ఒక విద్యార్థికి ఒక క్లాసునందు ఒక అధ్యాపకుడు చరిత్రను ఇంకొక అధ్యాపకుడు భూగోళము బోధించ వచ్చును. యింకొక అధ్యాపకుడు లెక్కలు నేర్పవచ్చును. భూగోళము బోధించు టీచరు ఏదో ఒక మ్యాపు చూపించి ఫలానా దేశములో జనులు ఫలానా రీతిగా వుంటున్నారని చెప్పవచ్చును. లెక్కల టీచరు 3+3+3=9 అని వ్రాసి చూపవచ్చును. చరిత్రను బోధించు టీచరు వివరింప వచ్చును. కాని ఒక్క డ్రిల్లు టీచరు మాత్రము one, two three, four అని EXERCISE చేసి చూపించును. ఇది ఆదర్శవంతమైన విధానం. ఈ విధముగనే ప్రతి అధ్యావకుడు తన Subjectలో డ్రిల్లు టీచరుగాతయారవ్వాలి. తామచేసి చూపించాలి. విద్యార్థులను బీడీలు, సిగరెట్లు తాగకూడదని దండిస్తాము. కాని మనమే బీడీలు, సిగరెట్లు తాగుతున్నప్పుడు యింక వారిని త్రాగవద్దని చెప్పే అధికారము మనకు యెక్కడ వుంది? ఇట్లు అనధికారమును పెంచుకొనుట వలన విద్యార్థుల వద్దనుండి గౌరవము నందుకోలేని స్థితిలో మనము వుంటున్నాము. మనమే ముందుగా ఆచరించి బోధించి నపుడు వారు యే మాత్రమూ మనమాట, మన మార్గమును తప్పక అనుసరించే అవకాశమున్నది.
(శ్రీస. ది. పు 6/7)