ఈ ఉపనిషత్తు సామవేదాన్తర్భాగమైనది. ఇందు ఎనిమిది ఆధ్యాయములున్నవి. మొదటివైన అయిదు అధ్యాయములు వివిధోపాసనములకును, కడపటి మూడధ్యాయములు జ్ఞానోపదేశమునకును వినియోగమైనవి. ఉపాసనకు చిత్తశుద్దియూ బ్రహ్మజ్ఞానమునకు చింతైకాగ్రము నియతములగు పూర్వాంగములు. కర్మచే చిత్తశుద్ధియు ఉపాసనచే చిత్తైకాగ్రము లభించును. ఇట్లు కర్మోపాసనలు బ్రహ్మ జ్ఞానమునకు కారణము లగుచున్నవి. కనుకనే ముందు కర్మలు, తరువాత ఉపాసనలు పిమ్మట జ్ఞానము ఒకదాని తరువాత ఒకటి, శాస్త్రములందు వివరింపబడినవి.ఛాందోగ్యముప్రథమాధ్యాయమునసామమున కవయవ మగు ఉపాసనలు చెప్పబడినవి. ద్వితీయాధ్యాయమున సమస్త సామము యొక్క ఉపాపనము వివరించబడినది.తృతీయాధ్యాయమునమధువిద్య అనిప్రసిద్ధిగాంచినసూర్యోపాసనలు,గాయత్రిఉపాసనము, శాండిల్ విద్యయు ప్రస్తావించబడినవి.చతుర్థాధ్యాయమందు సంవర్గ విద్యయు షోడశ కళా బ్రహ్మ విద్యము ఉపదేశించబడినవి. పంచమాధ్యాయమున ప్రాణ విద్యా, పంచాగ్ని విద్యా, వైశ్వానర విద్యలు తెలుపబడినవి.(ఉ. వా, పుట. 57)