అమెరికాలో పూర్వం అబ్రహం లింకన్ అనే వ్యక్తి ఉండేవాడు. అతను చిన్నతనంలో స్కూలుకి వెళ్ళుతుంటే అతని తోటి పిల్లలు "మేము విలువైన దుస్తులను ధరించాము నీవు బీదవాడవు ధరించడానికి నీకు సరియైన దుస్తులు కూడా లేవు" అని హేళన చేసేవారు. పసివాడైన లింకన్ ఈ అవమానాన్ని భరించలేక ఒక నాడు తల్లి ఒడిలో చేరి "అమ్మా! నాతోటి విద్యార్థులు నన్ను చాలా అవమానానికి గురిచేస్తున్నారు" అని ఏడ్చాడు. అప్పుడా తల్ల కుమారుణ్ణి బుజ్జగిస్తూ నాయనా! ఈ అవమానము లన్నీ మన మంచికోసమే ఇతరులు చూపించే గౌరవ మర్యాదలకోసం నీవే మాత్రం ఆశించవద్దు. నీవు ఆత్మగౌరవాన్ని నిల్పుకో అదియే నీ ఆస్తి. అదియే నీ సంపద. అదియే నీ దైవం. ఆత్మగౌరవాన్ని నీవెప్పుడూకోల్పోవద్దు." అని చెప్పింది. ఆ మాటలు ఆ లేత హృదయంలో నాటుకొని పోవడం చేతనే లింకన్ ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొంటూ వచ్చాడు. ఆత్మ గౌరవంతో, ఆత్మవిశ్వాసంతో అన్ని క్లాసులూ చక్కగా పాస్ అవుతూ వచ్చాడు. ఆతనిలోని సద్గుణాలను గమనించి ఆతని స్నేహితులు అతనిని ఎలక్షన్లలో నిలబడ వలసిందిగా ప్రొద్బలం చేశారు. ఒక్క క్షణం పాటు లింకన్ "నేనేక్కడ? ఆ పార్లమెంటు ఎక్కడ? అక్కడ నాకు సీటు లభిస్తుందా? కనీసం ఆ హాలు లోనైనా నేను ప్రవేశించ గలనా?" అని సందేహించాడు. మరుక్షణమే ఆలోచనను దూరంగా పెట్టాడు. నా తల్లి ఆత్మవిశ్వాసమును పెంచుకొమ్మని బోధించింది. అట్టి ఆత్మ విశ్వాసంలో నేను ఎలక్షన్లలో పోరాడతాను. అని తీర్మానించుకున్నాడు. అప్పటినుండి ధృఢమైన ఆత్మవిశ్వాసంలో పోరాడి కట్టకడపటికి పేదవాడైన లింకన్ అమెరికా దేశానికి ప్రెసిడెంటు కావడానికి కారణమేమిటి? ఆత్మ విశ్వాసమే, ఆత్మ విశ్వాసం లేనివాడు ఎటువంటి స్థానంలో ఉండినా తుదకు క్రిందికి దిగజారిపోతాడు.
(దివ్యసందేశము 23.11.2000పు. 4/5)