కారణ మొక్కదానిని దెలుసుకొనిన కార్యము లన్నింటిని తెలుసుకొనవచ్చును. ప్రపంచమంతయూ భగవత్సంకల్పము చేత ఏర్పడినది. ఇది కార్యము,ఏ వస్తువు నిర్మాణము కావలెనన్ననూ కారణము అవసరము. కారణము లేని కార్యము జగత్తున జరుగనేరదు.
కేవలము నామరూపములను చూచి మోహించుట, భ్రమించుట విచారించుట, దుఃఖించుట ఇది కుదర్శనము. ఇవి నానా రూపములతో కనుపించు జడములు. ఈ రూపనామములలో అనగా అనేకత్వములో ఏకత్వమును నిరూపించుట, చూచుట, ఆనందించుట, అనుభవించుట దీనిని సుదర్శనమని యందురు.
అనేకత్వములేని ఏకత్వమే పరతత్వము. దానిని ఆశ్రయించుటే మోక్షము. అదే బ్రహ్మనిష్ఠ అని యనవచ్చును. ప్రతిజీవియు ఈ స్థితిని అనగా మోక్షము లేక బ్రహ్మ ప్రాప్తి పొందియే తీరవలెను. అహంకార మమకారములకు చిక్కి భేదమోదముల ననుసరించు బద్దుడైన మానవునకు ఈ బద్ధత్వమునుండి విముక్తి కావాలనే వాంఛ ఏనాటికైనా ఉదయించక తప్పదు. అట్టి బంధము నుండి విముక్తి కోరుటే ముక్తి. చావనిత్రోవనేమోక్షము. దానిని వెదుకుటయే బుద్ధిమంతుల లక్షణము. ధుఃఖమునందున్నవాడు ఆనందము గలవానిని ఆశ్రయించవలెను. బంధన నిరంతర దుఃఖముతో కూడియుండును. నిరంతర ఆనందస్వరూపుడు భగవంతుడు కనుక, అట్టి ఆనందమయుడైన భగవంతుని ఆశ్రయించుటే దుఃఖ విముక్తి, దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తి, మోక్షమని గుర్తించవలెను.
ఆఖండ రసైక స్వరూపుడు, ఆనందనిలయుడు ఒక పరమాత్మనే. అతనిని ఆశ్రయించిన వారికే అనంతత్త్వముప్రాప్తించును. శబ్ద, స్వర్శ, రూప, రస, గంధాలు ప్రవేశము లేని ఈ పరమ పదం ఆద్యంతరహితమైనది. క్రమంగా దానికోసం ప్రయత్నించాలి. స్థూలము నుండి సూక్ష్మములో, సూక్ష్మము నుండి కారణములో కారణము నుండి మహాకారణము సందు లయము కావాలి. ఇదే సక్రమమైన మార్గము. సామాన్య మానవులు భౌతిక భోగ భాగ్యములకోసం ప్రాకులాడుచున్నారు. కానీ, అంతరంగమున ఉన్నఆత్మానందమును చూడలేకపోవుచున్నారు. అనుభవించ లేకపోవుచున్నారు. దానికై తగిన ప్రయత్నము కూడనూ చేయలేకున్నారు. వారి దృష్టి ఎంత సేపూ బయటి ప్రపంచమునందు ప్రసరించునే కాని ఆంతరంగమునకు ప్రసరించదు. పశ్యతి ఇతి పశుః బయట దృష్టి కలిగి ఉండుట పశు లక్షణము మానవలక్షణముకాదు. చిన్న ఉదాహరణము మన దేహములో నున్న ప్రధాన ఆంగములు కన్ను, ముక్కు నోరు, ఇత్యాది అన్ని అంగములూ బయటకే తెరచుకొని ఉన్నవి. అందువలన దేహదృష్టి పూర్తి పశుదృష్టి అని చెప్పక తప్పదు.
బాహ్య విషయాలు అందుబాటులో ఉన్నట్లు, ఆంతర్లోకం అంతుపట్టదు. ఎవరో నూటికొక్కరు ఈ ఆంతర్ దృష్టిని, అంతరాత్మను సాక్ష్కారింతురు. అట్టివారే బుద్ధిమంతులు. మానవుడై పుట్టిన వాడు ఇట్టి ఆధారమైన అనంతమైన ఆనందతత్వమును పొందవలెను. అది జీవిత పరమార్ధము. అదే జన్మ సార్ధకము. అయితే బాహ్య ప్రపంచమునకు, అంతర్ జగత్తుకు అవినాభావ సంబంధమున్నది. అన్నింటినీ చూచి విని అనుభవించేది, మురిసిపోయేది శరీరము అని అనుకొనుచుందురు సామాన్య మానవులు. కాదు కాదు. ఇంద్రియాలకు, మనసుకు, బుద్ధికి, అన్నింటికి అతీతమైన, అన్నింటిని అదుపులో ఉంచగల, పాలించగల శక్తి మరొకటి ఉన్నది. అదే ఆత్మ,దానిని లక్ష్యములో ఉంచుకొని ఇంద్రియాలలో, మనసుతో, బుద్ధితో నీవు జగత్తును అనుభవించమని తెలుపుతుందీ సూత్రము.
కొండల పైన కురిసిన వర్షము నానాదిక్కులజారి పాయలై ప్రవహించును. అదే వర్షము నిర్మలనదియందు లేక, నిర్మల సరోవరము నందు పడిన, నీటిలో నీరు చేరి, కలసి, నిర్మలముగా మారును. ఆలాగే ఆత్మతత్త్యం తెలిసిన మునులు నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైన రీతిగా మారుతారు. అంతఃకరణ పరిశుద్ధి చేసుకున్న ఆత్మ మన స్వరూపమే అవుతుంది. అప్పుడు రాగద్వేషములు, అభిమాన మమకారములు, శాంతి ఆశాంతులు, దూషణభూషణలు, మనలను ఏమాత్రము చేరవు. బాధించును. అవికూడా మనకు సమత్వమును నిరూపించును. అనగా ఆత్మ తరంగములని బోధించును. నిరూపించును. ఇదే నిజమైన ఆత్మ దృష్టి బ్రహ్మదృష్టి ఏకదృష్టి.
(సు.వా.పు.38/42)