సంసార వృక్షము చాలా విచిత్రమైన అశ్వత్థము ప్రపంచమున చూచు వృక్షమునకును, ఈ విచిత్రమైన సంసార వృక్షమునకును చాలా వ్యత్యాసము. ప్రపంచమున చూచు వృక్షములకు కొమ్మలు పైభాగమునందును, వేర్లు లోభాగమైన భూమియందును వుండును అయితే, సంసార ఆశ్వత్థమున అట్లు కాక పూర్ణవిరుద్ధమైనదే, వేర్లు పైభాగమునందును కొమ్మలు క్రింది భాగమునందునూ కనుపించుచుండును! అనగా, తలక్రిందులు వృక్షముగా నుండును. దీనికి అశ్వత్థమని పేరు.
అందులకు అర్జునుడు "దీని కీ పేరు యెట్లు వచ్చినది? ఆ పేరు వచ్చుటకు ఆధార మేమి, స్వామి? మరేపేరైననూ పెట్టవచ్చును కదా? అని అన్నాడు. అందుకు కృష్ణుడు "అర్జునా!విను విచిత్రమైన వృక్షమునకు పేరే పవిత్రము, అదే ఈచిత్రము, విను అశ్వత్థమనగా, అనిత్యము, క్షణికము, అని అర్థము. లోకమున దీనినే రావి చెట్టు అందురు. దీనిలోని ఫలపుష్పాలు తినుటకుగాని, వాసన చూచుటకుకాని పనికి వచ్చునవిగావు. అంతియేకాక ఎల్లపుడూ దాని ఆకులు ఆడుచునే యుండును. వృక్షము విశాలమై యుండును. దీనికి మరొక పేరుకూడనూ కలదు. చలదళమని కూడనూ పేరు: చలించు దళములు కలదని అర్థము. ప్రపంచ వస్తువులు కూడనూ నిరంతరమూ చలన శీలములు. ప్రపంచముయెక్క అనిత్యత్వాన్ని, నిష్ఫలత్వాన్ని నిరూపించుట కోసం, దీనికి అశ్వత్థమనే పేరు వచ్చినది. ప్రపంచముపై వైరాగ్యమును నేర్పి ఊర్ధ్వ దృష్టి కలిగించి బ్రహ్మనిష్టను నెలకొల్పుటే ఈ అశ్వతము యొక్క ప్రయోజనము. .
(గీ. పు. 220)
అశ్వత్థవృక్షమును చూచే వుంటారు. గాలి లేకపోయినా ఆకులు యెప్పుడు ఆడుతూనే వుంటాయి. స్థిరత్వము లేనిది కనుకనే అశ్వత్థము అని దానికి పేరు వచ్చింది. స్థిరత్వము లేకపోవుటవలననే గుఱ్ఱమునకు అశ్వము అని పేరు వచ్చింది. గుఱ్ఱము ఎప్పుడైనా చూడండి. చెవి తప్పితే తోకనో, తోక తప్పితే కాలునో యేదో ఒకటి ఆడిస్తూనే వుంటుంది. కనుకనే అశ్వమేదయాగము చేయాలన్నారు. బుద్దికూడ చాలా తిరుగుతుండేటటువంటిది. రజోగుణములో అధికభాగముపశుత్వము, కొంతభాగము దానవత్వము చేరి వుంటుంటాది. తమోగుణమునకు గురువు కుంభకర్ణుడు. రజోగుణమునకు గురువు రావణాసురుడు. సాత్వికమునకు గురువు విభీషణుడు. ఈ ముగ్గురును అన్నదమ్ములే. కానీ యీ యిరువురు మాత్రము హృదయములో వుంటుంటే చాలా ప్రమాదమును తెప్పిస్తారు.
(శ్రీ.గీ.పు 265)