పాండవులంతా కూర్చొని ఒక విచారణ చేస్తున్నారు. రేపటి దినము యుద్ధము ప్రారంభము అవుతుంది. ఎవరెవరు ఏవీ బాధ్యతలు వహించాలి? ఎవరెవరు ఏఏ దిక్కుకు బయలు దేరాలి. అనే సంగతులు చర్చించి ప్లాన్ వేసుకుంటున్నారు. వీరు ప్లాన్ వేసుకుంటునప్పుడు దుర్యోధనుడు వచ్చాడు. ఎందుకు? గురువుగారయిన ద్రోణాచార్యుడు పాండవులకు తెలియని ఒక పదాన్ని దుర్యోధనునికి చెప్పి పంపించాడు. ఈనాడు వీళ్ళు ఆ పదం యొక్క అర్థం కనుక్కోలేక ఓడిపోతారు. వాళ్ళకు అవమానం అయిపోతుంది అనుకున్నాడు రారాజు పరిగెత్తి వచ్చాడు. పాండవులు ఉన్నచోటుకి వచ్చి ఖజజ ! నాతోడ పోరాడదగునే నీకు? అన్నాడు. నీకు నాతో పోరాడ వీలవుతుందా? అంటే అర్థమయేది. కాని పాండవులకు ఖజజ అంటే ఎవరో తెలియదు. ఖజజ అంటే తామే ఆనుకొని ఎవరో పొరపాటున అర్జునుడు - గాని, లేక ధర్మరాజా గానిలేస్తే అవమానమైపోతుంది. ఈ పదానికి అర్థం తెలియని మూర్ఖులుగా ఉన్నారెమెనని భావిస్తాడేమే! ఈ సంగతిని అర్థం చేసికొన్న కృష్ణుడు భీముని వైపు తిరిగి సంజ్ఞచేశాడు. "లే" అన్నట్లు. అప్పుడు భీముడు లేచాడు. దుర్యోధనునికి దీని అర్థము తెలియదు. తిరిగి వెళ్ళిపోయాడు కట్టకడపటికి ఈ ఐదమంది పాండవులు కృష్ణుని అడిగారు. స్వామి! ఏమిటిది? ఎప్పుడూ కూడనూ మా తల్లి పెట్టిన పేరు కాదే ఇది! ఎవరు పెట్టిన పేరు? అంటే భీముడెలా అయాడు? ఏమిటి? అని అడిగారు. అప్పుడు ఖ- ఆకాశము ‘జ’ దానితో పుట్టినది వాయువు ‘జ’ తిరిగి వాయువులో పుట్టినది వాయుపుత్రుడు, కనుక ఖజజ అనగా "భీముడే" అన్నాడు కృష్ణుడు. ఈ విధముగా సర్వమూ దైవమునకే తెలుస్తుంది కాని అందరికీ తెలిసేది కాదు. ఈ విధంగా సర్వరక్షకుడైన కృష్ణుడు పాండవులను రక్షించుతూ వచ్చుచుండుట చేతనే పాండవులు దిగ్విజయాన్ని సాధిస్తూ వచ్చారు. పాండవులు కూడనూ కృష్ణుని శరణుజొచ్చారు. అదే విధంగానే దైవాన్ని మనం శరణు జొచ్చినప్పుడు ఏ మాత్రమూ ఎందులో కూడనూ, అపజయమనేదే ఉండదు. అన్నింటి యందునూ జయమునే పొందుతాం.
(శ్రీసా.గీపు.380)