ఒకనాడు సమర్థ రామదాసు ఇంటిలో తినడానికి తిండి లేక భార్యాపిల్లలు ఆకలి బాధచే అల్లాడిపోవుటచేత భిక్షమెత్తవలసి వచ్చింది. ఈ సంగతి విని శివాజీ మహారాజు ధన కనక వస్తువులను ఒక పల్లకీలో పెట్టి బంటులతో వారి గృహమునకు పంపించాడు. ఆ పల్లకీని చూసి రామదాసు భార్య "పతి ఆజ్ఞ లేక నేను ఏ వస్తువునూ స్వీకరించను" అన్నది. కొంత సేపటికి ఇంటికి వచ్చిన రామదాసు ఆ పల్లకీని చూసి " ఈ నరవాహనమును ఇంటి ముందు ఎవరు పెట్టారు?" అని అడుగగా, "మీరంతా ఈ ఆనాథ పరిస్థితిలో బాధ పడుతున్న విషయము విని మహారాజు శివాజీకి మీపైన ఎంతో దయ కలిగింది" అని బంటు అన్నాడు. అప్పుడు రామదాసు " ఏమి! నాకు శ్రీరామ చంద్రుడే నాధుడుగా ఉండగా నేను అనాథుడ నెట్లవుతాను? ఆ శ్రీరామచంద్రునికి ఎవరూ నాథులు లేరు. అతడే అనాథుడు. కనుక, ఈ ధన కనక వస్తువులన్నింటినీ ఆ శ్రీరామునికే ఆర్పించండి." అన్నాడట.
(స.పా. డి. 99 వెనుకపుట)
మానవుని విషయ వాంఛలు, ఉద్రేకములు అదుపులో నున్న అతనిలోని సద్గుణములు పెంపొందును. అప్పుడు భగవంతుడే బాధ్యత వహించి అతనివైపు నడిచి వచ్చును. లేని ఎడల మానవుడు ఎదురు చూడవలసి వచ్చును. నాకు నాథుడు లేడు. నేను “అనాథుడను అని నీవు విచారించకుము. దేవు డొక్కడే అనాథుడు. మిగిలిన వారందరకు నారాయణుడు నాథుడు, పోషకుడుగా నున్నాడు. భగవంతు డెప్పుడును మానవుని చెంత అతని సహచరుడుగా, పోషకుడుగా నుండును.
(శ్రీ. సాసు. పు. 94)