కానీ, ఈ సృష్టి రహస్యాలేమైనా నీవు తెలుసుకున్నావా? నేను పంచభూతములను సృష్టించాను. వీటిలో ఏది గొప్పదో నీవు గుర్తించావా?" అని ప్రశ్నించాడు. నారదుడు. "స్వామీ! అనంతమైన అగమ్యగోచరమైన ఈ సృష్టి రహస్యాన్ని నేను తప్ప ఇంకెవరు గుర్తించగలరు"? అన్నాడు. "అయితే, ఈ పంచభూతములలో ఏది గొప్పదని నీవు భావిస్తున్నావు నారదా?" అని ప్రశ్నించాడు నారాయణుడు. "స్వామీ! జలము చాల గొప్పది. ఎందుకనగా, అది ఈ విశాలమైన భూమండలంలో మూడు భాగములు మ్రింగివేసింది" అన్నాడు. "మంచిది, బాగా గమనించావు. అయితే, యింత జలాన్ని అగస్త్యుడు ఒక్క గుటకలో మ్రింగినాడు. కనుక, జలము గొప్పదా, ఆగస్త్యుడు గొప్పవాడా?" అడిగాడు.
"స్వామీ! అగస్త్యుడే గొప్పవాడు" అన్నాడు. "అట్టి గొప్పవాడయిన అగస్త్యుడు ఆకాశంలో చిన్న చుక్కగా ఉన్నాడు. కాబట్టి, ఆగస్త్యుడు గొప్పవాడా, ఆకాశం గొప్పదా? అని అడిగాడు. "స్వామీ! ఆకాశమే గొప్పది " అన్నాడు - నారదుడు. "సరే! కానీ, వామనమూర్తికి బలి చక్రవర్తి మూడడుగుల నేల దానమిచ్చినప్పుడు ఒక్క అడుగుతో భూమిని, రెండవ అడుగుతో ఆకాశమును ఆక్రమించాడు. మూడవ అడుగుకు స్థానం లేకపోవడంచేత బలి చక్రవర్తి తన శిరస్సుపై పెట్టుకున్నాడు. కనుక, ఆకాశం గొప్పదా? భగవంతుడు గొప్పవాడా?" అన్నాడు. "స్వామీ! భగవంతుని పాదమే విశ్వమంతా వ్యాపించినప్పుడు భగవంతుని స్వరూపం ఇంకెంత గొప్పదో! కనుక, భగవంతుడే గొప్పవాడు" అన్నాడు నారదుడు. "నారదా! విశ్వవ్యాపకుడు, అనంతుడు, అఖండుడైన భగవంతుడు భక్తుని హృదయంలో స్వాధీనుడై ఉన్నాడు. కనుక, భగవంతుడు గొప్పవాడా, భక్తుని హృదయం గొప్పదా?" అని అడిగాడు నారాయణుడు. "భక్తుని హృదయమే గొప్పది స్వామీ!" అన్నాడు నారదుడు. అనంత స్వరూపుడైన భగవంతుణ్ణి అణుమాత్రంగా తన హృదయమందు ఇముడ్చుకున్నాడు భక్తుడు. కనుక, ఈ జగత్తునందు అన్నింటికంటే భక్తుని హృదయమే గొప్పది. "అణొరణీయాన్ మహతో మహీయాన్ . భగవంతుడు అణువులో ఆణువుగాను, ఘనములో ఘనము గాను ఉన్నాడు. ఇట్టి భగవత్తత్త్వాన్ని గుర్తించాలంటే భారతీయ సంస్కృతి తత్త్వాన్ని అర్థం చేసుకోవాలి.
(స సా.. జూలై 99 పు. 187/188)